Published On: Thu, Jan 9th, 2020

ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం చేయూత

* వైయస్ఆర్ ఉచిత పంటల బీమా టోల్ ఫ్రీ నంబరు 1800 599 3366 ఏర్పాటు

* కెఎఫ్‌డబ్ల్యు సంస్థతో ఎంవోయూ చేసుకున్న వ్యవసాయ శాఖ

* ఆరేళ్లలో అభివృద్ధికి రూ.711 కోట్ల రుణం

* వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో రైతులు సాగుచేస్తున్న పంటల బీమా పథకానికి సంబంధించి సమగ్ర సమాచారంతో పాటుగా వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 1800 599 3366 టోల్ ఫ్రీ నంబరును వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. సచివాలయంలోని రెండోబ్లాక్ లో ఉన్న మంత్రుల సమావేశ మందిరంలో బుధవారం టోల్ ఫ్రీనంబరును మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు జర్మనీకి చెందిన కెఎఫ్ డబ్ల్యూ సంస్థ ప్రతినిధులతో జీరో బడ్జెట్ వ్యవసాయ విధానాలకు సంబంధించి వ్యవసాయ శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. కార్యక్రమంలో మంత్రి కన్నబాబుతో పాటు వ్యవసాయశాఖ సలహాదారు విజయ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కమిషనర్ అరుణ్ కుమార్ విదేశీ ప్రతినిధులతో ఎంవోయూ చేసుకొని సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా 2 రకాల ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. జీరో బడ్జెట్, ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.1015 కోట్లు అంచనా వేయగా రూ.711 కోట్లు రుణంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో ఐదేళ్లలో 600 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.  దీంతో పాటుగా పంటల బీమా పథకానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, రైతుల సందేహలను తీర్చేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ టోల్ ఫ్రీ నంబరు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి కన్నబాబు ప్రకటిస్తూ టోల్ ఫ్రీ నంబరును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టోల్ ఫ్రీ నంబరు కు ఫోన్  చేసి తన నియోజకవర్గ పరిధిలోని కాకినాడ రూరల్ మండలంలో సాగు చేస్తున్న పంటల వివరాలను తెలుసుకొని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయ పనివేళల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నంబరు పనిచేస్తుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. పూర్వపు పంటల బీమా వివరాలు, రైతుల సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని తెలిపారు. గతంలో రైతుపేరున నమోదైన మొబైల్ నంబరు, బీమా చేసిన పథకం, సీజన్, పంట మరియు సర్వేనంబరు వివరాలు, బ్యాంకుఖాతా వివరాలు, ఆధార్ నంబరు వివరాలను నమోదు చేయించుకోవచ్చునన్నారు. రైతులకు మరింత దగ్గరగా పథకం వివరాలను తెలిపేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా (పిఎంఎఫ్ బివై), పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్ డ బ్ల్యూ బిసిఐస్) పథకాల ఉత్తర్వులను సవరించి రాష్ట్ర ప్రభుత్వం  రబీ 2019-20 ఏడాదిలో పంట వేసిన ప్రతీ ఎకరాన్నీ ఈ పథకంలోకి తెచ్చేందుకు “100 శాతం రాష్ట్ర ప్రభుత్వ పథకం గా” అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పథకం మొత్తం అమలుకు వ్యవసాయశాఖ నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుందన్నారు. ఆన్ లైన్ లో నమోదు చేసుకొని వ్యవసాయ, ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతులందరికీ ఈ ఉచిత బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. ఆన్ లైన్ విధానంలో నమోదు అంశాలను మంత్రి కన్నబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ-కర్షక్ యాప్ లో పంట వివరాల నమోదు గడువు శనగ పంటకు ఈ నెల 31వ తేదిగా నిర్ణయించారు.మిగతా అన్ని పంటల నమోదుకు ఈ ఏడాది ఫిబ్రవరి 15 గడువుగా నిర్దారించారు. రైతులు బ్యాంకుల ద్వారాగానీ (రుణం పొందిన రైతులు) లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా గానీ(రుణం పొందని రైతులు) బీమా కొరకు ప్రత్యేకముగా నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏ బీమా కంపెనీకి గానీ సాగుదారులు, ప్రభుత్వం కు ప్రీమియం రాయితీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ సచివాలయాల స్థాయిలో వీఏఏ/వీహెచ్ఏ/వీఎస్ఏ మరియు వీఆర్వో లు ఉమ్మడి అజమాయిషీ ద్వారా ఖచ్చితమైన వివరాలను అందించాల్సిన పూర్తి బాధ్యత వారిదేనన్నారు. పంటల నష్టం అంచనా, పరిహారం చెల్లింపులో ప్రభుత్వ విధానాన్నే కొనసాగిస్తామన్నారు. ఎటువంటి నష్టాలు జరిగినా రైతులకు నేరుగా పరిహారాన్ని వారి ఖాతాల్లో జమచేస్తుందని మంత్రి భరోసానిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, వ్యవసాయ సహకార శాఖ, రైతు సాధికారక సంస్థ కో వైస్ ఛైర్మన్ టి. విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ అరుణ్ కుమార్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎన్నారై వ్యవహారాల అధ్యక్షుడు రత్నాకర్ విదేశీ ప్రతినిధుల బృందం, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.   

Just In...