Published On: Sun, Apr 22nd, 2018

ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాల అధికారాలను దెబ్బతీసేలా కుట్రలు

* కేంద్రం పెడధోరణులపై ధ్వజమెత్తిన మంత్రి యనమల 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: నరేంద్రమోదీ ప్రధానిగా ఉంటే భారత ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాలనే మార్చడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆయ‌న‌కు ప్రజాస్వామ్య నాయకత్వ లక్షణాలు లేవ‌ని అన్నారు. అహంకారం, అణిచివేత ధోరణి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. స‌హకార సమాఖ్య పేరుతో రాష్ట్రాల అధికారాలను గండికొట్టేలా కేంద్రం వ్యవహరిస్తోంద‌న్నారు. ఈ కుటిల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు. రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు సంక్రమించిన అధికారాలను కాలరాయాలని కేంద్రం చూస్తోంద‌ని, 15వ ఆర్ధికసంఘం ద్వారా రాష్ట్రాల అధికారాలను నీరుగార్చాలని చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాజ్యాంగ పరంగా ఏర్పడిన స్వతంత్ర సంస్థ ఆర్ధికసంఘం అని తెలిపారు. ఆర్ధిక సంఘాన్ని తన చెప్పుచేత‌ల్లో ఉంచుకోవాలని నరేంద్ర మోదీ చూస్తున్నార‌ని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అసత్యాలు వల్లె వేస్తున్నార‌ని తెలిపారు. ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇవ్వవద్దని 14వ ఆర్ధికసంఘం చెప్పిందనడం అబద్దం అన్నారు. 15వ ఆర్ధికసంఘం ద్వారా రాష్ట్రాలకు నష్టం జరగదని చెప్పడం మరో అబద్దం అని పేర్కొంటూ ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాల అధికారాలను దెబ్బతీసేలా కేంద్రం కుట్రలు చేస్తోంద‌ని య‌న‌మ‌ల విమ‌ర్శించారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాపాడుకోవాల్సిన సమయం అన్నారు. దీనికి అన్ని రాష్ట్రాలు నడుంకట్టాల‌ని కేంద్రం ఏకపక్ష పోకడలను అడ్డుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఇది దేశ సమస్య, ఏ ఒక్క రాష్ట్రానిదో కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా నమ్మకద్రోహానికి పాల్పడ్డార‌ని వ్యాఖ్యానించారు. 15వ ఆర్ధికసంఘం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ కేంద్రం నిర్ణయించడం మరో ద్రోహం అన్నారు. రాష్ట్రాల ఆర్ధిక అధికారాలకు కోత పెట్టేందుకు ప్రయత్నించడం ఇంకో ద్రోహం అని తెలిపారు. కేంద్రం పెత్తందారీ ధోరణులను అన్ని రాష్ట్రాలు నిరసించాలిల‌ని యనమల పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ నిరంకుశ పోకడలను అడ్డుకోవాల‌ని, రాజ్యాంగ మౌలిక స్వరూపాలను కాపాడుకోవాల‌ని, భారత ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని నిలబెట్టాల‌ని మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు పేర్కొన్నారు.

Just In...