Published On: Tue, Nov 13th, 2018

ప్రజా ఫిర్యాదులు, విజ్ణాపనలను సకాలంలో పరిష్కరించాలి

* ఏపీ సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ప్రజల నుండి వచ్చిన వివిధ రకాల ఫిర్యాదులను నిర్ధిష్ట గడువు ప్రకారంలో సకాలంలో పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గ్రీవియెన్స్ ఫిర్యాదుల పరిష్కారంపై రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సిఇఓ బాబు ఎ తదితరులతో సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ పునేఠ మాట్లాడుతూ ఆర్ధికేతరపరమైన ఫిర్యాదులు, విజ్ణాపనలను నిర్ధిష్ట గడువులోగా సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆర్ధికపరమైన అంశానికి సంబంధించిన విజ్ణాపనలను మాత్రం అందుబాటులో ఉన్న నిధులకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలని అన్నారు. ఒకవేళ పరిష్కరించేందుకు అర్హతకలిగి ఉన్నా నిధులు అందుబాటులో లేక పెండింగ్‌లో ఉన్న విజ్ణాపనలను వచ్చే వార్షిక కార్యాచరణ ప్రణాళిక లేదా కొత్తగా బడ్జెట్ నిధులు మంజూరు అయ్యాక పరిష్కరించడంలో ఈ విధంగా పెండింగ్‌లో ఉన్నవాటికి ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ పునేఠ స్పష్టం చేశారు. ఇకపై ప్రతి మంగళవారం సాయంత్రం ఫిర్యాదుల పరిష్కారం విషయమైన అందరు జిల్లా కలక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఆయా శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించనున్నట్టు సిఎస్ పునేఠ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పెండింగ్‌లో ఉన్న వివిధ ఫిర్యాదులు, విజ్ణాపనలు సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలక్టర్లకు డిఒ లేఖ రాయాలని ఆర్టీజి సిఇఓ బాబును ఆయన ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, హోం, సాంఘిక, గిరిజన, బిసి సంక్షేమం, మీ-సేవ, ఐటి, వ్యవసాయం తదితర శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు, పధకాలు అమలులో ప్రజల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉన్న శాఖాధిపతులు, కలక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రగతిని మెరుగుపడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆ తదుపరి మిగతా విభాగాలపై రాబోవు రోజుల్లో దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు. ఆర్ధికేతర విజ్ణాపనలు, ఫిర్యాదులు పెండింగ్‌నకు సంబంధించి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 30వేల 973, తూర్పు గోదావరి జిల్లాలో 24వేల 766, గుంటూరు జిల్లాలో 23వేల 17 పెండింగ్ లో ఉండగా ఆయా కలక్టర్లతో సిఎస్ పునేఠ టెలిఫోన్ ద్వారా మాట్లాడి పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి) సిఇఓ బాబు ఎ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ కైజాలా యాప్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు, ప్రజా స్పందనను తెల్సుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉందని దీనిని రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎక్సైజ్ వంటి కొన్ని శాఖలే పూర్తిగా వినియోగించుకుంటున్నాయని అన్ని శాఖలు ఈకైజా యాప్ ను వినియోగించేలా ఆదేశాలు జారీ చేయాలని సిఎస్‌ను కోరారు. ఈ యాప్‌తో పాటు మీకోసం ప్రజావేదిక, ఐవిఆర్ఎస్ తదితర విధానాల ద్వారా ప్రజల నుండి వచ్చిన విజ్ణాపనలు, ఫిర్యాదులను ఆయా శాఖలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల నుండి మొత్తం కోటి 86లక్షల వివిధ రకాల ఫిర్యాదులు, విజ్ణప్తులు రాగా వాటిలో ఇప్పటికే 72లక్షలకు పైగా ఫిర్యాదులు, విజ్ణాపనలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఉన్న ఆర్ధికేతరపరమైన విజ్ణప్తులను సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని అందుకనుగుణంగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విధమైన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం ప్రజా సాధికార సర్వే ద్వారా వచ్చినవేనని చెప్పారు. సమావేశంలో ఆర్టీజి డైరెక్టర్ అనంతకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Just In...