Published On: Mon, Jan 7th, 2019

ప్రజా సంక్షేమానికి 150 పథకాలు

* ప్రగతిపథంలో లోటు బడ్జెట్ రాష్ర్టం

* సీఎం చంద్రబాబు చలవతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి

* రూ.5,500 కోట్లతో 22 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు

* తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.216 కోట్లు 

* ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి

* జన్మభూమి-మాఊరు సభలో మంత్రి నారా లోకేష్ 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ర్ట అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ప్రజా సంక్షేమం కోసం 150 పథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆరో విడత జన్మభూమి.. మా ఊరు కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్లలో సోమవారం జరిగిన గ్రామసభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2014లో రాష్ర్ట విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందన్నారు. మిగులు తెలంగాణకు ఇచ్చి, లోటుతో ఆంధ్రప్రదేశ్ ని అనాథ చేశారని ఆరోపించారు. ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిందన్నారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందలేదని, అయినా అభివృద్ధి ఏ దశలోనూ ఆగలేదన్నారు. రైతు రుణమాఫీ కింద 15 వేల కోట్లను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేశామని, త్వరలోనే మరో 8 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వంద రోజుల్లోనే 24 గంటలు కరెంట్ సరఫరా చేయడం ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమని పేర్కొన్నారు. వేల కోట్లు వెచ్చించి చంద్రన్న పెళ్లి కానుక , చంద్రన్న బీమా,  సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ లను ప్రభుత్వం అందిస్తోందన్నారు.  పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు పెద్ద ఎత్తున నిర్మించామని తెలిపారు. పల్లెలన్నింటికీ సీసీ రోడ్లు వేశామని, రూ.5,500 కోట్లతో 22 వేల కిలోమీటర్లు రహదారులు వేశామన్నారు. తిరువూరు నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు రూ.216 కోట్లు మంజూరు చేశామన్నారు. దాదాపు 300 చెరువుల అభివృద్ధి, మరికొన్ని రోడ్ల మంజూరు తప్పనిసరిగా చేస్తామని హామీ ఇచ్చారు. సభలో ఎంపీ కేశినేని నాని, జెడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, నేతలు పాల్గొన్నారు.
 

Just In...