Published On: Sat, Jul 14th, 2018

ప్రణాళికతో చ‌దివితే విజయం త‌ధ్యం

* వీఎంసీ డీవైఈవో దుర్గాప్రసాద్

* ప‌దో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల‌కు ఉప‌కారవేత‌నాల పంపిణీ చేసిన ఎన్నారై సాయిచంద్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ ఎడ్యుకేష‌న్‌: విద్యార్థులు ఆరంభం నుండి ఒక చక్కటి ప్రణాళికతో కష్టపడ‌డంతో పాటు ఇష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధించ‌డం తధ్యమని విజయవాడ నగరపాలక సంస్థ  ఉప‌విద్యాశాఖ అధికారి కాప‌వరపు దుర్గాప్రసాద్ విద్యార్థుల‌కు సూచించారు. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ ఉన్న‌త పాఠ‌శాల‌లో తెలుగు పండితునిగా పనిచేసి పదవీవిరమణ పొందిన వారణాసి మల్లికార్జునశాస్త్రి తనయుడు (ఎన్నారై) అమెరికా నుంచి వార‌ణాసి సాయిచందు పంపిన రూ.50వేల ఉప‌కార‌వేత‌నాల నిమిత్తం పంపిన నగదు పారితోషకాన్ని డీఎస్ఎం హైస్కూల్లో 10వ త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్ర‌వారం ఉద‌యం పాఠ‌శాల‌లో నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీఎంసీ డీవైఈవో దుర్గాప్ర‌సాద్ మాట్లాడుతూ విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లయితే ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కాకుండా స‌హాయం చేసే దాతలు చాలామంది ఉన్నారని, వారి దాతృత్వాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అటువంటి కోవ‌కే చెందిన దాత వార‌ణాసి సాయిచంద్‌కు విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు కూడా తాము అందుకున్న సహాయాన్ని మర్చిపోకుండా ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత వీలైనంత మేర‌కు అవసరం ఉన్నవారికి సహాయం చేయాలని సూచించారు. సాయిచంద్ తండ్రి మల్లికార్జున శాస్త్రి మాట్లాడుతూ సాయిచంద్ కూడా ధనవంతుడు కాకపోయినప్పటికీ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు సహాయం చేయ‌డం ద్వారా వారి  చదువు ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంద‌నే ఉద్దేశ్యంతో ఖర్చుతో కూడుకున్న‌ప్పటికీ రూ.50 వేలు ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ఈ సంద‌ర్భంగా దాత సాయిచంద్ పంపిన న‌గ‌దును ప్రతిభ కనబరిచిన 25 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయంగా అందించిన‌ట్లు పాఠ‌శాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.జాన‌కీరాణి తెలిపారు. అలాగే భవానీపురం కేఎస్ఆర్ఎంసీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.అజ‌య్‌కుమార్ ఒక‌టో స్థానం పొందిన విద్యార్థికి రూ.1116 న‌గ‌దును అందించారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ పాఠ‌శాల‌ల సంధానకర్త కె.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు డీవీఎం ప్ర‌సాద్‌, జ్యోతిర్మయి, శార‌ద‌, భాను, సీహెచ్‌వీఎస్‌వీ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Just In...