Published On: Fri, Nov 20th, 2020

ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

* మంచి పౌష్టికాహరం, వ్యాయామం అవసరం

* రోటరీ వైద్య శిబిరంలో అడ్మిన్ డిసిపి మేరి ప్రశాంతి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ప్రస్తుత కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అడ్మిన్ డీసీపీ డి.మేరి ప్రశాంతి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సీతారాంపురంలోని యాపిల్ హెల్త్ కేర్ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ‌ప్రారంభించారు. అనంతరం అడ్మిన్ డీసీ‌పీ మేరి ప్ర‌శాంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ రోజు వారి కార్యక్రమాల్లో బిజిగా ఉండి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తారని అలా
కాకుండా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపిస్తూ ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు చక్కటి ఆహారం తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావన్నారు. రోటరీ హెల్త్ ప్రాజెక్టు నేషనల్ కమిటీ సభ్యులు డాక్టర్ జి.వి.మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల రోటరీ క్లబ్ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉచిత వైద్య శిబిరాలు, నిర్వహించి ఎంతో మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు, కళ్లజోళ్లను అందచేసి ప్రజల ఆరోగ్యానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు పి.మోహన్‌రావు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 500 మందికి ఉచితంగా బ్లడ్ షుగర్, బిఎంఐ పరీక్షలతో పాటు బ్లడ్ ప్రెసర్, పరీక్షలను ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాస్ట్ డిస్టిక్ రోటరీ గవర్నర్లు డాక్టర్ కె.పట్టాభిరామయ్య, డాక్టర్ ఎం.సి.దాస్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సెక్రటరీ ఆర్.వెంకట్, ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ పులిపాక కృష్ణాజీ, పబ్లిక్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్ ఎన్.ఎస్.ఆర్.కె.ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎం.వి.సురేష్, కోశాధికారి కె.జగదీష్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 

Just In...