Published On: Tue, May 7th, 2019

ప్రతి ఓటు లెక్కించండి – పక్కాగా, సిద్ధంగా ఉండండి

* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఓట్ల‌ లెక్కింపు సందర్భంగా ఏ ఒక్క ఓటు కూడా వ‌దిలిపెట్ట‌కుండా ప్రతి ఓటు లెక్కించాలని, అందుకు తగ్గ పక్కా ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులు మాస్టర్ శిక్షకులు ఇతర అధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియని సమర్ధవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. దేశం మొత్తం మీద అత్యధిక మంది దివ్యాంగులు మన రాష్ట్రంలో ఓటు వేశారని తెలిపారు. 18-25 సంవత్సరాల వయసు గల యువత ఓటింగ్ శాతంలో కూడా మూడు శాతం వృద్ధి కనిపించిందని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కూడా ఒక్క సంఘటన కూడా జరుగలేదని చెప్పారు. అందరూ బాగా పని చేశారని ప్రశంసించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా సమర్ధవంతంగా పూర్తి చేయవలసి ఉందన్నారు.  ఇక్కడ పొందిన శిక్షణను జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సిబ్బందికి కూడా శిక్షణా తరగతులు నిర్వహించి అన్ని విషయాలు తెలియజేయాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా  ఖచ్చితత్వంతో  జరగాలని చెప్పారు. ఎన్నికల సిబ్బంది మధ్య పరస్పర సమాచార మార్పిడి అవసరం అన్నారు. ఓటింగ్ లో, ఓట్ల లెక్కింపులో సాంకేతిక అంశాల వల్ల కొంత ఇబ్బంది ఉంటుందని, దానిని ఎంతో జాగరూకతతో అధిగమించాలన్నారు. ఈవీఎంలతో ఓటింగ్ ఫలితాలను తెలియజేసిన అనుభవం ఉందని, అయితే తొలిసారి అందుకు అదనంగా ఈవీపాట్స్ ని లెక్కించడం ఇదే తొలిసారి అన్నారు. అన్ని సందర్భాలలో ఒకే రకమైన నిర్ణయం తీసుకుంటే సమస్యలు తలెత్తవన్నారు. వాతావరణం వేడిగా ఉందని, దానికి ఎన్నికల వేడి తోడైందని పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకొని అందరూ జాగ్రత్తగా పని చేయాలన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే పరిష్కారాన్ని కనుగొనాలని, అటువంటి వాటిని వాయిదా వేయడం ద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుదన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పదేపదే కోరుతున్నామని చెప్పారు.  కొందరు పోలింగ్ ఏజంట్లు కూడా అన్ని విషయాలపై అవగాహన పెంచుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని, అధికారులు  జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఈసీఐ నియమావళిని సమగ్రంగా చదవాలని, సందేహాలను నివృత్తి చేసుకొని, కౌంటింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేసుకోమని సలహా ఇచ్చారు. కౌంటింగ్ ఏజంట్ల గురించి పోలీస్ శాఖ సమాచారం సేకరిస్తుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ద్వివేది చెప్పారు. కౌంటింగ్ విధులలో పాల్గొనే సిబ్బంది ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో చేపడతామని, ఏ సిబ్బంది ఎక్కడ విధులు నిర్వహిస్తారో 24 గంటల ముందు తెలుస్తుందని, ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలో మే 23 ఉదయం 5 గంటలకు వారికి తెలియజేస్తామన్నారు. ఈ మొత్తాన్ని ర్యాండమైజేషన్ ప్రక్రియలో చేపడతామని చెప్పారు. వివిపాట్ ఓట్ల  లెక్కింపులో ఒక నియోజకవర్గ పరిదిలో ర్యాండమ్‌గా ఐదు కేంద్రాలను ఎంపిక చేస్తారని తెలిపారు. దీనిని ఎన్నికల పరిశీలకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించవలసి ఉందన్నారు.
                    గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర బాబు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తొలి అంచె వంద మీటర్ల పరిధి వరకు ఉంటుందని, ఇక్కడ జిల్లా పోలీస్  వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండవ అంచె కౌంటింగ్ కేంద్రం భవన సముదాయ ప్రాంగణం పరిధిలో  రాష్ట్ర ఆర్మ్ డ్ పోలీస్ వ్యవస్థ ఉంటుందన్నారు.  మూడవ అంచె కౌంటింగ్ జరిగే హాలు అని, అక్కడ సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ ఉంటుందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సెల్ ఫోన్ లను, ఆయుధాలను, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను అనుమతించం అని తెలిపారు. ఈసీఐ అనుమతించిన అధికారులకు మాత్రమే కౌంటింగ్ హాలులో సెల్ ఫోన్ లు అనుమతిస్తామని చెప్పారు. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు ఎన్నికల పరిశీలకులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలిపారు. సంబంధిత ఇతర అధికారులు మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని, అందులో తేదీ, సమయంతో రికార్డు కావాలని చెప్పారు. ప్రతి ఏజంట్ కు ఐడీ కార్డు ఇవ్వాలన్నారు.  సెల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వాదనలకు దిగడం వంటి సంఘటలను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. రౌండ్ల వారీ ఫలితాలను వెల్లడించేందుకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ అడ్రెసింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం అధికారిక విధుల్లో ఉన్న సిబ్బంది, డ్యూటీ పాస్ లు పొందిన మీడియా ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. లోక్ సభ, శాసనసభలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు తీసుకువచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలన్నారు. డిప్యూటి సీఈఓ టి.చిరంజీవి మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నియమావళికి సంబంధించి అంశాల వారీగా న్యాయసంబంధమైన వివరాలను తెలియజేశారు. మౌలిక వసతులు, కౌంటింగ్ సిబ్బంది నియామకం, కౌంటింగ్ కేంద్రాలలో రాజకీయ పార్టీల, అభ్యర్థుల అధికారిక ఏజంట్లకు ఏర్పాటు చేసే వివిధ అంశాలను, మార్గదర్శకాలను వివరించారు. సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇందుకోసం ఇప్పటికే సంబంధిత మీడియా యూనిట్ల నుంచి వివరాలు సేకరించి ఈసీఐ అధికారిక లేఖలను విలేకరులకు అందిస్తున్నట్లు తెలిపారు.  మీడియా పాయింట్‌లో నోటీస్ బోర్డులు, టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్ నెట్ సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని చెప్పారు. సమాచార శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికారి ఈసీఐ మార్గదర్శకాల మేరకు చిన్న గ్రూపుల వారీగా విలేకరులను ఆయా కౌంటింగ్ కేంద్రాల లోపలకు తీసుకువెళ్లి, తీసుకువస్తారని వివరించారు. వివి ప్యాట్‌ల పనితీరు, ఓట్ల లెక్కింపు, ఫలితాల‌ వెల్లడి వంటి అంశాలపై మచిలీపట్నం ఆర్డీఓ జె.ఉదయభాస్కర్, పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల లెక్కింపుపై తహశీల్దార్ బీజీఎస్ ప్రసాదరావు, టెక్నికల్ అంశాలపై ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్ వి మల్లికార్జున రెడ్డి, నివేదికలు అందించే విషయంపై, న్యూ సువిధ యాప్ పై ఓఎస్డీ వెంకటేశ్వర రావు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన ఎన్నికల  అధికారి వివేక యాదవ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి డి మార్కండేయులు,  పలువురు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్ఐసీ అధికారుల, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
 

Just In...