Published On: Wed, Oct 16th, 2019

ప్రతి పౌరుడికి ప్రమాణాలతో కూడిన విద్య

* గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

సెల్ఐటి న్యూస్‌, ఏపి రాజ్‌భ‌వ‌న్‌: ప్రతి ఒక్కరికీ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడ‌మే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్స్ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య (ఉన్నత విద్య), రిటైర్డ్ జస్టిస్ కాంతారావు (పాఠశాల విద్య), బిసి కమీషన్ ఛైర్మన్ రిటైర్డ్ జస్టిస్ శంకర నారాయణ తదితరులు బుధవారం గవర్నర్ బిశ్వ‌భూషన్ హరిచందన్‌ను రాజ్ భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఉన్నత విద్యా సంస్థలలో నాణ్యమైన విద్యను అందజేయడం, ఫీజులను నియంత్రించడంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి ఆశయాలతో ఉన్నత విద్యా కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య గవర్నర్‌కు వివరించారు. కమిషన్ నిర్మాణం గురించి గవర్నర్‌కు వివరించిన ఈశ్వరయ్య కమీషన్‌లో వైస్ చైర్‌పర్సన్, చార్టర్డ్ అకౌంటెంట్, సాంఘిక శాస్త్రాలు, దంత వైద్యం,  వ్యవసాయం రంగాలలో నిపుణులుగా ఉన్న వారు సభ్యులు ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ దేశంలోనే మొదటిదని, రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు చట్టబద్దంగా ఏర్పాటు చేసిన తమ రెగ్యులేటరీ జారీ చేసే మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాయని గవర్నర్‌కు వివరించారు. కమీషన్ నిబంధనావళిని అనుసరించి కాలానుగుణంగా విద్యాసంస్ధలకు మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. పాఠశాల విద్య పరంగా ప్రజలకు అందుబాటులో వ్యవస్ధ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పాఠశాల విద్య  కమీషన్ ఛైర్మన్ కాంతారావు వివరించారు. బిసి కమీషన్ కార్యకలాపాలను గురించి బిసి కమీషన్ ఛైర్మన్ శంకర నారాయణ వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యాసంస్ధల తీరు తెన్నులపై గవర్నర్  బిశ్వభూషన్ వీరితో చర్చించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Just In...