ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలి
* పేద విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీలో మంత్రి వెలంపల్లి
పాతబస్తీ(విజయవాడ), సెల్ఐటి న్యూస్: ప్రతి విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అందుకే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ పాతబస్తీలోని పి.ఎస్.ఎమ్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలోని సెమినార్ హాల్లో శ్రీ గరిణె సత్యనారాయణ ఛారిటీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి వెలంపల్లి విద్యార్థులకు ట్యాబ్‌లను అందచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ముఖ్యంగా విద్యార్థుల కోసం అమ్మఒడి , విద్యాదీవెన, విద్యా వసతి పథకాలను ప్రారంభించి ఎంతోమంది పేద విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. కళాశాల సెక్రటరీ రావూరి సుబ్బారావు (దత్త) మాట్లాడుతూ తమ కళాశాలలో అత్యుత్తమ విద్యను అందించడంతో పాటు అర్హులైన పేద విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు పంపిణీ అద్భుతమైన అవకాశమని తెలిపారు. చదువుకోలేని, ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు తమ కళాశాల ఉచితంగా విద్యను అందించడంతో పాటు కొంతమందికి ఫీజులో రాయితీలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, పిజి కోర్సుల్లో తమ కళాశాల విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. శ్రీ గరిణె సత్యనారాయణ ఛారిటీస్ మేనేజింగ్ ట్రస్టీ మాజేటి సతీష్‌కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ తరపున ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు నిమిత్తం ఉపకార వేతనాలను అందజేశామని తెలిపారు. సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులను గుర్తించి వారికి ఉచితంగా ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ట్యాబ్‌ల ద్వారా ఆన్లైన్ విద్య సులభంగా అభ్యసించేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యస్.కె.పి.వి.వి. జనరల్ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య, పి.ఎస్.ఎమ్.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీరామకృష్ణ, కోశాధికారి కొత్తమాసు వెంకటేశ్వరరావు, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విధ్యాధరరావు, కెబిఎన్ కళాశాల సెక్రటరీ తూనుగుంట్ల శ్రీనివాసరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.