Published On: Wed, Nov 27th, 2019

ప్రపంచ బ్యాంకు సహాయంతో రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధి

* వాటర్ షెడ్డు పథకం కింద సుమారు 25 ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌

* ప్ర‌పంచ బ్యాంకు వాటా రూ.270 కోట్లు, ఏపి ప్ర‌భుత్వ నిధులు కేటాయింపు రూ.125 కోట్లు

* ఏపి సీఎస్ నీలం సాహ్నితో ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధుల భేటీ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలోని వర్షాభావ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు సహా ప్రకాశం జిల్లాల్లో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో వాటర్ షెడ్డు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం బుధవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీలో ప్రాజెక్టు అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వర్షాభావ జిల్లాలైన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాల్లో వాటర్ షెడ్డు పథకం కింద సుమారు 25 ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను ప్రపంచ బ్యాంకు 178.50 యూఎస్ మిలియన్ డాలర్లు అనగా సుమారు రూ.270 కోట్లను సహాయం అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులుగా మరో రూ.125 కోట్లను సమకూర్చనుందని సీఎస్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మంజూరైన తర్వాత ఆరు సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందని ఈ నేఫ‌ధ్యంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఉద్యావన, పశుసంవర్థక, పట్టు పరిశ్రమ తదితర శాఖలు కన్వర్జెన్స్ విధానంలో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని వర్షాభావ ప్రభావిత ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలకు వాటర్ షెడ్ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పెద్దఎత్తున చేపట్టే నీటి సంరక్షణ పనుల వల్ల ఆయా జిల్లాల్లో భూగర్భ జలమట్టం గణనీయంగా పెంపొందించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలో ఈ ప్రాజెక్టు గురుంచి గ్రామ సచివాలయ వ్యవస్థలను పూర్తిగా భాగస్వాములను చేసి ఈ ప్రాజెక్టులు విజయవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. సమావేశంలో సహజ వనరుల నిర్వహణ సీనియర్ స్పెషలిస్ట్ మరియు టాస్క్ టీం లీడర్ గ్రాంట్ మిల్న్ మాట్లాడుతూ వాటర్ షెడ్ ప్రాజెక్టుల అమలుకు వివిధ రాష్ట్రాలతో కలిసి పనిచేయడం జరుగుతోందని తెలిపారు. ప్రపంచ బ్యాంకు మల్టీ స్టేట్ వాటర్ షెడ్ ప్రాజెక్టు కింద 178.50 యూఎస్ మిలియన్ డాలర్ల సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యంకు ద్వారా 70:30 నిష్పత్తిలో నిధులు సమకూర్చడం జరుగుతోందని పేర్కొన్నారు. వాటర్ షెడ్డు ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన సాంకేతిక తోడ్పాటును అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, ప్రపంచ బ్యాంకు బృందం ప్రతినిధులు, పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Just In...