Published On: Fri, Nov 30th, 2018

ప్రపంచ వ్యాప్తంగా భూమిలో ప్రకంపనలు

* కార‌ణాల‌పై అన్వేషిస్తున్న శాస్త్రజ్ఞులు 

సెల్ఐటి న్యూస్‌, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మానవమాత్రులు గుర్తించలేకపోయిన ఓ విషయాన్ని యంత్రాలు పసిగట్టాయి. భూకంపాలను పరిశీలించడంపై ఆసక్తిగల ఔత్సాహికుడు ప్రపంచాన్ని ఏకకాలంలో చుట్టేసిన ప్రకంపనల గురించి వెల్లడించారు. ఇది చాలా అసాధారణమైన భూకంప సంకేతమని తెలిపారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కనిపించిందని పేర్కొన్నారు. @ఎంఏటీఏఆర్ఐకేఐపీఎఎక్స్ హ్యాండిల్‌ యూజర్ భూకంపాలను ఆసక్తిగా పరిశీలిస్తారు. ఈ యూజర్ మాత్రమే అమెరికా జియొలాజికల్ సర్వేకి చెందిన రియల్ టైమ్ సీస్మోగ్రామ్ డిస్‌ప్లేలో ఈ సంకేతాలను మొదట గుర్తించారు. ఈ ఔత్సాహికుడి పోస్ట్ భూకంపాలను పరిశీలించే శాస్త్రవేత్తలకు చర్చనీయాంశమైంది. ఈ కంపనలకు కారణాలేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శాస్త్రవేత్తలకే అంతు చిక్కని ప్రకంపనలు నవంబరు 11న ఉదయం 9.30 గంటలకు ప్రపంచాన్ని చుట్టేశాయి. 20 నిమిషాలపాటు ఈ ప్రకంపనలుకొనసాగాయి. హిందూ మహా సముద్రంలోని మయోటీ ద్వీప తీరం నుంచి 15 మైళ్ళ దూరంలో ఈ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. మడగాస్కర్, ఆఫ్రికా మధ్య ఈ ద్వీపం ఉంది. మయోటీ ద్వీపం నుంచి ప్రారంభమైన ఈ ప్రకంపనలు యావత్తు ఆఫ్రికాలోనూ, జాంబియా, కెన్యా, ఇథియోపియా, అట్లాంటిక్‌ను దాటి చిలీ, న్యూజిలాండ్, కెనడా, హవాయిలలో కనిపించాయి. భూకంపాల అనంతరం వచ్చినట్లుగానే ఈ కంపనలు కూడా భూకంప లేఖినిపై కనిపించాయి. అయితే ఈ నెల 11న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మయోటీలో కానీ, ఇతర చోట్ల కానీ భూకంపం సంభవించలేదు. అయినా భూకంప లేఖినిపై ఈ సంకేతాలు నమోదయ్యాయి. దీనికి కారణాలేమిటనే అంశంపై శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉల్కాపాతం సంభవించిందా? భూగర్భ జలాల్లో ఏదైనా భూతం ఏదైనా ఉందా? అణు పరీక్ష జరిగిందా? అనే అనుమానాలతో ఒక్కొక్కరూ ఒక్కొక్క వాదనను లేవనెత్తుతున్నారు.

Just In...