Published On: Thu, Jan 10th, 2019

ప్రవాసాంధ్రులకు బాసటగా బీమా సౌకర్యం

* ముఖ్య‌మంత్రి చంద్రబాబు 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: విదేశాలలో ఉండే ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రులకు తమ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని బుధవారం నాడు జరిగిన ప్రవాసాంధ్ర దివస్ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. గల్ఫ్ ప్రాంతంలో సుమారు 8 లక్షల మంది తెలుగు వారు ఉన్నారని, వారిలో చాలా మంది ఉద్యోగ, ఉపాధి సదుపాయాలు సరిగా లేకుండా ఇబ్బంది పడుతున్నారని.. మరికొంతమంది ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయి ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతియొక్క ఆంధ్రుడి సంక్షేమం తమ బాధ్యతగా భావిస్తున్నానని, వారంతా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంస్థ (ఏపీ ఎన్ఆర్టీ) వారి బాగోగులను చూసే బాధ్యత చేపట్టిందని తెలిపారు. గల్ఫ్ దేశాలలో తెలుగువారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఉచిత ప్రవాసాంధ్ర భరోసా బీమా కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశంలోనే ఇలా బీమా సౌకర్యం కల్పించడం మరెక్కడా లేదని గర్వంగా చెబుతున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పథకం కింద మరణించినా, అంగ వైకల్యం పొందినా 10 లక్షలరూపాయల పరిహారం చెల్లిస్తారని చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డవారికి లక్ష రూపాయలు, ఉద్యోగాలలో తమ యాజమాన్యాలతో వివాదాలు వచ్చినప్పుడు న్యాయ సహాయం కింద రూ.45 వేలు అందిస్తామని చెప్పారు. ఉద్యోగం కోల్పోతే తిరిగి రావడానికి ఉచితంగా టిక్కెట్లు అందించడం, ప్రసూతి సహాయం కింద 50 వేల రూపాయలు ఇవ్వడం ఈ బీమా పథకంలోని ముఖ్యమైన అంశాలని సీఎం తెలిపారు. ప్రభుత్వం తరపున ఉన్న తెల్లరేషన్ కార్డు సహా ఎటువంటి ప్రయోజనాల్ని ప్రవాసాంధ్రులు నష్టపోరని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ప్రవాసాంధ్రులకు ఎల్లవేళలా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని, ఈ సంస్థకు 166 దేశాలలో లక్షా పదివేల మంది సభ్యులున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రవాసులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సర్వీసుల్ని ఏపీ ఎన్ఆర్టీ అందిస్తుంద‌ని ముఖ్యమంత్రి తెలిపారు. గల్ఫ్ లో పనిచేస్తున్న తెలుగు వారంతా వెంటనే ఈ బీమా సౌకర్యం పొందడానికి రిజిస్టర్ కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం జిల్లాలలోని కొన్ని గ్రామాలలోని వెలుగు సెంటర్లు తగు సహాయ, సహకారాలు అందిస్తాయని చెప్పారు. ప్రవాసాంధ్రుల భద్రతకు సంబంధించిన చర్యల విషయంలో వారికి చేదోడువాడోడుగా ఉండడానికి సీఐడీ విభాగంలో ఎన్ఆర్ఐ పోలీసు సెల్‌ను ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు.

Just In...