ప్రాచీన భాషలపై కేంద్రం కుట్ర …
* విశిష్ట అధ్యయన కేంద్రాలకు స్వయంప్రతిపత్తిని కొనసాగించాల్సిందే
* ఏపి అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
విజయవాడ, సెల్ఐటి న్యూస్: ప్రాచీన భాషలను, సంస్కృతిని కాపాడుకునేందుకు భాషాభిమానులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. భారతీయ ప్రాచీన భాషలలో అతి పురాతనమైన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో విలీనం చేయకుండా యథాతథంగా కొనసాగించాలని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతీయ భాషలు ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ భాషల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థలను భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో విలీనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం విచారకరమన్నారు. ఇటువంటి నిర్ణయం వల్ల దేశంలోని ప్రాంతీయ భాషలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి తెలుగు భాష కోసం ఏర్పాటుచేసిన విశిష్ట అధ్యయన కేంద్రం ద్వారా తెలుగు భాషపై పరిశోధన, జానపద కళల సంరక్షణ, గ్రంథాలయాల వంటి వాటిని ఏర్పాటు చేయటం, భాషపై పరిశోధన చేస్తున్న భాషాభిమానులకు అందుతున్న సహకారం సందిగ్ధంలో పడతాయన్నారు. అలాగే.. ప్రాచీన భాష అభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులు కూడా భారతీయ భాషా విద్యాలయం ఖాతాలో జమవుతాయని, తద్వారా ప్రాంతీయ భాషల మనుగడ ప్రశ్నార్ధకమవుతుందన్నారు. తెలుగు భాష విశిష్టత అధ్యయన కేంద్రం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. ప్రాచీన భాషల విశిష్టతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో
ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ళ నారాయణరావు, వెన్నా వల్లభరావు, గుమ్మా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.