Published On: Fri, May 29th, 2020

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వ‌హించండి…

* జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్ నీలం సాహ్ని ఆదేశం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు బోధనాసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 25 శాతం ఎంపిక చేసిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రజలకు కరోనా పరీక్షలు ఎక్కడా చేస్తారనే అవగాహన ఉంటే కరోనా లక్షణాలు ఉంటే వాలంటరీగా ముందుకు వచ్చి సకాలంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి టెస్టులకు చేయించుకుంటారని చెప్పారు. కావున ఆదిశగా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 25 శాతం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడెక్కడ అనేది జిల్లా కలెక్టర్లు నిర్ణయించి ఆప్రకారం ఏర్పాట్లు చేసి టెస్టులు చేసేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు. హోం క్వారంటైన్లో ఉన్న వారిని క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన ఇన్‌స్టంట్ ఆర్డర్ సంఖ్య 52లో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని చెప్పారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని ఆ విధంగా చేయడంతో కరోనా వైరస్ కు సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ కు ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. ఈ అరోగ్య సేతు యాప్‌లో ఆయా వ్యక్తులు సరైన వారి మొబైల్ నంబరే ఇచ్చారా లేక వారి బంధువులు వేరే నెంబరు ఇచ్చాలనేది చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం ఆసుపత్రుల సన్నద్ధం, ఐఇసి కార్యక్రమాలు ఏవిధంగా నిర్వహింస్తుందీ కలెక్టర్లను ఆరాతీశారు. వీడియో సమావేశంలో సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.

Just In...