Published On: Sat, Jul 14th, 2018

ప్రాధాన్యతా రంగాలకు సహకరించండి

* బ్యాంకర్లకు చంద్రబాబు విజ్ఞప్తి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ప్రాధాన్యతా రంగాలకు బ్యాంకర్లు సహకరించాలని, సకాలంలో బ్యాంకు రుణాలివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో శుక్రవారం ఆయన 203వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొని 2018-19 వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ సకాలంలో బ్యాంకులు రుణాలిస్తే వ్యవసాయ దిగుబడులు పెరిగి రైతులు క్షేమంగా ఉంటారని చెప్పారు. ఆలోచనలు బాగానే ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడమే సమస్య అని, రైతు రుణమాఫీ అమలులో తొలి ఏడాది తాము అనేక కష్టాలను ఎదుర్కొన్నామని, వాటిని ఎలా అధిగమించారో ముఖ్యమంత్రి వివరించారు.  ఎవరూ సహకరించకపోయినా రైతు ప్రాధికార సంస్థ ఏర్పాటుతో ఎలా అధిగమించానో తెలిపారు.. రైతులలో  వ్యవసాయం మీద విశ్వాసం తీసుకొచ్చాంమని, రైతులకు ఎరువులు, సూక్ష్మపోషకాలు అన్నీ సకాలంలో ఇచ్చాక  దిగుబడి పెరిగింది, వ్యవసాయంలో వృద్ధి రేటు పెరిగిందన్నారు. వ్యవసాయ రుణాల అమల్లో సాధికార సంస్థ సహకారం తీసుకోవాలన్నారు. విభాగాల వారీగా వెళ్లాలని, తాము పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సమాచారాన్నంతటినీ ఆన్‌లైన్ లో ఉంచుతున్నామని చెప్పారు. సామర్ధ్యం పెంపుదల, నైపుణ్యాభివృద్ధితో బ్యాంకర్లు తమ సేవలను మెరుగుపర్చుకోవాలని సూచించారు.
పరీక్షలు రాసే విద్యార్ధుల్లా ప్రతి మూడు నెలలకు ఒకసారి వృద్ధిరేటు తనకు ఒక పరీక్ష అని, సమీక్షించుకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. నెలవారీగా ప్రణాళికా బద్ధంగా ఇంక్లూసివ్‌నెస్ పై కార్య ప్రణాళికలు రూపొందించుకోవాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి సూచించారు. తద్వారా వృద్ధిరేటును, ప్రజల్లో సంతోష శాతాన్ని, వృద్ధిని అంచనా వేయవచ్చ‌ని ముఖ్యమంత్రి చెప్పారు. అనేక బ్యాంకులు ప్రతిభా సామర్ధ్యాలు నిరూపించుకోలేకపోతున్నాయని, బ్యాంకులను కాపాడుకోవటం మీ బాధ్యత కాదా అని ఆయన బ్యాంకర్లను ప్రశ్నించారు. ప్రాధాన్యతా రంగానికి సమ్మిళిత పద్ధతిలో వనరులను సమీకరించి వ్యయం చేస్తున్నామని తెలిపారు. కాగా  పెద్దనోట్ల ఉపసంహరణతో దేశమంతా బ్యాంకులు డిపాజిట్లు లేక ఇబ్బందులు పడితే, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులలో చేరిన డిపాజిట్లలో 9% వృద్ధిని గమనించవచ్చని ఓ అధికారి తెలుపగా ప్రణాళిక ప్రకారం పనిచేయాలని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, అనంతపురం ఎడారి గా మారిందని, రైతులు వ్యవసాయం వదలివేసి, పంటవిరామం ప్రకటించిన దుస్థితి నెలకొందని అయితే వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగమిషన్‌గా తీసుకుని ఒక దార్శనికతతో ముందుకు సాగినట్లు, ఎరువులు, సూక్ష్మ పోషకాలను సకాలంలో ఇచ్చి ఉత్పాదన పెంచామని, తద్వారా రైతులలో ధైర్యం వచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు. సకాలంలో రుణాలు అందకపోవడమే సమస్య అన్నారు. వ్యవసాయరంగాన్ని సంస్కరణలతో ఆధునీకరించినట్లు చెబుతూ ఇ-క్రాపింగ్, జియోట్యాగింగ్ విధానాలను ఉదహరించారు.  గత నాలుగేళ్లలో వ్యవసాయంలో స్థిరత్వం వచ్చిందని, పద్ధతి ప్రకారం సమస్యలను అధిగమించామని తెలిపారు.  పద్థతి లేకుండా వెళితే సమస్యలు వస్తాయని, తాము పరిపాలనా సమాచారాన్ని ఆన్‌లైన్ లో ఉంచి పారదర్శకత పాటిస్తున్నామని, అన్ని సర్టిఫికెట్లను ఆన్ లైన్ ద్వారా ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తుందని, సుస్థిర, సమ్మిళిత అబివృద్ధికి తోడ్పడుతుందని, ఈ రంగానికి బ్యాంకర్లు చేయూతను అందించాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రుణాల మంజూరు నుంచి రుణాలివ్వడం దాకా వివరాలన్నింటినీ ఆన్ లైన్ లో ఉంచాలని కోరారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యాన రంగం అధికారులతో కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్.ఎల్ బీ.సి కి మినిట్స్ రాసుకొని అమలు చేయాలని  ముఖ్యమంత్రి సూచించారు.   రైతులకు ఆదాయాన్ని పెంచే రైతు ఉత్పాదక సంస్థలలో సభ్యుల సంఖ్యపై ఒక బ్యాంకర్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పందిస్తూ ఒక సంఘంలో 50, మరో సంఘంలో 75 ఉండవచ్చని, ఇలాంటి పది పదిహేను సంఘాలను ఒక సమ్మేళనంగా (కాన్ఫెడరేషన్) గా తీర్చిదిద్దవచ్చని సూచించారు. ఫార్వర్డ్, బ్యాక్ వర్డ్ ఇంటిగ్రేషన్ పద్ధతులు ఉంటాయన్నారు. తాము కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగుచేయాలన్న లక్ష్యంతో ఒక ప్రణాళిక రూపొందించుకుంటే తొలిదశలో సమస్యలు వచ్చాయని తెలిపారు.
చిత్తూరు మామిడి రైతును ఆదుకున్నాం: ముఖ్యమంత్రి
గత ఏడాది చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి కాయలు కిలో ఒక్కింటికి రూ.8 రూపాయల ధర ఉంటే ఈ ఏడాది ఒకేసారి రూ.4 రూపాయలకు పడిపోతే తాము జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. పల్ప్  ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాము కోల్డ్ చెయిన్‌ను అభివృద్ధి చేశామని, ప్రభుత్వం కిలో తోతాపురి మామిడి ఒక్కింటికి రూ.2.50 పైసలు సబ్సిడీ ఇవ్వగా, ఫ్యాక్టరీ యజమానులు రూ.5 చెల్లించారని దాంతో కిలో.రూ.7.50 పైసలతో రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.  ఏజెన్సీ ప్రాంతాలలో అనేక గ్రామాలలో ఒకే బ్యాంకు శాఖలున్నాయని ఓ అధికారి చెప్పారు.  బ్యాంకింగ్ ఏజెంట్ల ద్వారా బ్యాంకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేయగా, సాధికార మహిళల సహకారం తీసుకోవాలని  సూచించారు.  వ్యవసాయ రంగానికి చేయూతను అందించే కార్యక్రమాల్లో రైతు సాధికార సంస్థతో కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించుకొని సమీక్షించుకోవాలని, సబ్ కమిటీలు సమావేశం కావాలని సీఎం సూచించారు.  రసాయన ఎరువుల వాడకాన్ని 15% తగ్గించగలిగామని వ్యవసాయాధికారి తెలుపగా, ఇంకా తగ్గించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. తాను అధికారం లోకి వచ్చిన సమయంలో ఏ ఒక్క రంగంలో పరిస్థితి సానుకూలంగా లేదని, అంతా నిరాశాజనకంగా ఉందని, విభజనతో రాజధాని లేదని, తాను పనిచేయడానికి కార్యాలయం లేదని, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, అనంతపురం జిల్లా ఎడారిలా ఆందోళన కలిగించిందని గుర్తు చేశారు. వచ్చిన మూడు నెలలకు హుద్ హుద్ తుఫాను విరుచుకుపడిందని, ప్రజలు, అధికారుల సహకారంతో అన్ని సంక్షోభాలు అధిగమించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కష్టపడి రెండంకెల వృద్ధిరేటు తీసుకొచ్చామన్నారు. ఐటీ, ఇంటర్ నెట్ సమాహారంగా వచ్చిన ఐఓటీ పరిజ్ఞానంతో పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం తమకు సమప్రాధాన్యాలని అంటూ పెన్షన్ల చెల్లింపులో, నరేగా పథకం అమలులో లేదా చంద్రన్న బీమా.. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ఆన్ లైన్ ద్వారా చేపట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా అమలు చుస్తూ  పారదర్శకత పాటిస్తున్నామని అన్నారు.  తాము విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన పెద్ద పరిశ్రమ కియా కార్ల పరిశ్రమ అని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్-1 గా మనం ఉండటం దగ్గర నుంచి పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య అనుకూలాంశాలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేశాయని వివరించారు. ప్రజల ఆహారపుటలవాట్లు మారుతున్నాయని, అందుకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు తెచ్చామని, ఉద్యాన పంటల్ని భారీగా ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.  స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించుకుని పనిచేస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని, వ్యవసాయం, ఆరోగ్యం..ఇంకా అనేక రంగాలు మెరుగైన ఫలితాలతో అగ్రగాములుగా ఎదిగాయని అన్నారు. జీఎస్డీపీ కి వ్యవసాయరంగంనుంచే 34% వస్తోందన్నారు.  రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం లాంటి ఆదాయం లేని జిల్లాలున్నాయని,కడప, కర్నూలు ఫర్వాలేదని, అందుకే తాము అన్ని జిల్లాలు సమంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. తాను ఎస్.ఎల్.బి.సి సమావేశాలు నిర్వహిస్తూ బ్యాంకర్లతో సంభాషించేది లబ్దిదార్లకు మరింత మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతోనే అన్నారు. సమావేశాల్లో యాంత్రికత వద్దని, రొటీన్ గా సమావేశాలు ఉండకూడదని చెప్పారు. యువజనాభా, టెక్నాలజీ  ఆంధ్రప్రదేశ్ బలమని,  అందుకే అనేక రంగాల్లో నెంబర్-1గా నిలిచామని అన్నారు. ఒక అజెండాతో ముందుకెళ్లాలని, సమావేశాలు మూసపోసినట్లు ఉండకూడదన్నారు.
2018-19 వార్షిక రుణ ప్రణాళిక రూ. 1,94,220 కోట్లు
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర  వార్షిక రుణ ప్రణాళిక (2018-19) ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
మొత్తం వార్షిక రుణ ప్రణాళిక 2018-19: రూ.1,94,220 కోట్లు. ప్రాధాన్యతా రంగం: రూ.1,44,220 కోట్లు. ప్రాధాన్యేతర రంగం: రూ.50,000 కోట్లు. భారీ పరిశ్రమలు రూ.10,457 కోట్లు. ఎం.ఎస్. ఎం.ఇ రూ.3,745   కోట్లు. మైక్రో ఎంటర్ ప్రైసెస్: రూ.14,028. స్మాల్ ఎంటర్ ఫ్రైసెస్ రూ.11,500 కోట్లు. మీడియం ఎంటర్ ప్రైసెస్: 2,733 కోట్లు. మొత్తం ఎం.ఎస్ ఎం.ఇ రుణాలు రూ.28,261 కోట్లు. వ్యవసాయ రుణ ప్రణాళిక మొత్తం: రూ.1,01,564 కోట్లు కాగా స్వ వ్యవసాయ రుణ ప్రణాళిక మొత్తం రూ.1,01,564 కోట్లు. స్వల్పకాలిక ఉత్పాదక రుణాలు రూ.75,000 కోట్లు. వీటిలో కౌలు రైతులకు ఆర్ధిక సాయం రూ.7,500 కోట్లు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు రుణాలు రూ.21,323 కోట్లు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు రూ.241 కోట్లు అనుబంధ కార్యక్రమాలకు రూ.5,000 కోట్లు వరుసగా ప్రతిపాదించారు.

Just In...