Published On: Wed, Jun 12th, 2019

ప్ర‌జలు – ప్రభుత్వానికి మధ్య వారధిగా ప‌నిచేస్తాం…

* ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ గా తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.  ప్రజలు – ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేయడంలో సమాచార శాఖ ముఖ్య భూమిక పోషించనుందని కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి అన్నారు. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ మరియు  ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా  బాధ్యతలు స్వీకరించిన టి. విజయకుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు.  తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఙతలు తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రప్రజలందరికీ చేరువ చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు కాబట్టి వారికి జవాబుదారీతనంగా ఉండాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సమాచార, పౌరసంబంధాల శాఖ విధులను నిర్వర్తించడంలో కీలక పాత్ర అయిన మీడియా, జర్నలిస్ట్‌లకు ప్రభుత్వ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సకాలంలో సమాచారం అందించేందుకు శాఖలోని ఉద్యోగులంతా కలిసి పనిచేయాలన్నారు. తద్వారా ప్రభుత్వం పనిచేసే కార్యక్రమాలతో పాటు, పనిచేసే ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత ఏర్పడే విధంగా సమాచార శాఖ పని చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌లకు సంబంధించిన సమస్యలపై త్వరలోనే సమీక్ష జరిపి వారికి మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటామని సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Just In...