Published On: Thu, Oct 3rd, 2019

ప్ర‌జల బాటే.. మా ప్రభుత్వం బాట

* దేశ చరిత్రలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం

* ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆవిర్భావం

* గ్రామ సచివాలయాలు పెత్తనం కోసం కాదు.. సేవ కోసమే..

*  తూర్పు గోదావరి జిల్లా కరపలో లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్

* వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి

* ముఖ్య‌మంత్రి వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, క‌ర‌ప‌: దేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆవిర్భావం జరుగుతోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి దాదాపు 500 రకాల సేవలు అందుతాయని ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిద్వారా లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ ప్రభుత్వం ఏనాడూ ప్రజల బాట విడవబోదని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వాలంటీర్లను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సీఎం వైయస్ జగన్ ప్రజలను కోరారు. అధికారం చేపట్టిన తర్వాత కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఏ రాష్ట్ర చరిత్రలోనూ, దేశంలోనూ గతంలో ఎక్కడా జరగలేదని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్న ఆయన, వచ్చే అయిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా.. పంచాయతీ వ్యవస్థలో ఒక వినూత్న  శకానికి నాందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, సచివాలయాల వ్యవస్థను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, కరపలో బుధవారం ప్రారంభించారు. నాడు దివంగత మహానేత వైయస్సార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘ఇందిరమ్మ’ పథకాన్ని కూడా కరప గ్రామం నుంచే ప్రారంభించడం విశేషం. మహాత్మా గాంధీ 150వ జయంతోత్సవాల వేళ..  రాష్ట్రమంతటా గ్రామ, వార్డు సచివాలయాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి మండలానికి ఒక గ్రామ సచివాలయాన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లతో ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరపలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సందేశం రాష్ట్రమంతటికీ చేరేలా వీడియో స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. దీంతో అన్ని చోట్లా గ్రామ సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా చూశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు.

ప్రతి గడప గడపకూ..
‘నేడు మహాత్ముడి 150వ జయంతి. గాంధీ గారి పేరు మన మనసుకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా, ఆయన ప్రవచించిన అహింస, సత్యాగ్రహం గుర్తుకు వస్తాయి. వాటితో బ్రిటిష్ పాలకుల మీద ఆయన చేసిన పోరాటం ఏనాడూ మర్చిపోలేము. నాడు గాంధీగారు
అన్న మాటలు..
అంటే మన భారతీయ ఆత్మ అంతా కూడా మన గ్రామాల్లోనే ఉందని మహాత్మా గాంధీ చెప్పారు. గ్రామాలు లేని రోజున దేశమే లేకుండా పోతుందని మహాత్ముడు చెప్పారు. అలాంటి గ్రామాలను అభివృద్ధి చేయాలని, పరిపాలనను ప్రతి గడప గడపకూ తీనుకుపోవాలన్న ఆరాటంతో
దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశాం’ అని సీఎం శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.

కనీ వినీ ఎరుగని రీతిలో..

రాష్ట్రంలో ఎప్పుడూ చూడనిది, దేశంలో ఎక్కడా జరగనిది. ప్రతి 2 వేల జనాభాకు 10 నుంచి 12 ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అని సీఎం పేర్కొన్నారు. ఇది గతంలో ఎక్కడా కనీ వినీ ఎరగలేదన్న ఆయన, పరిపాలనను ప్రతి గడపకు తీసుకుపోవడంతో పాటు, ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా చేయడం కోసమే ఈ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 10 మందితో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున.. ఈ నాలుగు నెలల్లో దాదాపు 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామని, ఇది దేశంలోనే ఒక రికార్డు అని చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లాలో..
ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1271 గ్రామ సచివాలయాలు, వాటికి పట్టణ వార్డు సచివాలయాలు కూడా కలుపుకుంటే మొత్తం 1585  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మొత్తం 13,640 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఇది ఒక అరుదైన రికార్డు అని సీఎం తెలిపారు. ఇక గ్రామ వలంటీర్లు 30558 ఉద్యోగాలు.. రెండూ కలిపితే ఈ ఒక్క జిల్లాలోనే 44,198 ఉద్యోగాలు ఇచ్చామంటే ఇది కూడా ఒక రికార్డు అని గుర్తు చేశారు.

500 రకాల సేవలు:

గ్రామ సచివాలయాల్లో 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి దాదాపు 500 రకాల సేవలు అందుతాయని, వచ్చే జనవరి 1 నాటికి ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. అక్టోబరు 2న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, గ్రామ సచివాలయాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఈ రెండు నెలల్లో ఏర్పాటు చేసి, డిసెంబరులో వాటిని వినియోగించి చూస్తామని తెలిపారు. వాటిలో చిన్నాచితక సమస్యలు గుర్తిస్తే అన్నీ సరి చేసి జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో సమర్థంగా పని చేస్తాయని, ఆ విధంగా పేదల ముఖంలో చిరునవ్వు చూస్తామని చెప్పారు.

ప్రతి గ్రామ వలంటీర్ కు స్మార్ట్ ఫోన్..

ప్రతి గ్రామ వలంటీర్కు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తామని, ప్రతి 50 ఇళ్లకు అవసరమైన అన్ని ప్రభుత్వ సేవలు వారు అందిస్తారని, ఆ ఇళ్లకు ఒక పెద్ద కొడుకుగా వ్యవహరించి, ఎక్కడా వివక్ష చూపకుండా, అవినీతికి తావు లేకుండా సేవలందిస్తారని వివరించారు.
పాదయాత్రలోనే.. ఈ ఆలోచనకు అంకురార్పణ:

‘నా 3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చాలా దగ్గర నుంచి చూశాను. చాలా చోట్ల ప్రభుత్వమే లేనట్లు కనిపించింది. మంచి స్కూల్, వైద్య సదుపాయాలు లేవు. చివరకు రేషన్ బియ్యం కూడా నాసి రకం. అది కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఇక రేషన్కార్డు, పెన్షన్, ఇంటి స్థలం చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం. స్వయంగా చూశాను. ఎక్కడ చూసినా వివక్ష. ఎక్కడ చూసినా అవినీతి. దాంతో ప్రజలది అగమ్యగోచర పరిస్థితి. వారికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడమే సరిపోయింది. అవన్నీ నా సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో చూశాను’.

‘ఈ పరిస్థితి మారాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందాలన్న తపనలో నుంచి పుట్టుకొచ్చాయి గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ’ అని సీఎం శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.
ఎక్కడా లంచాలు ఇవ్వాల్సిన పనే ఉండదు..

ప్రజలకు ఏది కావాలన్నా, ఏ సమస్య ఉన్నా, మహిళా పోలీసు కానీ, శిశు సంక్షేమం కానీ, డెయిరీ పౌల్ట్రీ సేవలు కానీ.. ఏవైనా గ్రామ సచివాలయాలు చేసి పెడతాయని సీఎం తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయం పక్కనే షాప్లు ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందిస్తామని చెప్పారు. అదే విధంగా ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి రైతులకు శిక్షణనిస్తామని, ఆక్వా రంగం కోసం కూడా వాటిని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

ఆ విధంగా ఈ వ్యవస్థ ద్వారా గ్రామాలను పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తామని, నవరత్నాల పథకాలను కూడా నేరుగా ఇంటి గడపకు చేరుస్తామని, ఏ పనికీ ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో సేవలు:

‘అక్టోబరు నుంచి రెండు నెలల సమయం అడుగుతున్నాము. డిసెంబరు నాటికి గ్రామ సచివాలయాల్లో కంప్యూటర్లు, స్కానర్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. వాటి ద్వారా జనవరి 1నుంచి అన్ని సేవలు అందిస్తాము. గ్రామ సచివాలయ, గ్రామ వలంటీర్ వ్యవస్థ ఏది కూడా ప్రజలపై రాజ్యాధికారం చేయటం కోసం ఏర్పాటు చేయలేదు. ప్రజలపై అధికారం చలాయించడం కోసం ఏర్పాటు చేయలేదు. మనమంతా ప్రజలకు సేవకులం. ఈ విషయం గుర్తుంచుకోండి. గ్రామ సచివాలయ, గ్రామ వలంటీర్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రధాన కారణం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడమే’ అని సీఎం శ్రీ వైయస్ జగన్ వివరించారు.

ఓటు వేయని వారికి కూడా సేవలు అందిస్తాం..

మన వ్యవస్థ నిజాయితీగా ఉండాలని.. గత ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారికి కూడా సేవలందించి, వచ్చే ఎన్నికల నాటికి వారు మనకే ఓటు వేసేలా ఈ సిబ్బంది పని చేయాలని సీఎం కాంక్షించారు. ఇంకా ప్రజల సౌకర్యం కోసం 1902 టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేశామని, ఇది సీఎం ఆఫీనుకు నేరుగా కనెక్ట్ అయి ఉంటుందని తెలిపారు. ఎక్కడ అవినీతి జరిగినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామ సచివాలయాల్లో పని చేసే తన సొంత తమ్ముళ్లు, అక్కా చెల్లెమ్మలకు చెబుతున్నానని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని అన్నారు.

నాడు–నేడు:
‘ఇంకా పలు కార్యక్రమాలకు ఈ 4 నెలల్లోనే శ్రీకారం చుట్టాం. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఫోటోలు తీయమన్నాను. ఆ తర్వాత మా ప్రభుత్వానికి 3 ఏళ్ల సమయం అడిగాం. ఆ సమయంలో స్కూళ్లలో పరిస్థితి పూర్తిగామారుస్తాము. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. మూడేళ్ల తర్వాత అవే స్కూళ్ల ఫోటోలు తీసి, రెండింటినీ చూపుతాము. ఈ ప్రక్రియలో గ్రామ సచివాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలో దాదాపు 44 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఏటా 15వేల స్కూళ్ల చొప్పున మార్పు చేస్తాము. నాడు–నేడు అంటూ అన్ని ఫోటోలను గ్రామ
సచివాలయాల్లో పెడతాము’.

‘స్కూళ్లు మాత్రమే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా మారాల్సి ఉంది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులు దారుణంగా మారాయి. ఎలుకలు చంటి పిల్లలను కొరకడం చూశాం. ఆపరేషన్ థియేటర్లలో సెల్ఫోన్ లైట్తో పని చేయడం చూశాం. కాబట్టి ఆస్పత్రులను కూడా పూర్తిగా మార్చాల్సి ఉంది. వాటిని కూడా నాడు-నేడు అని చూపుతాము’ అని ముఖ్యమంత్రి వివరించారు.

నిరక్షరాస్యత ఉండకూడదు:

పిల్లల చదువు, ఆరోగ్యాన్ని కూడా ప్రయారిటీగా తీసుకుంటామని, ఈ ప్రక్రియలోనే జనవరి 26న అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యులున్నారని, ఈ పరిస్థితి మారాలని, 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో నిరక్షరాస్యులు అన్నది ఉండకూడదని అన్నారు. అందుకే అమ్మ ఒడి పథకంలో పిల్లలను బడికి పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తామని, గ్రామ వలంటీర్లు నేరుగా ఇళ్లకు వెళ్లి ఆ సేవ అందిస్తారని చెప్పారు.

రైతులకు సహాయం:

రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం,   గ్రామ సచివాలయం, గ్రామ వలంటీర్లు వచ్చిన కొన్నాళ్లకే రైతులకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడిగా ఇస్తామని తెలిపారు. ఈ గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల పనిలో ఎక్కడా అవినీతికి, వివక్షకు తావు లేకుండా చేస్తామని పేర్కొన్నారు.

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు..

సొంత ఆటో, క్యాబ్ ఉన్న ప్రతి డ్రైవర్కు ప్రభుత్వం అండగా ఉంది అన్న సంకేతం ఇస్తూ అక్షరాలా 1.72 లక్షల మందికి అక్టోబరు 4న రూ.10వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఇంత పెద్ద కార్యక్రమంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చేయగలుగుతున్నామంటే  గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాలు చేస్తున్న కృషి ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించాలని అన్నారు.

మద్యాన్ని నియంత్రిస్తున్నాం..

‘గాంధీ జయంతి అంటే మనకు ఇంకొకటి కూడా గుర్తుకు వస్తుంది. మద్యంపై మనం పోరాటం చేస్తున్నాం. గతంలో రాష్ట్రంలో 4380 మద్యం షాపులున్నాయి. వాటికి అనుసంధానంగా ప్రతి గ్రామంలో బెల్టు షాపులు. రాష్ట్రమంతా దాదాపు 43 వేల బెల్టు షాపులు పని చేశాయి. వాటన్నింటినీ రద్దు చేశాం. అందుకే ఇవాళ గ్రామాల్లో బెల్టు షాపులు కనిపించడం లేదు. ఇంకా అవి తిరిగి ఏర్పాటు కాకుండా, ప్రభుత్వం స్వయంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తోంది. అదే విధంగా 20 శాతం షాపులు కూడా తగ్గించాము. 3450 షాపులు మాత్రమే ఇవాళ ఉన్నాయి. ఇంకా పర్మిట్ రూమ్లు లేకుండా చేశాము. వాటి వల్ల ఇన్నాళ్లు ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. మద్యం విక్రయాల టైమ్ కూడా తగ్గించాము. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకే షాపులు పని చేస్తాయి’ అని సీఎం వివరించారు.

ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసును నియమిస్తున్నామని, వారికి ఉన్న పెద్ద బాధ్యత.. గ్రామాల్లో ఎవరైనా మద్యం అమ్మితే వెంటనే ప్రభుత్వానికి ఫోన్ చేస్తారని, దీంతో అధికార యంత్రాంగం కదులుతుందని చెప్పారు.

ప్రతి ఒక్కరికీ చేదోడుగా..

‘రైతులు, రైతు కూలీల కుటుంబాలకు అండగా, తల్లులకు తోడుగా, చదువులకు భరోసాగా, వైద్యానికి హామీగా ఈ ప్రభుత్వం ఉంటుంది. పేదలకు ఉగాది నాటికి దాదాపు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కా చెల్లెమ్మల పేరుతోనే రిజిస్టర్ చేస్తాము. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఇస్తున్నాము. అదే విధంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశాము’.

‘ప్రజలకు అత్యంత మెరుగైన సేవలందిస్తూ కేవలం ఈ నాలుగు నెలల్లోనే దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చాము. ఆ విధంగా ప్రభుత్వం ఏనాడూ ప్రజల బాటను విడవదని మనవి చేస్తున్నాను. గ్రామ సచివాలయాలను ప్రజల మేలు కోసం ఏర్పాటు చేశాము. కాబట్టి వాటిని పూర్తిగా వినియోగించుకోండి’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అందరి చల్లని దీవెనలతో..

‘గ్రామ సచివాలయాలకు ఎంపికైన వారందరినీ అభినందిస్తున్నాను. ఈ ఉద్యోగాల కోసం దాదాపు 20 లక్షల మంది పరీక్ష రాస్తే, దాదాపు 1.30 లక్షల మంది ఎంపికయ్యారంటే.. ఎక్కడా లంచం ఇవ్వకుండా ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది అంటే.. అది కూడా మీ బిడ్డ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న పని అని గుర్తు పెట్టుకోండి. ఇదంతా మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సుల వల్లనే సాధ్యమవుతోంది’.
‘ఇక చివరగా గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను’ అని సీఎం శ్రీ వైయస్ జగన్ అన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ:

‘స్వచ్ఛమైన భారత్, అభివృద్ధిని మహాత్మా గాంధీ ఆకాంక్షించారు. ఆ స్ఫూర్తితో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించి దేశాన్ని కూడా స్వచ్ఛంగా మార్చడంలో మనవంతు కృషి చేస్తామని మాట ఇస్తున్నాను. పరిసరాలను అపరిశుభ్రం చేయం. ప్లాస్టిక్ సంచులను, ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను వాడను. తద్వారా దేశాన్ని ప్లాస్టిక్ నుంచి కాపాడుకుంటాను. ఈ ముందడుగు రాష్ట్రాన్ని, దేశాన్ని శుభ్రం చేయడంలో సహాయం చేస్తుందని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అని అందరితో సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రమాణం చేయించారు.  

 

Just In...