Published On: Wed, May 15th, 2019

ప్ర‌జ‌ల గుండెల్లో స‌ర్ ఆర్ద‌ర్ కాట‌న్ ప‌దిలం

* ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాళి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ప్రజలు గుండెల్లో గుడికట్టుకుని పూజిస్తున్న మహనీయుడు సర్ ఆర్దర్ కాటన్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీటి విలువ, గొప్పదనం తెలిసిన సర్ ఆర్దర్ కాటన్ మహాశయుడుఅని ఆయ‌న కీర్తించారు. ఆయన స్ఫూర్తితోనే నీరు-ప్రగతి లాంటి జలసంరక్షణ ఉద్యమాలు ప్రారంభించాం అన్నారు. అపర భగీరథుడు కాటన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తరచూ కరవు కాటకాలకు, వరద ముంపునకు గురైన ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా కాట‌న్ తీర్చిదిద్దార‌ని, ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి చరితార్ధుడ‌య్యార‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్ర‌శంసించారు. కాటనాయనమ: అని వేదమంత్రాలలో సైతం కాటన్ పేరును స్మరించుకునే గోదావరి జిల్లాలు ఉన్నాయ‌ని, కాటన్ స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జ‌రుగుతుంద‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ద‌శాబ్దాలుగా కలగానే మిగిలిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి  70శాతం పూర్తిచేశాం  అని తెలిపారు. పోల‌వరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మారిపోతుంద‌న్నారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం కలను నిజం చేశాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృష్ణా డెల్టాలో కరవు చాయల్ని తరిమికొట్టాం అన్నారు. : ప‌ట్టిసీమ ప్రాజెక్టు వల్ల  కృష్ణా డెల్టాలో రూ.44 వేల కోట్ల విలువైన పంట దిగుబడి జ‌రుగుతుంద‌న్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో 23 జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Just In...