Published On: Mon, Apr 15th, 2019

ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం పోరాడిన అంబేడ్క‌ర్‌

* జ‌యంతి కార్య‌క్ర‌మంలో డిటీసీ ఇ మీరాప్రసాద్ 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: బాబా సాహెబ్ డాక్టర్ భీంరామ్ అంబేడ్క‌ర్ జీవితమంతా విశ్రాంతి లేని పోరాటం సాగించిన సంఘ సంస్కర్త అని,  ప్రజల హక్కుల కోసం, సంక్షేమం కోసం పాటుపడిన మహా మనిష‌ని డిటీసీ ఇ.మీరాప్రసాద్ అన్నారు. స్థానిక మ‌హాత్మాగాంధీరోడ్డులోని ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో ఆదివారం రవాణా శాఖ ఎస్సి  ఎస్టి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. సురేష్ ఆధ్వర్యంలో 128వ డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ జయంతి కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపరవాణా కమీషనర్ మీరాప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా అంబేడ్క‌ర్‌కు పులమాలను వేసి, జ్యోతి ప్రజ్వ‌ల‌న గావించారు. అనంతరం మీరాప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా డాక్ట‌ర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ రాజ్యాంగంను రచించడం ఆయన జీవితంలో ప్రముఖమైన ఘట్టమని  ఆయన అన్నారు. భారత రాజ్యాంగ రచన సంఘంలో ఏడుగురు  సభ్యులను నియమించినప్పటికి, ఏడుగురిలో వివిధ కారణాలతో ఒక్కొక్కరు దూరం అవ్వటంతో భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసే బాధ్యత బి.ఆర్.అంబేడ్క‌ర్ తీసుకోవడం జరిగిందన్నారు. నేడు భారతదేశ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయంటే నాడు డాక్ట‌ర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ పొందుపరిచిన రాజ్యాంగం ప్రకారమేనని ఆయన కొనియాడారు. అంబేడ్క‌ర్ చూపిన బాటలో ప్రతిఒక్కరు నడవాలని ఆయన కోరారు. సురేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జోనల్ స్థాయిలో రవాణాశాఖ ఉద్యోగులతో డాక్ట‌ర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ కోసం మరిన్ని విషయాలను తెలియజేసేలా రాష్ట్ర స్థాయి వక్త‌ల‌తో సమావేశాల‌ను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ ఎస్సి ఎస్టి ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు జె.రాజరావు, టెక్నికల్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.సుబ్బారావు, నాన్-టెక్నికల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.మణికుమార్, ఆర్టీవో ఎస్.వెంకటేశ్వరరావు, జోన్2 అధ్యక్షుడు రాజుబాబు, ఎస్పీ ఎస్టీ ఉద్యోగుల సంఘ నాయకులు ముత్యంజయరాజు, నాగమురళి, డి.ఎస్.ఎస్.నాయక్,  రాజేష్‌కుమార్,  మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

Just In...