Published On: Thu, Mar 26th, 2020

ప్ర‌ధాని ముందుచూపుతో మంచి ఫ‌లితాలు…

* భాజ‌పా ఏపి అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌

గుంటూరు, సెల్ఐటి న్యూస్‌: ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న కరోనా వైర‌స్ నియంత్రణపై ప్రధాని న‌రేంద్ర మోది ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయ‌ని బిజెపి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఆయ‌న గుంటూరులో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. క‌రోనా నియంత్రణపై ప్రధాని ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. జనతా కర్ఫ్యూ ద్వారా ప్రజలను ఒకేతాటి పైకి తెచ్చారు. 21 రోజుల లాక్ డౌన్ ద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. అయితే లాక్ డౌన్ సందర్భంగా పేదలు ఎవరూ ఆకలితో ఉండ వద్దని గరీబ్ కళ్యాణ్ పథకం తెచ్చారు. లక్ష 70వేల కోట్లరూపాయల ప్యాకేజీ 80 కోట్ల మందికి ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ కింద లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించిన ఘనత బిజెపి ప్రభుత్వానిదేనని అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర భారతీయ జనతాపార్టీ తరపున ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు. పేదలకు ఉచితంగా రేషన్ అందనుంది. కరోనా నియంత్రణ విధుల్లో పాల్గొనే వారికి జీవిత బీమా కల్పించాలన్న నిర్ణయం చాలా గొప్పది. జన్ ధన్ బీమా యోజన కింద రైతులకు ఆర్థిక సాయం. రూ.15వేల లోపు వేతనాలు ఉండే కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్‌ను మూడు నెలల పాటు కేంద్రం చెల్లించాలని నిర్ణయించింది. లాక్ డౌన్ సమయంలో అన్ని వర్గాల వారికి అండగా నిలిచేలా స్కీములు పెట్టారు. లాక్ డౌన్ సందర్భం గా పనిచేస్తున్న వైద్యాధికారులు నర్సులు ఆశా వర్కర్లకు రూ.50 లక్షల వరకూ ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు. మహిళలకు ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. లాక్ డౌన్ కారణంగా ఆకలితో ఇబ్బంది పడే వారి ఆకలి తీర్చాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్టా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కనీసం ఐదుగురికి ఆహారం అందించాలి. వ్యక్తుల మధ్య ఎడం పాటిస్తూ పేదలకు ఆహారం అందించాలి. పోలీసులు బిజెపి కార్యకర్తలు ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగ చేయవద్దని కోరారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ అసమర్థత బయటపడింది. వారు వస్తున్న విషయం తెలిసినా కనీస చర్యలు తీసుకోలేదు. కరోనా పట్ల ముఖ్యమంత్రి తేలిగ్గా మాట్లాడి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వేలాది మంది విద్యార్థులను రోడ్డున ఉంచారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణం. అర్థరాత్రి సమయంలో అంత మందిని రోడ్లపై ఉంచి వారి జీవితాలతో ఆడుకోవటం అమానవీయం. కాశీ యాత్రలో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కు రప్పించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినా స్పందన లేదు. లాక్ డౌన్ కారణంగా పేదలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఉచిత రేషన్, కందిపప్పు, వెయ్యి రూపాయల నగదు త్వరగా అందించాలి.

Just In...