Published On: Wed, Aug 21st, 2019

ఫర్నిచర్‌ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధం

* వైకాపా నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది

* మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు

సెల్ఐటి న్యూస్, అమరావతి: తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించనందుకే.. ప్రస్తుత ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. తనను వేధించే లక్ష్యంతో ఫర్నిచర్ తరలింపు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన  గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో రెండుసార్లు అధికారులకు, ఓసారి స్పీకర్‌కు లేఖ రాసినా వారి నుంచి తగిన స్పందన లేదని వివరించారు. ప్రభుత్వం మారిన వెంటనే జూన్ 7వ తేదిన తాను లేఖ రాశానని… ఆ తర్వాత స్పీకర్‌కు కూడా లేఖ రాశానని తెలిపారు. అమరావతి అసెంబ్లీకి సీఆర్డీయే కొత్త ఫర్నిచర్‌ సమకూర్చినందున హైదరాబాద్ అసెంబ్లీలోని ఫర్నిచర్‌ని తన క్యాంపు కార్యాలయాలకు అధికారుల అనుమతితో తరలించానని వివరించారు. ఫర్నిచర్ వెనక్కి ఇస్తానని… లేకపోతే వాటి మొత్తానికి సరిపడా డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సెల్‌ఫోన్లు, మందులు కూడా అమ్ముకున్నట్లు వైకాపా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని కోడెల మండిపడ్డారు. అసెంబ్లీ తనకు దేవాలయం అని.. ఐదేళ్లపాటు పూజారిగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన అందించకుండా తమపై వేధింపులు సరికాదని విమర్శించారు. ఫర్నిచర్‌ వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు.

Just In...