Published On: Thu, May 16th, 2019

ఫలితాల తర్వాత కూడా ఈసీ రీపోలింగ్ జరుపుతుందేమో!

* రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం

* ఏపీసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్

సెల్ఐట‌టి న్యూస్‌, విజయవాడ: కేంద్ర ఎన్నికల కమీషన్ తీరు, నిర్ణయాలు చూస్తుంటే ఈ నెల 23 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా దేశంలో రీపోలింగ్ జరుపుతుందేమో అని అనుమానం కలుగుతోందని, ఇలాంటి అభిప్రాయం కలగడానికి ఎన్నికల కమీషన్ నిర్ణయాలే కారణమని ఏపీసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 5 చోట్ల రీపోలింగ్‌కు ఆదేశించడాన్ని ఎలా అర్ధంచేసుకోవాలో తెలియడం లేదని, ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే, మే 16న అంటే 35 రోజుల తరువాత రీపోలింగ్ కు ఆదేశించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. మధ్యలో కొన్నిచోట్ల రీపోలింగ్ కూడా జరిగిపోయిందని గుర్తుచేశారు. గురువారం రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పిసిసి మరో ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ గంగాధర్‌తో కలిసి జంగా గౌతమ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ఒకరోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిలుపుచేస్తూ ఎన్నికల కమీషన్ అసాధారణ నిర్ణయం ప్రకటించటాన్ని కూడా గౌతమ్ ప్రశ్నించారు. ఎంతోమంది రాజకీయ నాయకుల జీవితాలతో చెలగాటం ఆడుకునే నిర్ణయంగా ఈసీ నిర్ణయం ఉందని, బహుశా అక్కడ బిజెపి పెద్దగా లాభపడేది ఏమీ లేదని తెలుస్తున్నందునే ఇలాంటి నిర్ణయాలు వస్తున్నాయా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఎన్నికల కమీషన్ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడం అంటే ఈ విధమైన అనాలోచిత అసాధారణ నిర్ణయాలు చేయటమేనా అని ప్రశ్నించారు.

Just In...