Published On: Wed, Apr 17th, 2019

ఫారం-7 దొంగల ఐపీ అడ్రస్‌లు ఎందుకివ్వరు?

* ఎన్నికల్లో అవకతవకలు ఎవరి తప్పు?

* దేశాన్ని మోదీ భ్రష్టుపట్టిస్తున్నారంటూ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ధ్వజం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయన దొంగలను కాపలాకాసే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. బుధవారం సాయంత్రం అమరావతిలో ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. నోట్లరద్దు, జీఎస్టీ తేవడం దేశంలో అతి పెద్దతప్పులన్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరగడం ఎవరి తప్పు అని నిలదీశారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయని అధికారులే ఒప్పుకున్నారని, ఐపీ అడ్రస్‌ ఇవ్వలేకుంటే ఫారం-7పై ఫిర్యాదులను ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. జులై నాటికి గ్రావిటీద్వారా పోలవరం నుంచి నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘వైకాపా నేతలు పలుచోట్ల హింసాత్మక చర్యలకు దిగారు. తప్పుడు విధానాలతో తప్పించుకొనేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారు. ఐపీ అడ్రస్‌లు ఇవ్వబోమని అంటే దొంగలను రక్షించినట్టే. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు అంటే ఎందుకు మీనమేసాలు లెక్కిస్తున్నారు? ఎన్నికల ముందు కావాలనే ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్నికల్లో ఇంత డబ్బు ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దీనికి ఎవరు బాధ్యత. రూ.2వేల నోట్లు ఎందుకు తెచ్చారో ప్రజలకు జవాబు చెప్పండి? వీటితో ఏం సాధించారో చెప్పండి? ఎన్నికల కోసం, మీ స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేస్తారా? వీవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలి. ఫారం -7 దొంగల ఐపీ అడ్రస్‌లు ఎందుకు ఇవ్వరు? ఈవీఎంలపై ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నారు? ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జరగడం ఎవరి తప్పు? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.
పునేఠా ఏం తప్పుచేశారని బదిలీ చేశారు?
‘‘సీఎస్‌ పునేఠా, పలువురు ఎస్పీలను బదిలీ చేస్తే మాజీ ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడలేదు? పునేఠా ఏం తప్పుచేశారని బదిలీ చేశారు? మాజీ ఐఏఎస్‌లు వ్యక్తిగత అజెండాతోనే ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడమే సీఎస్‌, డీజీపీ పని. మొక్క నాటేందుకు డీజీపీ కార్యాలయానికి సీఎస్‌ వెళ్తారా? అది ఉన్నతాధికారుల పనా? జగన్‌ కేసుల్లో ఎల్వీ సుబ్రహ్మణ్యం పేరులేదా? ఉన్నమాటంటే విశ్రాంత ఐఏఎస్‌లు నన్నెందుకు విమర్శిస్తున్నారు?  ఈవీఎంలు 24గంటలు ఆలస్యంగా ఇస్తే ఎలా అర్థం చేసుకోవాలి? ఒకరోజు తర్వాత ఇచ్చారంటే ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు? ఎన్నికలు నిర్వహించలేమని ఈసీ ముందుగానే చొప్పుచ్చుగా. ఈవీఎంలపై ఇన్ని విమర్శలు వచ్చినా ఈసీ స్పందించడంలేదు. ఈవీఎంలలో లోపాలు, ఫారం-7 దుర్వినియోగంపై ఎందుకు చర్యలుతీసుకోలేదు? ఈసీ ఉదాసీనతకు ఇదే నిదర్శనం. ఏపీలో చివరి విడత ఎన్నికలు జరపాల్సి ఉండగా మొదటి దశలో తెచ్చారు. కనీసం సన్నద్ధమయ్యేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. ప్రతిపక్ష సీఎంల హెలికాప్టర్లు మాత్రమే తనిఖీ చేస్తారా? మోదీ, అమిత్‌షా కంటే ఎవరైనా ప్రధానిగా బాగా పనిచేయగలరు’’
ప్రతిఒక్కరూ విజిల్‌ బ్లోయర్‌ కావాలి
‘‘హైదరాబాద్‌లో కూర్చుంటే ఏపీలో సమస్యలు ఎలా తెలుస్తాయి? ఐదేళ్లు కష్టపడిన మాకు ఇక్కడి కష్టమేంటో తెలుస్తుంది. 45 ఈవీఎంలే సమస్య వచ్చిందని వైకాపా నేతలు ఎలా చెబుతారు?ఏకపక్ష నిర్ణయాలు, దాడులను వ్యతిరేకిస్తాం. ఇప్పుడు కళ్లు తెరవకపోతే భవిష్యత్తులో మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. ఎన్నికల కోసం, స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేస్తారా? ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్తంగా చైతన్యం తెస్తాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ విజిల్‌ బ్లోయర్‌గా తయారు కావాల్సిన అవసరంఉంది.ఈవీఎంలపై మేధావులు, విద్యార్థులు, యువత స్పందించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జులై నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు 69.99శాతం పూర్తయ్యాయని సీఎం చంద్రబాబువెల్లడించారు. రెండు నెలలుగా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల వివరాలతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్‌, జులై నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కేంద్రం నుంచి ఇంకా రూ.4508 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. పునరావాసం కింద కేంద్రం ఇచ్చే ప్యాకేజీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.లక్ష ఇస్తుందని స్పష్టంచేశారు. పనుల వేగం తగ్గకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోదావరి- కావేరి లింక్‌ చేస్తామంటూ గొప్పలు చెబుతున్న  కేంద్రం నిధులు ఇవ్వకుండా ఎలా చేస్తుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యఅంశాలు 
• రాష్ట్రంలో తాగునీటి సరఫరా ఎలా జరుగుతోందో ఈ మధ్యాహ్నం అధికారులతో సమీక్షించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.
• 2018-19 ఖరీఫ్ సీజన్‌లో 347 మండలాలు, రబీలో 257 మండలాలను కరవు మండలాలుగా గుర్తించాం.
• ఖరీఫ్ సీజన్‌లో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 63 చొప్పున కరవు మండలాలు.
• భూగర్భ జలాల క్షీణత (DEPLETION) :
   కోస్తా ప్రాంతంలో 2018లో  11.85                  2019లో 12.55
   రాయలసీమలో 2018లో   15.16                   2019లో 23.13
• రాష్ట్రంలో 887.5 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సివుండగా, 599.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. (లోటు వర్షపాతం-32.5%)
                                        ప్రకాశం జిల్లా :    -58.3 %
                                        కడప జిల్లా :       -57.4 %
                                        నెల్లూరు జిల్లా :    -54.1 %
• తాగునీటి సరఫరాలో  ప్రజల సంతృప్తి స్థాయి నూరుశాతం కనిపించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అదే ఈరోజు సమీక్షలో మా అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాను.
• ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య బాగా ఉంది. తెలుగుగంగ నుంచి ఎత్తిపోతల ద్వారా చిత్తూరు జిల్లాకు తాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.
• ఈ వేసవిలో రాష్ట్రం మొత్తం మీద 3,494 నివాస ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. ఇది గతంలో కంటే ఎక్కువ.
2015 (3338 habs), 2016 (564 habs), 2017 (1277 habs), 2018 (445 habs)
• రోజూ 15,072 ట్రిప్పుల చొప్పున 3,494 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా.
• అనంతపురంలో 443, చిత్తూరులో 1,671, గుంటూరులో 86, కడపలో 530, కర్నూలులో 87, నెల్లూరులో 127, ప్రకాశం జిల్లాలో 550 నివాస ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నాం.
• గత ఏడాది 445 ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తే, ఈ పర్యాయం 3,494 ప్రాంతాలకు అందిస్తున్నాం.
• ప్రజలకే కాకుండా మూగజీవాలకు కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. దగ్గర దగ్గర 7 లక్షల పశువులకు 2,311 ట్యాంకర్ల మంచినీటి సరఫరా.
• ఈ వేసవికి మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశాం. 469 ప్రైవేట్ బోర్‌వెల్స్ హైర్ చేసి తాగునీటిని అందిస్తున్నాం.
• వేసవి నీటి ఎద్దడి నివారణ ప్రణాళిక అమలు కోసం రూ.184 కోట్లు
• ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చెల్లింపుల కోసం రూ.60.39 కోట్లు కేటాయింపు.
• మొత్తం 688 ప్రైవేట్ సోర్సెస్ ద్వారా తాగునీరు అందించేందుకు రూ.2.26 కోట్లు.
• మొత్తం 2,725 బోర్‌వెల్స్‌ ఫ్లషింగ్ కోసం రూ.3.33 కోట్లు కేటాయించాం. అడుగంటిన బోర్‌వెల్స్‌ పనులకు రూ.11.98 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
• 471 చిన్న నీటి చెరువుల్ని నింపేందుకు రూ.8.01 కోట్లు మంజూరుచేశాం.
• ఎక్కడైనా మంచినీటి సమస్య ఉంటే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు ‘జలవాణి’ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటుచేశాం. 18004251899 నెంబరుకు ఫోన్ చేసి తాగునీటి ఇబ్బందుల్ని తెలియజేయవచ్చు.
• జలవాణి ద్వారా ఇప్పటి వరకు 3,813 ఫిర్యాదులు వస్తే 80.51% పరిష్కరించాం.
• తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణకు మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో (AE, EORD, MPDO) ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.

Just In...