Published On: Thu, Jan 31st, 2019

ఫార్మాలిన్ వాడలేదని సర్టిఫై చేశాకే చేపలు ఎగుమతి చేసేలా చూడాలి

* సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ‌ 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బీహార్, కోలకతాలతో పాటు మేఘాలయ తదితర ఈశాన్య‌ రాష్ట్రాలకు సరఫరా చేసే చేపల ఫ్యాకింగ్‌లో ఫార్మాలిన్ వాడటం లేదని సంబంధిత అధికారులు సర్టిఫై చేశాక వాటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ ఆదేశించారు. రాష్ట్రం నుండి బీహార్ తదితర ప్రాంతాలకు చేపల సరఫరాకు సంబంధించిన అంశంపై బుధవారం అమరావతి సచివాలయంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు మత్స్య తదితర శాఖల అధికారులు, చేపల ఉత్పత్తి, ఎగుమతి దారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ చేపల ఫ్యాకింగ్‌లో ఫార్మాలిన్ వాడుతున్నారని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో క్వాలిటీ చెక్ చేసేందుకు సాంకేతిక బృందాలను పంపాల్సిందిగా అస్సాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ వ్రాయగా బీహార్ నుండి అధికారులు బృందం రాష్ట్రంలో పర్యటించిందని చెప్పారు. బీహార్ ప్రభుత్వం గతంలో మన రాష్ట్రం నుండి సరఫరా అయ్యే చేపలపై విధించిన నిషేధాన్ని ఆ రాష్ట్ర అధికారుల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్ర పరిశీలన చేయగా ఎలాంటి ఫార్మాలిన్ వంటి రసాయనాలు వినియోగించడం లేదని నిర్ధారించాక ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు బీహార్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని చెప్పారు. చేపల ఫ్యాకేజింగ్లో కల్తీకి ఆస్కారం లేకుండా ఆరోగ్య, భద్రతా ప్రమాణాలు పాటించేందుకు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చేపల ఫ్యాకింగ్ చేసే పాంయిట్ లలోనే ఫార్మాలిన్ లేదా ఇతర రసాయనాలు వాడటం లేదని సంబంధిత అధికారులు సర్టిఫై చేశాకే ఫ్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా చూడాలని అధికారులకు, చేపల ఎగుమతి దారులను సిఎస్ ఆదేశించారు. చేపల ఎగుమతిలో ఫార్మాలిన్ వాడటం లేదని పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని రైతులు, ఎగుమతిదారులు నిరూపిస్తే దానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ స్పష్టం చేశారు. చేపలు ఫ్యాకింగ్ చేసే పాయింట్ల వద్దే ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ఫార్మాలిన్ లేదా ఇతర రసాయనాలు వాడలేదని సర్టిఫై చేసి ఎగుమతి చేస్తే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగాను మన రాష్ట్ర చేపలకు మంచి మార్కెట్ ఉండి అటురైతులకు, ఇటు ఉత్పత్తి దారులకు అన్ని విధాలా మేలుకలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా కృష్టా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండే అధిక మొత్తంలో చేపల ఎగుమతి జరుగుతున్నందున ఈ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు, ఎగుమతి దారులకు ఆయన సూచించారు. రైతులు ఎవ్వరూ ఫార్మాలిన్ వంటి రసాయనాలు వినియోగించకుండా వారిలో పూర్తి అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సేంద్రీయ వ్యవసాయంలో దేశంలో ప్రధమ స్థానంలో నిలిచిందని అదే రీతిలో ఆక్వా రంగంలో ముఖ్యంగా చేపల ఉత్పత్తి, ఎగుతమతిలో కూడా ప్రధమ స్థానంలో నిలచేలా కృషి చేయాలని చెప్పారు.
                    రాష్ట్ర మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి మాట్లాడుతూ రాష్ట్రం నుండి బీహార్ తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బీహార్ నుండి రాష్ట్రంలో పర్యటించిన టెక్నికల్ కమిటీ 10సూచనలు చేసిందని వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.వాటిలో ముఖ్యంగా చేపలను ట్రక్‌లలో ఎగుమతి చేసే సమయంలోనే ఫార్మాలిన్ వాడలేదని సర్టిఫై చేయాలని, నెలకు ఒకసారి 10చేపల శాంపిల్స్, వివిధ బ్రాండ్ల ఫీడ్ శాంపిల్స్ తీసి సిఎఫ్ఎల్ మైసూరు,పూనేలలో పరీక్షించాలని సూచించారని చెప్పారు. చేపల చెరువుల్లో వాడే మందులు, ఇతర సెన్సిటైజర్స్‌పై కూడా శాంపిల్స తీసి ఆయా కేంద్రాల్లో పరీక్షించాలని సూచించారని తెలిపారు. బీహార్ రాష్ట్రంలోని చేపల హోల్ సేల్, రిటైల్ వ్యాపారులను చైత్యవంతం చేస్తామని అదే రీతిలో ఎపిలోని వారిని కూడా ఈవిధంగా చైతన్యవంతం చేయాలని ఆబృందం సూచించిందని ఆమె తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్ట‌ర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని చేపలు దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయని అన్నారు. ఫార్మాలిన్ వంటి రసాయనాలు ఏమి వాడటం లేదని రైతులు, ఎగుమతి దారులు ఋజువు చేయాల్సిన బాధ్యత ఉందని అందుకు పెద్దఎత్తున అవగాహన తీసుకువచ్చేందుకు కృషి చేయాలని దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. మత్స్యశాఖ కమీషనర్ రామశంకర్ నాయక్ మాట్లాడుతూ ఫార్మాలిన్ వినియోగంపై క్వాలిటీ చెక్ చేసేందుకు పశ్చిమ గోదావరి,కృష్టా జిల్లాల్లోని ప్రధాన చేపల ఫ్యాకింగ్ ప్రాంతాలు,రిటైల్ మార్కెట్లలో మత్స్య, పశు వైద్యశాఖ, పుడ్ సేప్టీ అధికారులతో టాస్క్ ఫోర్సు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయించడం జరిగిందన్నారు.సమావేశంలో మత్స్యశాఖ అదనపు సంచాలకులు కె.సీతారామ రాజు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్సివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్ట‌ర్ మంజరి, అధికారులు, చేపల ఎగుమతి దారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Just In...