Published On: Sat, Nov 3rd, 2018

బంగారుమయం చేసిస్తే కేసీఆర్‌ పాలించలేకపోతున్నారు

* ప్రకాశం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు విమర్శ

* ఏపీని ప్రపంచానికి నమూనాగా చూపడమే లక్ష్యం

* ఇబ్బంది పెట్టేందుకే కోడికత్తి డ్రామా

సెల్ఐటి న్యూస్‌, ఒంగోలు: భావితరాల భవిష్యత్తు కోసమే మూడున్నర దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్‌తో బంధానికి సిద్ధమయ్యానని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని డేగరమూడిలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యపు మూలస్తంభాలను ఎన్డీయే సర్కార్‌ కూలదూస్తోందని మండిపడ్డారు. జాతీయస్థాయిలో పదవులపై తనకు ఎలాంటి ఆకాంక్షలూ లేవని పేర్కొంటూ లక్ష్యాల సాధన కోసం ఏపీ సీఎంగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను బంగారుమయం చేసి అందిస్తే.. కేసీఆర్‌ పాలించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వెలిగొండ, రామాయపట్నం పోర్టు, పేపర్‌ మిల్లు వంటి ప్రాజెక్టులతో ప్రకాశం జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని భరోసా ఇచ్చారు. దొనకొండను పారిశ్రామిక కేంద్రంగా తయారు చేయడంతో పాటు త్వరలో టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట జిల్లాలో వర్సిటీకి శంకుస్థాపన చేస్తామన్నారు. ధర్మపోరాట దీక్షలు ఏర్పాటు చేసి విభజన హామీలను నెరవేర్చమని అడిగినందుకే కేంద్ర ప్రభుత్వం దాడికి దిగిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనను రెచ్చగొడితే ఏమైందో ఇప్పటికే వారికి అర్థమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గవర్నర్‌ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, రాజ్యాంగబద్ధ సంస్థలను, స్వతంత్ర సంస్థలను భ్రష్టుపట్టించడాన్ని చూశాక ఓ సీనియర్‌ నేతగా తాను కూర్చుంటే లాభం లేదని భావించానని.. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా జాతీయ పార్టీలను ఏకం చేసేందుకు ముందుకొచ్చానన్నారు. భాజపాను నిలదీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ను కూడా కలుపుకొని ఏకతాటిపైకి రావాలని కోరినట్టు చెప్పారు. తనకే కోరికలూ లేవని, ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగానే ఉంటూ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఓ నమూనాగా, భారత్‌లో అభివృద్ధికి చిరునామాగా తయారు చేసే ఆశయంతో పనిచేస్తానని చెప్పారు. కోడి కత్తి డ్రామాతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే వైకాపా లక్ష్యమని సీఎం చంద్ర‌బాబు మండిపడ్డారు. వైకాపా అభిమానే జగన్‌పై దాడిచేస్తే దాన్ని తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలోనూ విశాఖకు వచ్చి జల్లికట్టు డ్రామా చేశారని, తునిలో ఓ ట్రైన్‌ను తగులబెట్టారని విమర్శించారు. పోలవరం కాల్వకు గండికొట్టి అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. అసెంబ్లీకి రాకుండా, పోరాడలేక రాజీనామాలు చేసి పారిపోయారని చంద్రబాబు ఎద్దేవాచేశారు.

   

Just In...