Published On: Thu, Jan 23rd, 2020

బంగారు గంట – మర్యాద రామన్న సూత్రాలు పాటించాలి

* డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రోడ్డు ప్రమాదం సంభవించిన మొదటి గంటలో వైద్య సదుపాయం అందించినట్లయితే ప్రమాదానికి గురైన వ్యక్తి బ్రతికే అవకాశం ఉంటుందని మొదటి గంటను గోల్డెన్ హౌర్ గా పిలుస్తారని డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక బందరు రోడ్డులో గల శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా గురువారం విద్యార్థులతో రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వైద్య సదుపాయం అందించినట్లయితే రోడ్డు ప్రమాదాల మరణాలలో 40% శాతం వరకు తగ్గించవచ్చునని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో తెలియజేసిందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలని  ఏదైనా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు  మొదటి గంటలోపే వైద్య సదుపాయం అందించే విధంగా అంబులెన్స్ గాని పోలీసువారికి గాని ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ఆయన సూచించారు. ప్రమాద సమాచారాన్ని తెలియజేసిన వ్యక్తుల పేర్లను  గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు.  రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలలో వివిధ కారణాల వల్ల ప్రజలు సమాచారం ఇవ్వటానికి ముందుకు రావటం లేదని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సమాచారాన్ని అందజేసిన వ్యక్తుల హక్కులను కాపాడే విధంగా గౌరవ సుప్రీంకోర్టు 2014 అక్టోబర్ 29న సేవ్ లైఫ్ ఫౌండేషన్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులలో మార్గదర్శకాలు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. సకాలంలో సమాచారాన్ని ఇవ్వడం ద్వారా మనిషి ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. ఈ సమాచారాన్ని సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రజలందరికీ చేరవేసేలా చెయ్యాలని విద్యార్థులను ఆయన కోరారు. యువత తోనే మార్పు సాధ్యం అనే నినాదంతో రోడ్డు భద్రతా కార్యక్రమాలను చేపట్టామని, విద్యార్థులు రోడ్డు నిబంధనలు పాటించే విధంగా కార్యక్రమాల ద్వారా అవగాహనను పెంపొందిస్తున్నామని ఆయన వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, హెల్మెట్ ధరించకుండా నడపడం వంటివి చట్ట విరుద్ధమని ఆయన వివరించారు. డ్రైవింగ్ పట్ల, రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటిస్తామని విద్యార్థులతో డిటిసి ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై ముద్రించిన కరపత్రాలు విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి, మోటార్ వాహన తనిఖీ అధికారులు సంజీవ్‌కుమార్, బద్దు నాయక్, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం.రాజుబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కె సరళ, విద్యార్థులు పాల్గొన్నారు.

Just In...