Published On: Tue, Aug 20th, 2019

బాలికలపై ఉపాధ్యాయుడి వేధింపులు..

* పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు  

సెల్ఐటి న్యూస్, గుంటూరు క్రైమ్: విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన గుంటూరు జిల్లా చిరుమామిళ్ల ఏపీ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయునిపై పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. కొంతకాలంగా బాలికలను వేధిస్తుండటంపై వారి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఏపీ ఆదర్శ పాఠశాలలో జి.క్రాంతికిరణ్‌ సామాన్య శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. పాఠశాలకు చెందిన బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఒంటరిగా ఉన్న సమయంలో వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. దీనితో బాలికలు విషయాన్ని ఇంట్లో కుటుంబసభ్యులకు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ప్రధాన ఆచార్యురాలు పద్మజను నిలదీశారు. ఆమె విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయుడి వేధింపుల విషయమై బాలిక తండ్రి ఒకరు సోమవారం రాత్రి నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడు క్రాంతికిరణ్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Just In...