Published On: Sat, Apr 21st, 2018

బిడ్డ స‌క్ర‌మ ఎదుగుద‌ల‌కు పౌష్టికాహారం ముఖ్యం

* డాక్ట‌ర్ రామ‌కృష్ణ‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: బిడ్డ సక్రమ ఎదుగుదలకి పౌష్టికాహారం అత్యంత ముఖ్యం, మంచి ఆహారంతో పాటు ఆటలు కూడా అవసరం అని, ఆహారం, ఆటల విషయంలో అశ్రద్ధ చూపితే బిడ్డ ఎదుగుదల దెబ్బతింటుంద‌ని, గర్భస్థ శిశువు దశ నుంచే బిడ్డ ఎదుగుదలకి పునాది పడుతుంది, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి సక్రమ ఎదుగుదలకి శ్రద్ధ వహించాలి అని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు బి.రామకృష్ణ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్ట‌ర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని “ పిల్లల్లో ఎదుగుదల లోపాలు’ అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కాన్పుకి ముందు మూడు మాసాలు, తర్వాత మొదటి మూడు మాసాలు బిడ్డ శారీరక, మానసిక వృద్ధికి అత్యంత ముఖ్యమైన సమయమన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు నెల నెలా పెరుగుతున్న బరువుని గమనించాలన్నారు. ఆ తర్వాత 3నెలలకి ఒకసారి బరువుని చూడాలన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత రెండేళ్లు వరకు ప్రతీ ఆరు నెలలకి ఎంత ఎత్తు పెరుగుతున్నదీ గమనించాలన్నారు. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి చూడాలన్నారు. సాధారణంగా మొదటి సంవత్సరంలో నెలనెలకీ ఎంతో అభివృద్ధి కనబడుతుందన్నారు. శారీరక, మానసిక ఎదుగుదలకి తల్లిపాలు, పౌష్టికాహారం పాత్ర గణనీయంగా ఉంటుందన్నారు. శారీరక, మానసిక ఎదుగుదలకి జన్యుపరంగా కొంత ప్రభావం ఉన్నప్పటికీ తీసుకునే ఆహారం, పెరిగే వాతావరణం అత్యధిక ప్రభావాన్ని కలిగిస్తుందన్నారు. సమతుల ఆహారం లేకపోవడం, త్రాగే పాలల్లో నీళ్ళు ఎక్కువ ఉండటం, మొదలు పెట్టవలసిన వయస్సుకి ఘనపదార్ధం మొదలుపెట్టకపోవడం ఎదుగుదల లేకపోవడానికి ముఖ్య కారణాలన్నారు. నీళ్ళ విరోచనాలు, అజీర్ణం, దీర్ఘకాల వ్యాధులు ఎదుగుదలలో లోపానికి మరికొన్ని కారణాలు అన్నారు. గుండె జబ్బుతో పుట్టినప్పుడు ఎదుగుదల ఉండదన్నారు. చిన్నపిల్లల్లో కూడా మూత్రపిండాల వ్యాధులు, మూత్ర వాహికల వ్యాధులు ఉంటాయని, అవి బిడ్డ ఎదుగుదలకి విఘాతం కలిగిస్తాయని అన్నారు. చిన్నపిల్లల్లో కూడా సుగరు వ్యాధి ఉంటుందని, దానివల్ల ఎదగకపోవడం ఉంటుందని అన్నారు. తల్లి నుంచి తగిన ప్రేమ, ఆదరణ, ఎమోషనల్ ఎటాచ్ మెంట్ లేకపోతే బిడ్డ ఎదుగుదల సరిగా ఉండదన్నారు. బిడ్డ మానసిక ఉద్వేగాలని తల్లితండ్రులు తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలన్నారు. బిడ్డ కలిగే అనారోగ్యాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఆరోగ్యాన్ని తీర్చిదిద్దాలన్నారు. బిడ్డకి సక్రమంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలు వేయించని పిల్లలే తరచు ఏదొక అనారోగ్యానికి గురి అవుతారని, సరిగా ఎదుగుదల లేకుండా అవుతారని అన్నారు. మంచి ఆహారంతో పాటు తగిన వ్యాయామం కూడా అవసరమని, అప్పుడే బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదల పరిపూర్ణంగా ఉంటుందన్నారు. సదస్సులో పాల్గొన్న అనేకమంది తమ పిల్లల ఎదుగుదల విషయంలో ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ మారు, ఫిజియోథెరపిస్ట్ ఓలాస్ గోరా, పాల్గొన్నారు.

Just In...