Published On: Tue, Jun 12th, 2018

బి.సి.లను నట్టేట ముంచిన తెలుగుదేశం పార్టీ!

* భాజ‌పా న‌గ‌ర మాజీ అధ్య‌క్షుడు దాసం ఉమామ‌హేశ్వ‌ర‌రాజు  

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: తెలుగుదేశం పార్టీ బి.సి. వర్గాలకు ఏమి చేసిందో ఆ పార్టీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు చెప్పాలని భారతీయ జనతా పార్టీ విజ‌య‌వాడ నగర మాజీ అధ్యక్షులు డాక్ట‌ర్ దాసం ఉమామహేశ్వరరాజు ప్రశ్నించారు. బిసిలను నాడు ఎన్.టి.ఆర్. అక్కున చేర్చుకుంటే, నేడు చంద్రబాబు బి.సి.ల మధ్య గొడవులు సృష్టిస్తున్నారని, విభజించి పాలించు అనే బ్రిటీష్ వారి సిద్ధాంతాన్ని నమ్ముకున్న తెలుగుదేశానికి ఓటమి తప్పదని అన్నారు. బి.సి.లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనికిరారని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని బి.సి.ల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బి.సి. కులాల కార్పొరేషన్లకు అరొకర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఒక బి.సి. ప్రధాని అయితే తట్టుకోలేని మంత్రులు ఒక ఛాయ్ వాలా ప్రధాని అవుతాడా అనే ఉక్రోషంతో మాట్లాడడం దారుణం అని అన్నారు. ప్రధానినే విమర్శించే మంత్రులు బిసిలకు ఏం గౌరవం ఇవ్వగలుగుతారని, తెలుగుదేశం బి.సి.లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. బి.సి.లను గౌరవించే భారతీయ జనతాపార్టీ రాజ్యాంగ చట్టబద్ధత బిల్లును తీసుకువచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదికే దక్కుతుందని, బి.సి. మంత్రులై ఉండి యనమల, కాల్వ శ్రీనివాసులు ఇష్టం వచ్చినట్లు ప్రధానిపై నోరు పారేసుకుంటే ప్రజలే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని, తెలుగుదేశం గద్దె దిగడం ఖాయమని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జి.ఎస్.టి. పరిధిలోకి తెద్దామంటే మంత్రి యనమల ఎందుకు కేంద్రానికి అడ్డు తగులుతున్నారని? మీరు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రజలపై ధరల భారాన్ని వేస్తూ నెపం కేంద్రంపై నెట్టడం దారుణం అన్నారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఆర్ముగం, ఒబిసి నగర అధ్యక్షులు హరి జయప్రకాష్ నారాయణ, ఒబిసి నగర ఇన్‌ఛార్జ్  బీఎస్‌కె పట్నాయక్, రాష్ట్ర బిసి నాయకులు కొలను కృష్ణ, వాసా పల్లపరాజు, వెంట్రప్రగడ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Just In...