Published On: Fri, Nov 9th, 2018

బీజేపీయేతర పక్షాలను కూడగట్టడంలో చంద్రబాబు కీలక పాత్ర

* ఎంపీ కనకమేడల ర‌వీంద్ర‌కుమార్‌
* మోడీ నియంతృత్వ పోకడలు వ్యతిరేకంగా సంఘటితం
* చంద్రబాబుకు ప్రజల నుంచి అపూర్వ స్పందన
* బీజేపీని చావు దెబ్బతీసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు
* పీఎం మాటలు నమ్మకూడని పరిస్థితి వస్తుందని అనుకోలేదు
* ఆర్థిక వ్యవస్థను బ్రష్టుపట్టించిన కేంద్రం
* 2019లో బీజేపీ ఓటమి తప్పదు
సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ  నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలను సంఘటితం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్లు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని వివిధ పార్టీలను కూడగట్టడంలో చంద్రబాబు తీసుకుంటున్న చొరవరకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. కేంద్ర నియంతృత్వంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందన్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 5 కోట్ల ఆంధ్రప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నరని విమర్శించారు. ప్రధాన మంత్రి మాటలు తాము నమ్మామని, ప్రధాని మాటలు నమ్మకూడని పరిస్థితి వస్తుందని తాము అనుకోలేదన్నారు.  కేంద్రానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్రం ఇంత తీవ్రస్థాయిలో ఉద్యమం నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే మొదలన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన వివిధ పార్టీలను కూడగట్టడం ఆంధ్రప్రజల మనోభావాలు ప్రతిబింభించే విధంగా ఉందన్నారు. నిన్న బెంగుళూరు వెళ్లిన సందర్భంగా పద్మనాభ నగర్ లో చంద్రబాబు నాయుడుని చూడటానికి ప్రజలు భారీ స్థాయిలో తరలి వచ్చారని చెప్పారు. మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిలను చంద్రబాబు కలవడం దేశంలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడానికి ఓ వేదిక ఏర్పాటు చేయడంలో భాగంగా పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వానికి కర్ణాటక ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. కర్ణాటక ఫలితాలే అందుకు విజయ సూచికగా పేర్కొన్నారు. కర్ణాకటలో ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని చావు దెబ్బతీశాయన్నారు.  ఇది శుభ సూచికంగా పేర్కొన్నారు. దేశంలో త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల ఫలితాలను ఇవి సూచిస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీల రాజీనామాలను సరైన సమయంలో ఆమోదించి ఉంటే, ఆ తరువాత ఎన్నికలు జరిగితే ఇక్కడ టీడీపీ గెలిచి ఉండేదని చెప్పారు. ఆ భయంతోనే వారు రాజీనామా విషయంలో రాజకీయంగా వ్యవహరించారన్నారు. కర్ణాటకలో రాజీనామాలు ఆమోదించి ఎన్నికలు జరిపితే  ఏం జరిగిందో అందరికీ అర్ధమైందన్నారు.  2019 ఎన్నికలలో బీజేపీ ఓటమి తప్పదన్నారు. బీజేపీతో ప్రత్యక్షంగా గానీ, లోపాయకారీగా గానీ పొత్తుపెట్టుకునే వైసీపీ గానీ, పవన్ గానీ ఓటమి చూడవలసిందేనన్నారు. దేశ వ్యాప్తంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రజల మనోభావాలను గౌరవించే ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 1989లో వీపీ సింగ్ ని, ఆ తరువాత దేవగౌడ, గుజ్రాల్, వాజ్ పాయ్ లను ప్రధాన మంత్రులను చేయడంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఓ జాతీయ పార్టీలా జాతీయ దృక్పదంతో వ్యవహరించిందన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా టీడీపీ పని చేస్తోందని చెప్పారు. చంద్రబాబు చేపట్టిన ఉద్యమానికి శరద్ పవార్, మాయావతి, మూలాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి వారు మద్దతు పలుకుతున్నారని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థను బ్రష్టుపట్టించిన కేంద్రం
                 నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా వ్యవహరించి ఆర్థిక వ్యవస్థను బ్రష్టుపట్టించిందని కనకమేడల మండిపడ్డారు. నోట్లరద్దుపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. నల్లధనం, ఉగ్రవాదం, నకిలీ నోట్లను రూపుమాపుతామని చెబితే ఆ రోజు కేంద్రానికి మద్దతు పలికినట్లు తెలిపారు. అయితే వాస్తవంలో అది జరగలేదన్నారు. 93 శాతం డబ్బు బ్యాంకులలో డిపాజిట్ అయిందన్నారు.  నల్లధనం విషయంలో  కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పుడు  మాట మార్చారన్నారు. నల్లధనం వెలికి తీయలేదని, ఉగ్రవాదం పోలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు రూ.2వేల నోట్లను రద్దు చేయమంటే చేయలేదని చెప్పారు. ఆర్బీఐ, సీబీఐ మీద దాడులు చేశారని, ఐటీని తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఎంపీ కనకమేడల మండిపడ్డారు.

Just In...