Published On: Sun, Jan 27th, 2019

బీపీఎస్‌తో భ‌వ‌న నిర్మాణ రంగం క‌కావిక‌లం

* భ‌విష్య‌త్తులో అనుమ‌తి లేని అక్ర‌మ నిర్మాణాల‌తో ప్ర‌జ‌ల‌కు ప్రాణ‌సంక‌టం

* ప్ర‌భుత్వం తీరుపై క్రెడాయ్ ప్ర‌తినిధులు ఆగ్ర‌హం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాల‌ని, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం ద్వారా ఎటువంటి ఉపయోగం లేద‌ని ది కాన్ఫ‌డ‌రేష‌న్ ఆఫ్ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్‌) రాష్ట్ర అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఎ.శివారెడ్డి, సీహెచ్ సుధాక‌ర్‌ అన్నారు. బీపీఎస్ జీవోను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ మ‌హాత్మాగాంధీరోడ్డులోని ఓ హోట‌ల్‌లో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడారు. అక్ర‌మ భ‌వ‌న నిర్మాణ‌దారుల‌ను శిక్షించాల్సిన ప్ర‌భుత్వం వారి నుంచి కేవ‌లం కొంత రుసుము వ‌సూలు చేయ‌డం ద్వారా మ‌రింత‌మంది అక్ర‌మ‌ర్కుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లేన‌ని వారు మండిప‌డ్డారు. భవిష్య‌త్తులో భవన నిర్మాణం చేసుకునేవారు నాణ్యతా ప్రమాణాలు లేకుండానే ఇష్టారాజ్యంగా నిర్మించుకోవడానికి బిల్డింగ్ పీన‌లైజేష‌న్ స్కీం దోహదపడుతుంద‌న్నారు. ఇటువంటి అనాలోచిత చ‌ర్య‌ల ద్వారా ప్ర‌భుత్వం స‌క్ర‌మ మార్గంలో భ‌వ‌నాలు నిర్మిస్తున్న నిర్మాణ‌దారుల‌కు ఎటువంటి సందేశం ఇస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ప్రతి రెండు సంవత్సరాలు, లేదా మూడు సంవత్సరాలకు అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఏమాత్రం సరైంది కాద‌న్నారు. బిల్డింగ్ పీనలైజేషన్ అమ‌లు జీవోను వెంటనే రద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇటువంటి స్కీంల‌ను ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశం ఇస్తుంద‌ని వారు ప్ర‌శ్నించారు. ప్లానింగ్ లేని రిజిస్ట్రేష‌న్‌ల‌ను వెంట‌నే అడ్డుకుంటేనే అక్ర‌మ నిర్మాణాల ప‌రంప‌రకు క‌ళ్లెం వేయ‌గ‌లుగుతామ‌ని పేర్కొన్నారు. ఆ దిశ‌గా ప్ర‌భుత్వం కృషి చేయాల‌ని కోరారు. జీఎస్టీతో వ‌చ్చాకా దానితో పాటుగా గ్రీన్ ఫీజ్ అధికం అవుతుంద‌న్నారు. నిర్మాణం స‌మ‌యంలో ఖాళీస్థ‌లాల‌కు కూడా మూడేళ్ల ప‌రిమితితో కూడిన విధంగా ప‌న్నులు వ‌సూలు చేయ‌డం, 7.5 శాతం ఉన్న రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు 20 శాతం పెర‌గ‌డం వంటివి భ‌వ‌న నిర్మాణ రంగానికి అధిక భారం అవుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క్రెడాయ్ సంస్థ త‌ర‌ఫున ప్ర‌భుత్వానికి అనేక ర‌కాల ప‌న్నులు క‌ట్ట‌డంతో పాటు నాణ్య‌త ప్ర‌మాణాలు పాటిస్తూ పేద‌ల సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తూ నిబంధ‌న‌లు తూ.చ త‌ప్ప‌కుండా పాటించే త‌మ‌లాంటి వారిపై ప్ర‌భుత్వం జారీ చేసిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం జీవో శాపంగా ప‌రిణ‌మించింద‌న్నారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని భవిష్య‌త్తులో భవన నిర్మాణం చేసుకునేవారు ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించ‌కుండా య‌ధేశ్ఛ‌గా భ‌వ‌నాలు నిర్మిస్తే ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం భ‌ద్ర‌త లేకుండా పోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు ప్రాణ‌సంక‌టంగా ఉండే ఇటువంటి బీపీఎస్ జీవోను ప్ర‌భుత్వం వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. లేనిప‌క్షంలో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ రూపొందించి ముందుకు సాగుతామ‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. విలేక‌రుల స‌మావేశంలో క్రెడాయ్ సంస్థ విజ‌య‌వాడ చాప్ట‌ర్ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు వై.వి.ర‌మ‌ణ‌రావు, కె.రాజేంద్ర‌, ఉపాధ్య‌క్షుడు మోహ‌న్‌రావు, ప‌లువురు క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు.
 

Just In...