Published On: Tue, Aug 20th, 2019

బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక

* ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక నైపుణ్యాభివృద్ది శిక్షణా సంస్థ

* జగనన్న విద్యోన్నతి పథకం మరింత సమర్థవంతంగా అమలు

* బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎమ్.శంకరనారాయణ

సెల్ఐటి న్యూస్, అమరావతి: ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక నైపుణ్యాభివృద్ది శిక్షణా సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎమ్.శంకరనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ ల ద్వారా రాజకీయలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాల కోసం కొత్తగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరుపుతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 1,432 కోట్లు ఇతర శాఖలకు మళ్లించారని తెలిపారు. బీసీ సంక్షేమ హాస్టళ్లకు రెండేళ్లుగా అద్దెలు చెల్లించలేదని వెల్లడించారు. బ్యాంకులతో రుణాల ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆదరణ పథకం తో పాటు ఇతర అక్రమాలపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. కొన్ని కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు సరైన శిక్షణ అందించకుండా నిధులు తీసుకున్నాయన్న అభియోగాలున్నాయని వాటిపై విచారణ జరిపిస్తున్నామన్నారు. తాము బడ్జెట్ లో బి.సి. లకు చెందిన రూ.15,061 కోట్లు, కాపులకు 2 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. గతంలో ఒకే వ్యక్తి రెండు పథకాలు పొందారన్న అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యంత పారదర్శకంగా వెనకబడిన తరగతుల అభ్యున్నతికి పార్టీలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలాగా పని చేస్తామన్నారు. ఎంపిక చేయనున్న లబ్ధిదారుల విషయంలో వారి స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని యూనిట్స్ గ్రౌండింగ్ చేస్తారని, ఈ విషయంపై అటు బ్యాంకర్లతో పాటు లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. ప్రతి నెలా ఈడీ, జిల్లా కలెక్టర్ల తో పాటు బ్యాంకర్లతో కూడా జిల్లాలలో సమావేశం నిర్వహించాలని ఆదేశించామన్నారు. వెనకబడిన తరగతుల వారికి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ప్రయోజనం చేకూరేలా చిన్న, మధ్యతరహా యూనిట్స్ స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించామన్నారు. గతంలో మంజూరు చేసిన యూనిట్ల పంపిణీకి కట్టుబడి ఉన్నామని లబ్ధిదారు వాటాలు చెల్లించిన వారికి యూనిట్ల పంపిణీని చేపడతామన్నారు. అదే విధంగా 2014-15 నుండి 2018-19 మధ్య కాలంలో వినియోగించిన రాయితీ, నైపుణ్యాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు, డిబిటి (ప్రత్యక్ష ప్రయోజన పథకం) ద్వారా జీవనోపాధి పొందుతున్న వారి ఆర్థిక సహాయం అమలుపైనా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే వివిధ కార్పొరేషన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బీసీలకు, అణగారిన వర్గాలకు తమ ప్రభుత్వం అండగా ఉండి పని చేస్తుందని మంత్రి తెలిపారు. జగనన్న విద్యోన్నతి పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యాపారాలు, వాహనాల కొనుగోలుకు సంబంధించి సబ్సిడీతో పథకాలను అందించడం జరుగుతుందన్నారు.

Just In...