Published On: Thu, May 3rd, 2018

బెజవాడలో ఈదురుగాలుతో భారీ వర్షం..

* ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించిన కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

* రైతుల అత్యవసర సేవల నిమిత్తం ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: గత రెండు రోజులుగా ఈదురుగాలులతో కుండ‌పోత‌గా కురుస్తోన్న అకాల వర్షాలు విజయవాడ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో గురువారం ఉద‌యం విజ‌య‌వాడ‌లో దాదాపు 2 గంటల పాటు ఎడతెరపి లేకుండా ఏకధాటిగా కురిసిన వానకు పలు వీధులు జలమయమ్యయాయి. డ్రైన్లు పొంగిపొర్ల‌డంతో రోడ్ల‌పై మోకాలు లోతున నీరు నిలిచిపోయింది. దీంతో వాహ‌న‌చోద‌కులు త‌డిసి ముద్ద‌వ‌డంతో పాటు వారు ప‌డ్డ అవ‌స్థ‌లు చెప్ప‌న‌ల‌వికావు.. మ‌రోవైపున అకాల భారీ వర్షానికి విజ‌య‌వాడ పాత‌బ‌స్తీలో ప‌లువురు వ్యాపారులు స్వ‌చ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం ధాటికి పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో మండు వేసవిలో వరుణుడి ప్రతాపానికి బెంబేలెత్తిన నగరవాసులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. భారీ వర్షానికి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, పెడనలలో భారీ వర్షం కురిసింది. పెడనలో ఈదురు గాలులతో భారీ వర్షం పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా కృష్ణా జిల్లాకు పిడుగు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మచిలీపట్నం, పెడన, గుడూరు, చల్లపల్లి, గుడ్లవల్లేరు, పామర్రు, మైలవరం, జి.కొండూరు, ఆగిరిపల్లి తదితర మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేశారు. ఆకాలా వర్షల వల్ల వరి సాగు చేసిన రైతులకు ఏదైనా సమాచారం, సహయం అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ను అందుబాటులో ఉంచారు. కృష్ణా జిల్లాలోని రైతుల అత్యవసర సేవల నిమిత్తం ఫోన్ నెంబర్ 7702003571/ 9963479156 అందుబాటులో ఉంటాయ‌ని కలెక్టర్ తెలిపారు. అలాగే పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా రైతులకు తగిన సూచనలు ఎప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం వెల్ల‌డించారు. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా జిల్లా స‌మ‌చారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు.

Just In...