Published On: Sat, Mar 16th, 2019

బెజ‌వాడ దుర్గమ్మకు ఉగాది శోభ…

* లలితా సహస్ర నామార్చాన, హనుమాన్‌ చాలీసా పారాయణం 

* అదే రోజు ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంతోత్సవాలు 

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ఉగాది (తెలుగు సంవ‌త్స‌రాది) పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 6న బెజ‌వాడ  కనకదుర్గమ్మకు పుష్పార్చనతో పాటు లలితా సహస్ర నామార్చన చేసేందుకు దేవస్థానం అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో అమ్మవారి ఆలయానికి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడిని స్తుతిస్తూ మరోవైపు హనుమాన్‌ చాలీసా పారాయణ కూడా నిర్వహించనున్నారు. ఉగాది రోజు తెల్ల‌వారుజామున 3 గంటల నుంచి మరుసటి రోజు 3 గంటల వరకు 24 గంటలపాటు నిర్విరామంగా అమ్మవారికి, ఆంజనేయునికి అఖండ పారాయణం కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లోక కల్యాణార్థం ఇంద్రకీలాద్రిపై ఉగాది రోజు నిర్వహించతలపెట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సంద‌ర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ పిలుపునిచ్చారు. ఉగాది రోజు ఉదయం నుంచి మర్నాడు ఉదయం వరకు నిర్విరామంగా కొనసాగనున్న లలితా సహస్ర నామార్చన, హనుమాన్‌ చాలీసా పారాయణ కార్యక్రమాల్లో భక్తులు బృందాలుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్త బృందాల వారు ముందుగానే దేవస్థానంలోని సమాచార కేంద్రంలో, లేదా టోల్‌ ఫ్రీ నెంబరు 18004259099 ద్వారా గాని వివరాలు నమోదు చేయించుకుంటే.. అమ్మవారి లలితా సహస్ర నామార్చన, హనుమాన్‌ చాలీసా పారాయణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమయం కేటాయించడానికి వీలవుతుందని తెలిపారు. భక్తులకు మహామండపం వద్ద ఏర్పాట్లు చేసి దేవస్థానం తరపున అల్ఫాహారం, జల ప్రసాదం, క్షీరప్రసాదం, అమ్మవారి ప్రసాదాలను ఉచితంగా ఏర్పాటు చేస్తామని ఈవో కోటేశ్వరమ్మ చెప్పారు.
6 నుంచి బ్రహ్మోత్సవాలు…
ఉగాది రోజు నుంచే అమ్మవారి వసం తోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పర్వదినమైన ఏప్రిల్‌ 6వ తేదీ నుం చి 14వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మో త్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో కనకదుర్గమ్మకు రోజూపుష్పాలతో పుష్పార్చన జరుగుతుంది. సాధారణ భక్తులు కూడా ఉభయ రుసుము చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించాలని దేవస్థానం అధికారులు నిర్ణ‌యించారు. వసంతోత్సవాల్లో భాగంగా ఆంజనేయస్వామికి తమలపాకులతో ఆకు పూజ నిర్వ‌హించనున్నారు. 13న ఘాట్‌రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్దే సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14న శ్రీరామునికి పట్టాభిషేకం నిర్వహించిన అనంతరం పూర్ణాహుతితో అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

Just In...