Published On: Sat, Jul 25th, 2020

బెజ‌వాడ పాత‌బ‌స్తీలో చోరీ కేసు…

* రూ.4 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ
* గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు
* స్వ‌యంగా రంగంలోకి దిగిన సీపీ బత్తిన శ్రీనివాసులు
విజయవాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజయవాడ పాతబస్తీ కాటూరివారి వీధిలోని నగల దుకాణంలో శుక్ర‌వారం ఉద‌యం భారీ దోపిడీ జరిగింది. పట్టపగలే దుండగులు 7 కిలోల బంగారం, 7 కిలోల వెండి, రూ.42లక్షల నగదును దోచుకున్నారని బాధితులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు గంట‌ల వ్య‌వ‌ధిలో కేసును చేధించారు. సీపీ బ‌త్తిన శ్రీనివాసులు స్వ‌యంగా రంగంలోకి దిగి కేసును అన్ని కోణాల్లో ప‌రిశీలించి విచార‌ణ చేప‌ట్ట‌గా ఆ దుకాణంలో ప‌నిచేసే వ్య‌క్తే నేరానికి పాల్ప‌డ్డ‌ట్లు గుర్తించారు. అక్క‌డ నుంచి తీగ లాగితే డొంక క‌దిలింది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జ్యువెల్లరీ వ్యాపారి శ్యామ్‌కు పాతబస్తీ శివాలయం వీధిలో ‌నగల దుకాణం, కాటూరువారి వీధిలో వెండి వస్తువులు విక్రయించే దుకాణంలో భాగస్వామ్యం ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇద్దరు వ్యక్తులు శివాలయం వీధిలోని జ్యువెల్లరీ షాపు వద్దకు నగలు కొనేందుకు వచ్చారు. లాక్‌డౌన్‌ కావడంతో ఇక్కడ ఉన్న సరకును కాటూరువారి వీధిలోని దుకాణంలో ఉంచామని, కాసేపు వేచి ఉంటే అక్కడి నుంచి తెప్పిస్తామని మరొక వ్యాపార భాగస్వామి మనోహర్‌‌సింగ్‌ చెప్పారు. మనోహర్‌సింగ్‌ సూచనల మేరకు గుమాస్తా నగలు తెచ్చేందుకు కాటూరువారి వీధిలోని దుకాణం వద్దకు రాగా అక్కడ ఉన్న దుకాణం గుమాస్తా విక్రంసింగ్‌ అపస్మారక స్థితిలో గాయాలతో కనిపించాడు. వెంటనే అతడు ఈ విషయాన్ని యజమాని మనోహర్‌సింగ్‌కు, ఆయన తన వ్యాపార భాగస్వామికి శ్యాంకు తెలియజేశారు. శ్యాం తోటి వ్యాపారి రాజాసింగ్‌, మనోహర్‌సింగ్‌లను తీసుకొని సంఘటనా స్థలానికి వచ్చారు. గుమాస్తా విక్రంసింగ్‌ను తీవ్రంగా గాయపర్చిన నలుగురు వ్యక్తులు 7కిలోల బంగారం, 7కిలోల వెండి, రూ.42లక్షల నగదును దోచుకువెళ్లినట్లు శ్యాం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పశ్చిమ ఏసీపీ సుధాకర్‌ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు దోపిడీ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.  నగర పోలీస్‌ కమిషనర్‌‌ బి.శ్రీనివాసులు, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ విభాగం ఘ‌టనా స్థలం నుంచి వేలిముద్రలు సేకరించారు.
క్ర‌మంలో కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన విక్రమ్‌సింగ్‌పై అనుమానం వ్యక్తం చేసి ఆ దిశ‌గా విచార‌ణ చేప‌ట్టారు. రెం‌డు నెలల క్రితమే అతడు దుకాణంలో గుమస్తాగా చేరినట్లు యజమానులు చెప్పారు. ఈ సంద‌ర్భంగా కేసు పురోగ‌తిని సీపీ శ్రీనివాసులు మీడియాకు వెల్ల‌డించారు. సాయిచరణ్ జ్యుయలర్స్‌కు చెందిన రూ.4 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ అయ్యాయ‌ని తెలిపారు. గురుచరణ్ జ్యుయలర్స్ వారితో కలసి ఓ బిల్డింగ్ నందు లాకర్ ఏర్పాటు చేసి బంగారం, వెండి, నగదును ఉంచిన సాయి చరణ్ జ్యుయాలర్స్ అధినేత. సొత్తు ఉంచిన లాకర్‌కు కాప‌లాదారుగా రాజస్థాన్‌కు చెందిన విక్రమ్‌కుమార్ లోహియాను నియమించారు. శుక్రవారం ఉదయం రిలీవర్ వచ్చేసరికి విక్రమ్‌కుమార్ చేతులు, కాళ్ళు కట్టివేయబడి, గాయాలతో వున్నాడు. చోరీ సంగతి తెలుసుకుని ప్రత్యేక బృందాల ద్వారా హుటాహుటిన తనిఖీలు ఆరంభించాయి. కాపలాదారుడి వ్యవహారశైలిపై అనుమానంతో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా చోరీకి అసలు సూత్రధారి అతనేనని తేలింది. రెండు బ్యాగుల్లో సొత్తును ఉంచి భవనం వెనుక భాగం నుండి తరలించి, తనకు తానుగా గాయాలు చేసుకుని బంధించుకుని నాటకమాడాడు. విషయం తెలుసుకున్న గంటల వ్యవధిలోనే మెరుపు వేగంతో కేసును ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోగలిగాం. చోరీకి గురైన 7 కిలోల బంగారం, 19 కిలోల వెండి, 42 లక్షల నగదును పూర్తిగా స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో ఇంకెవరి పాత్రయినా వుందేమోననే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నాం. చోరీ కేసును గంటల వ్యవధిలో చేధించిన వన్‌టౌన్ సీఐ పి.వెంకటేశ్వర్లు, ఇత‌ర అధికారుల‌కు అభినందనలు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందజేస్తాం అని సీపీ వెల్ల‌డించారు.

Just In...