Published On: Sat, Jun 20th, 2020

బోటు షికారుకు పచ్చజెండా

* లాహిరి.. లాహిరిలో పడవ షికారు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కృష్ణానదిలో పర్యాటక శాఖ బోట్ల షికారుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జ‌గన్ మోహన్‌ రెడ్డి బోట్ల పర్యవేక్షణకు పర్యాటక జలవిహార నియంత్రణ కేంద్రాన్ని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గత సంవత్సరం గోదావరి నదిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ముంపు ప్రమాదం జరిగినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి, విశాఖపట్నం నదులు, సముద్రంలో పడవ విహారాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తరువాత కమిటీని ఏర్పాటు చేసి రక్షణ ఏర్పాట్లు సూచించే మేరకు పర్యాటక బోటింగ్ కు అనుమతించింది. పునఃప్రారంభించిన బోటింగ్ సౌకర్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఒకటి ప్రారంభించారు. ఈ కంట్రోల్ రూమ్ నుండి రెవెన్యూ శాఖ‌కు చెందిన అధికారి బోట్ల విహారానికి పర్యవేక్షకుడుగా ఉంటారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నుండి లైజన్ అధికారి, టూరిజం డిపార్ట్ మెంట్ నుండి సిస్టమ్ ఆపరేటర్, పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. అలాగే నదిలో విహారానికి వచ్చే యాత్రికులు ప్రయాణ సమయంలో దగ్గర ఉండి పర్యవేక్షించేందుకు ఎడిఆర్ ఎఫ్ బృందం అందుబాటులో ఉంటుంది. కంట్రోల్ రూమ్ వద్ద సుమారు 9 మంది సిబ్బంది ఉంటారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇక పై బోటింగ్ ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటమే తన ఉద్దేశ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు. బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్స్ లు, ఫిట్ నెస్ పరీక్షలతో పాటు పర్యాటకుల లైవ్ సేవింగ్ పరికరాలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 9 పర్యాటక కేంద్రాల్లో జలవిహారాన్ని పునఃప్రారంభించిన ముఖ్యమంత్రి విజయవాడ బరమ్ పార్కు నుండి పాల్గొన్న రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్‌లను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పల‌కరించారు. ఆ తరువాత కలెక్టర్‌తో మాట్లాడుతూ జలవిహార బోట్ల నిర్వహణకు సంబంధించి ప్రతి వారం కనీసం ఓ గంటపాటు సమయం కేటాయించమని కోరారు. స్టాండర్డ్ ఆపరేటర్ ప్రొసీజర్ , ప్రోటోకాల్ నిబంధనలు టూరిజం కోసం ఏర్పాటు చేసిన సిబ్బంది పాటించేలా నిఘా పెట్టమని కోరారు. అనంత‌రం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నగర ప్రజలు తమ కుటుంబ సభ్యులతో జలవిహారానికి రావచ్చని కోరారు. గతంలోలా ప్రమాదాలు జరగకుండా అన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్న‌ట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ మాట్లాడుతూ పది మంది కంటే తక్కువ ప్రయాణికులు కూర్చునే మూడు స్పీడ్ బోట్లను(సామర్ధ్యం ముగ్గురు పర్యాటకులు) జడ్ స్కై(ఒక ప్రయాణకుడు మాత్రమే)మూడు బోట్లతో కలిపి 9 బోట్లను ప్రారంభిస్తున్నామన్నారు. నగర ప్రజలు కరోనా నియమనింబంధనలను పాటిస్తూ పర్యాటకానికి రావచ్చని కోరారు. పర్యాటకానికి వచ్చే ప్రజలు మాస్కులు ధరించి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వెల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్‌లు కృష్ణానదిలో కొంత సేపు బోట్ షికారు చేశారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, బిబిఎం శ్రీనివాస్, జిల్లా టూరిజం అధికారి రామ్‌దాస్, పర్యాటకశాఖ డిఇ శ్రీనివాస్ యాదవ్, అసిస్టెంట్ మేనేజర్ ఆంజనేయులు, బరమ్ పార్క్ మేనేజర్ శ్రీనివాస్, ఐలాండ్ మేనేజర్ బి.సుధీర్, కంట్రోల్‌రూమ్ మేనేజర్ ఎం.డి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

Just In...