Published On: Fri, Mar 15th, 2019

”భక్తులతో భవదీయుడు”

* టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం

సెల్ఐటి న్యూస్‌, ఆధ్యాత్మికం: తిరుపతి సంపూర్ణ యాత్రలో భాగంగా తొలుత తిరుమలలో శ్రీ వరాహాస్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శిస్తేనే యాత్ర సంపూర్ణం అవుతుందని టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం అన్నారు. భక్తులతో.. భవదీయుడు కార్యక్రమం తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగింది. అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో శుక్రవారం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు టిటిడి అనుబంధ ఆలయాలు, ధార్మిక కార్యక్రమాలపై భక్తుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. టిటిడి విద్యా సంస్థలలోని విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యంతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. తిరుచానూరు అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులు టిటిడి అనుబంధ ఆలయాలైన శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణవనం, నాగలాపురం ఆలయాలను దర్శించుకోవాలని కోరారు. తిరుచానూరులోని ఫ్రైడే గార్డెన్స్‌లో పద్మావతి పరిణయం, శ్రీనివాస కల్యాణం వృత్తాంతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో 20 నిమిషాలపాటు లేజర్‌ షో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టిటిడి అనుబంధ ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను బ్రహ్మత్సవాల లోపు వేగంగా పూర్తి చేయాలన్నారు. అలాగే టిటిడి కాల్‌సెంటర్‌ ద్వారా భక్తులకు అవసరమైన సమాచారం మరింత వేగవంతంగా అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామావారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములువారి కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
         భక్తులతో భవదీయుడు కార్యక్రమంలో పలువురు భక్తులు ఫోన్‌ఇన్‌ ద్వారా జెఈవోకు తెలియజేశారు. అందులో ముఖ్యంగా అమెరికాలోని డల్లాస్‌ నగరంకు చెందిన ఎన్‌ఆర్‌ఐ సత్యనారాయణ ”అమెరికాలో టిటిడి నిర్వహించిన వైెభవోత్సవాలు, శ్రీవారి కల్యాణోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ప్రవాస యువతలో ఆధ్యాత్మికత పెంచేందుకు శుభప్రధం వంటి కార్యక్రమాలను అమెరికాలో నిర్వహించాలని కోరారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేద పారాయణం ఎస్వీబిసిలో ప్రత్యక్ష ప్రసారం” అందించాలని కోరారు. దీనిపై జెఈవో మాట్లాడుతూ అమెరికాలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేద పారాయణం ప్రత్యక్ష ప్రసారంపై ఆగమ సలహాదారుతో చర్చిస్తామన్నారు. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌ రెడ్డి ”టిటిడి పంచాంగం క్యాలెండరు కొరకు దేశ, విదేశాలలోని భక్తులు ఎదురుచూస్తున్నారు. దీనిని భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో టిటిడి నిర్మించిన డార్మీటరీ, 40 గదులు భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇటీవల తిరుపతిలోని గోవిందరాజ స్వామి వారి ఆలయంలో జరిగిన బంగారు కిరీటాల కేసుపై త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయంను ఏ.పి.టూరిజం వారికి కేటాయించాలని టిటిడి నిర్ణయించినట్లు పత్రికలలో వచ్చింది. దీనిని టిటిడి నిర్వహించడం వల్ల భక్తులకు మెరుగైన సౌకర్యాలు” అందించవచ్చని సూచించారు. జెఈవో స్పందిస్తూ త్వరలో భక్తులకు టిటిడి పంచాంగం క్యాలెండరు అందుబాటులోకి తీసుకువస్తాం. పెంచలకోనలో టిటిడి నిర్మించిన వసతి గృహాన్ని త్వరిత గతిన భక్తులకు అందుబాటులోనికి తీసుకువస్తాం. కిరీటాల కేసును పోలీస్‌లు దర్యాప్తు చేసున్నారు. టిటిడి అనుబంధ ఆలయాలలో భద్రాతను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. తిరుచానూరులోని పద్మావతి నిలయం అంశం ఈవో గారితో చర్చిస్తామన్నారు. విజయవాడకు చెందిన శ్రీ నాగభూషణం ”దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలో టిటిడి ఆధ్వర్యంలో విద్యా, వైద్య సేవలను” ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై జెఈవో మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలో దివ్వక్షేత్రాలు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా ఇటీవల హైదరాబాదులో శ్రీవారి ఆలయన్ని భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చాం. ప్రతి జిల్లాలో టిటిడి విద్యా సంస్థలు, వైద్య శాలలు ఏర్పాటు చేసేందుకు గల అవకాశాన్ని పరిశీలిస్తాం. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని వేదపాఠశాలలో వేద విద్యను బోధిస్తున్నాం. తిరుపతికి చెందిన జ్ఞానప్రకాష్‌ తిరుపతిలోని విష్ణునివాసం వసతి సమూదాయానికి ఐఎస్‌వో గుర్తింపు అందుకున్నందుకు అభినందనలు తెలిపారు. అనంతరం దేశ విదేశాల నుండి విచ్చేసే భక్తులకు వారివారి బాషలలో సమాచారం తెలిపేందుకు అనువాదంతో కూడిన సాఫ్ట్‌వేెర్‌ను అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని కోరారు. జెఈవో మాట్లాడుతూ దేశ విదేశాల నుండి విచ్చేసే భక్తులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. వారికి అవసరమైన సమాచారంను ఐవోటి (ఇంటర్నెట్‌ అఫ్‌ థింగ్స్‌) మరియు ఐటి ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టిటిడి సిఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్‌) వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు సుబ్రమణ్యం, ఝాన్సీరాణి, శ్రీధర్‌, వరలక్ష్మీ, ధ‌నంజయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Just In...