Published On: Wed, Apr 17th, 2019

భగవాన్ మహావీర్ జీవితం సమకాలీన ప్రపంచానికి ఆదర్శనీయం

* భారతదేశ ఆధ్యాత్మిక అభివృద్ధిలో జైన ధర్మం కీలక పాత్ర 

* సహజవనరుల వృధాకు స్వస్థి చెప్పాలి, ప్రకృతిని కాపాడుకోవాలి

* సౌభాగ్యం, వికాస సాధనకు శాంతి కీలకమైనది

* ఉన్నతమైన ప్రపంచాన్ని సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలి

* భగవాన్ మహావీర్ జయంతి వేడుక‌లో ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడు

సెల్ఐటి న్యూస్‌, ఆధ్యాత్మికం: సత్య మార్గంలో సహనంగా ముందుకు సాగాలని ప్రవచించిన భగవాన్ మహావీరుని జీవితాన్ని సమకాలీన ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బోధించిన శాంతి, అహింస మార్గంలో ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధ‌వారం జైన సేవా సంఘం నిర్వహించిన భగవాన్ మహవీర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎదురౌతున్న అనేక ప్రశ్నలకు జైన తత్త్వంలో సమాధానాలు దొరుకుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సత్యం, అహింస, సర్వజీవుల పట్ల కరుణ లాంటి భగవాన్ మహావీరుని సందేశాలు సత్యమార్గంలో ప్రకాశించాయని, వారి బోధనలు కేవలం ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే కాకుండా నైతిక ధర్మానికి చుక్కానిగా నిలుస్తాయని, సమస్త మానవాళి శాంతి, సౌభాగ్యం దిశగా ప్రతి ఒక్కరినీ ఉత్తేజితం చేస్తాయని తెలిపారు. ఈ భూమి మీద నడయాడిన ఉన్నతమైన ఆధ్యాత్మిక గురు పరంపరలో భగవాన్ మహావీరుడు కూడా ఒకరని అన్నారు. జైన ధర్మం భారత ఆధ్యాత్మిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్న ఉపరాష్ట్రపతి, భారతదేశ మూలభావనలైన సత్యం, అహింస, శాంతి మార్గాలను ముందుకు తీసుకుపోవడానికి జైనమతం కృషి చేసిందన్నారు. భారతదేశ సనాతన నాగరికత గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రేమ, శాంతి, సహనం, సోదర భావాలతో ఒకప్పుడు ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించిందని, అత్యున్నత విజ్ఞాన ఖనిగా భాసిల్లిన మన దేశం ప్రపంచానికి విశ్వగురు స్థానం వహించిందని, దీన్ని తిరిగి నిలబెట్టుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదం సహా అనేక కోణాల్లో భారతదేశం హింసా కాండతో పోరాడుతోందని, దీనికి వ్యతిరేకంగా ముందుకు సాగేందుకు జైన సిద్ధాంతాలైన శాంతి, అహింసలు సమాజానికి దోహదం చేస్తాయని, ఇది భారత స్వరాజ్య సంగ్రామమే ఉదాహరణ అని ఉపరాష్ట్రపతి తెలిపారు. అదే సమయంలో ప్రకృతి ప్రసాదించిన వనరుల వాడకం విషయంలోనూ సమాజం దృష్టికోణం మారాల్సి ఉందన్న ఆయన, ఈ నేపథ్యంలో మన జీవన విధానాన్ని మార్చుకోవాలని, ప్రకృతి మనకు ప్రసాదించిన వనరులను యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జైన సేవా సంఘం అధ్యక్షుడు వినోక్ కిమ్టీ, ప్రధాన కార్యదర్శి యోగేష్ సింఘి తదితరులు పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
* బంధనాలు, కోరికలు, మానసిక వికారాలను జయించి (జినులై) ఉంటే కైవల్యం సాధ్యమనేది జైన సిద్ధాంతం. అహింస మరియు పరిత్యాగం సిద్ధాంతాలు మోక్షానికి దగ్గరి మార్గాలని భగవాన్ మహావీరుడు బోధించారు. సమస్త విశ్వంలోని ప్రతి జీవి పట్ల ప్రేమను కలిగి ఉండాలని, అందరిని సమానంగా చూడాలనే సిద్ధాంతాన్ని ఆయన ప్రబోధించారు.
* మనుషుల్లాగానే జంతువులు, మొక్కలకు కూడా ఆత్మ ఉంటుందని, మనిషితో సమానంగా వాటి పట్ల కూడా సమభావన చూపాలని జైనధర్మం తెలియజేస్తుంది. శాంతి, భక్తి మరియు సామరస్యం కలిగి ఉండాలని, మన చుట్టూ ఉండే సహజ వనరులను జీవజాతులను రక్షించుకోవాలనే సందేశాన్ని జైనం తెలియజేస్తుంది.
* జైన ధర్మానికి త్రిరత్నాలు ఆధార భూతమైన సూత్రాలు. సమ్యక్‌ దర్శనం (సరైన నమ్మకం), సమ్యక్‌ జ్ఞానం (సరైన వివేకం), సమ్యక్‌ జీవనం (సరైన ప్రవర్తన). ఇవే గాక సత్యం, అహింస, అపరిగ్రహం (ఇతర వస్తువుల కోసం ఆశ పడకపోవడం), అస్థేయం (దొంగతనం చేయకపోవడం), బ్రహ్మచర్యం అనే ఐదు మార్గదర్శక సూత్రాలున్నాయి. వీటిని బోధిస్తూ మహావీరుడు తన జీవితాన్ని గడిపారు.
* పరమత సహనం కలిగి ఉండమని జైనం ఉద్ఘాటించింది. నిజానికి జైనమత మూల సిద్ధాంతాల్లో “అనేకాంతవాదం” ముఖ్యమైనది. “సత్యం ఒకటే అయినా అనేక మంది, అనేక విధాలుగా దాని గురించి చెప్పగలరు. కానీ ఎవరూ పూర్తి సత్యాన్ని చెప్పలేరు. అయినప్పటికీ చెప్పే ప్రతి సత్యం వెనుక కొంత నిజం ఉంది” అనే రుగ్వేద భావనే ఈ అనేకాంత వాదం.
* భారతదేశం ఒకప్పుడు ఉన్నతమైన నాగరికతకు కేంద్రంగా విలసిల్లింది. ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. ప్రేమ, శాంతి, సహనం, సోదరభావనను ప్రవచించి ప్రపంచానికి సాంస్కృతిక రాజధానిగా శోభిల్లడమే కాదు, విజ్ఞానఖనిగా, విశ్వగురువుగా భాసిల్లింది.
* మన మానవతా విలువలు, ప్రాచీన విజ్ఞానాన్ని తిరిగి నిలబెట్టుకుని ప్రపంచానికి నాయకత్వం వహించే మన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా ప్రతి భారతీయుడు ముందుకు సాగడం తక్షణ కర్తవ్యం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో జైన మత సిద్ధాంతాలు, సూత్రాలు మనకు మార్గదర్శనం చేస్తాయి.
* ప్రకృతి మనకు ప్రసాదించిన వనరుల మీద మనకు హక్కు కంటే బాధ్యత ఎక్కువ ఉంటుంది. మన ముందు తరాలకు వాటిని అదే విధంగా అందించాల్సిన ధర్మకర్తల్లాంటి బాధ్యత మనందరిది. ఈ భూమికి, ఇక్కడ ఉండే జీవజాలానికి ఏ విధమైన హానీ చేయకుండా, ఈ సమస్తవిశ్వాన్ని ముందు తరాలకు యధావిధిగా అందించేందుకు ప్రతిన బూనాలి.
* ఈ దిశలో మనందరం ముందుకు నడిచే విధంగా జైనం మనకు మార్గదర్శనం చేస్తుంది. శాంతి, అహింసల ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని,  దేన్నైనా సాధించుకోవచ్చనే విషయాన్ని మన స్వరాజ్య సంగ్రామం గుర్తు చేస్తుంది. జైనం ప్రేరణతో అదే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉంది.
* ప్రకృతి మనిషికి కావలసిన వాటన్నింటినీ సమకూరుస్తుంది. అలాంటి ప్రకృతికి హాని కలిగించడమంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అనే విషయాన్ని గుర్తెరిగి ముందుకు సాగాలి. ప్రకృతి వనరుల పై జరుగుతున్న నిర్లక్ష్య దోపిడీకి ఇప్పటికైనా చరమగీతం పాడాలి. దానికి అనుగుణంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతితో కలిసి జీవించాలి.
* భగవాన్ మహావీరుడి జయంతి అంటే కేవలం ఆయన పుట్టినరోజు మాత్రమే కాదు, శాంతియుత సహజీవనం మరియు సేవాభావాలకు ప్రతీకగా నిలిచే రోజు ఇది.
* సత్యం, అహింస మరియు అన్నీ జీవుల పట్ల కరుణను కలిగి ఉండాలనే మహావీరుని సందేశాలు నీతి, నిజాయితీలకు మార్గంగా ప్రకాశిస్తాయి. ఆధ్యాత్మిక విజ్ఞానం మరియు మహావీరుని బోధనలు శాంతి, సామరస్యం మరియు పురోగతి దిశగా మన జీవితాలను ముందుకు తీసుపోతాయి.
* ఈ పవిత్రమైన మహావీరుని జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే దిశగా ప్రతిఒక్కరం కంకణబద్ధులం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
* “సత్య మార్గంలో సహనంగా ముందుకు కదలండి” అనే మహా వీరుని ఆదర్శాలను ప్రతి ఒక్కరం మననం చేసుకుని సహనం, అంకితభావంతో సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని ఆకాంక్షిస్తున్నాను.
  

Just In...