Published On: Wed, Dec 4th, 2019

భవిష్యత్తులో ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు…

* ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవంలో వ‌క్త‌లు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ సర్వర్స్ అనే సంస్థ సహకారంతో ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. కార్యక్రమానికి విజయవాడ నగరంలోని పటమట విజయవాడ నగరపాలక సంస్థ హైస్కూల్, రామలింగేశ్వరనగర్‌కు చెందిన వినోద్ పబ్లిక్ స్కూల్, శ్రీసాయిబాల విద్యాలయం పాఠశాలల నుండి 8, 9 తరగతులకు చెందిన 166 మంది విద్యార్థులకు కళాశాల కంప్యూటర్ లేబరేటరీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎర్త్ సైన్సెస్, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఆధునిక ఆవిష్కరణలను సులభంగా నేర్చుకోవడానికి ఉపకరించే వీడియోలను, వెబ్ సైట్లను విద్యార్థులు స్వయంగా కంప్యూటర్ల ద్వారా అంతర్జాలం ఉపయోగించి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొన్నారు. ఇండియన్ సర్వర్స్ సంస్థ వ్యవస్థాపకుడు సాయి సతీష్ ఈ కార్యక్రమానికి ప్రధాన శిక్షకుడుగా విచ్చేసి విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్తులో ఐటీ రంగంలో లభించే ఉపాధి అవకాశాలు, జీవ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, రసాయన శాస్త్రాలలో క్లిష్టతరమైన అంశాలను సులువుగా అవగాహన చేసుకోవడానికి ఉపకరించే వీడియోలు, వెబ్ సైట్ల గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ మాట్లాడుతూ అక్షరాస్యత అంటే కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదని కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వినియోగించటం ద్వారా రోజువారీ పనులను సులభంగా చేరగలగటం, అధునాతన సాంకేతికత ద్వారా వృత్తి సంబంధిత బాధ్యతలు నెరవేర్చగలిగినప్పుడే అక్షరాస్యులుగా పరిగణిస్తున్నారని తెలియచేశారు. కంప్యూటర్ సైన్స్ ఉప విభాగాధిపతి కావూరి శ్రీధర్ మాట్లాడుతూ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సమీప ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులను తమ కళాశాలకు ఆహ్వానించి వారికి కంప్యూటర్ వియోగం పై, అంతర్జాల వినియోగం ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవటం వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నట్లు తెలియచేశారు. కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకులు లక్ష్మి, గోపీ, అమర్ దీప్, శివకుమార్, వీరేంద్రనాధ్, విద్యార్థులు ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Just In...