Published On: Fri, Aug 14th, 2020

భవిష్యత్తు అవసరాలక‌నుగుణంగా గిడ్డంగులను నిర్మించాలి

* గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై సీఎం జగన్ స‌మీక్ష‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఇప్పటి అవసరాలే కాదు.. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని గిడ్డంగులను నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం  జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ఇప్పటి అవసరాలే కాదు.. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని గిడ్డంగులను నిర్మించాలి. ప్ర‌తిపాదనల తయారీలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోండి. అలాగే ఆక్వాకు సంబంధించి ఐక్యూఎఫ్‌లను కూడా ఏర్పాటు చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రాథమికంగా ప్రాసెస్‌ చేయాలి. ఆ తర్వాత దశల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండాలి. అలాగే ప్రతి మండలానికి కోల్డు స్టోరేజీ సదుపాయం ఉండాలి.
జనతా బజార్ల ఏర్పాటుపైనా దృష్టి పెట్టండి. అమూల్‌తో మనం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాం. చేయూత, ఆసరా పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటున్నాం. పాడి పశువుల పెంపకం ద్వారా వారికి జీవనోపాధి మార్గాలను పెంచుతున్నాం. పాలను సేకరించడానికి పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో కూడా గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీ వంటి సదుపాయాలు కల్పించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. నిధుల సమీకరణ ప్రణాళికనూ ఖరారు చేయాలి. పంటలు అమ్ముకోలేక పోయామంటూ భవిష్యత్తులో రైతులు ఆందోళన చెందే పరిస్థితి రాకూడదు. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి, వేరుశనగ, కందులు, మొక్కజొన్న, మినుములు, శనగలు, జొన్న వంటి పంటలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వాటి మార్కెటింగ్‌ మాత్రమే కాకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పైనా దృష్టి పెట్టాలి. సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న, వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Just In...