Published On: Wed, Oct 16th, 2019

భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తాం

* పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

* మంత్రితో భేటీ అయిన సింగపూర్ ప్రతినిధుల బృందం

* నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై చర్చించిన మంత్రి

* పారదర్శక పారిశ్రామిక విధానంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

* స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు సాధ్యం చేస్తాం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: భవిష్యత్‌లో పారిశ్రామికవృద్ధి సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి గౌతమ్ రెడ్డిని  సింగపూర్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు అంశంపై చర్చించారు. త్వరలోనే 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి పరిశ్రమలలో స్వతహాగా వారికివారే ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి.. ప్రతినిధులకు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు  ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని మంత్రి సింగపూర్ ప్రతినిధుల బృందానికి స్పష్టం చేశారు. గతంలో ఏ శిక్షణ ఇవ్వకుండా కేవలం పరిశ్రమలలో పారిశుద్ధ్య కార్మికుల తరహా కిందస్థాయి పనులు చేసే వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని, ప్రస్తుతం ఆ విధానాలకు  స్వస్తి పలుకుతామన్నారు. నైపుణ్య శిక్షణ అందించి 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కల్పించి..అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపిస్తామన్నారు. పరిశ్రమలతో స్నేహపూర్వకంగా ఉండే పారదర్శక పాలసీని తీసుకువస్తామని మంత్రి ప్రతినిధులకు వివరించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో వ్యవహరిస్తామన్నారు. స్పష్టమైన ప్రణాళిక రూపొందించి పరిశ్రమలకు అవసరమైన మేరకే ప్రోత్సాహకాలు అందించనున్నామన్నారు మంత్రి.  ఆ విషయంలో రెండో ఆలోచన ఉండబోదన్నారు.  పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో పరిశ్రమలకు కావలసిన వనరులన్నీ ఒకచోటే ఉండడం వలన ప్రోత్సాహకాల కన్నా వసతులే ప్రామాణికంగా తీసుకుని చాలా కంపెనీలు తరలివచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ తరహా విధానాలను అనుసరిస్తామన్నారు. ప్రోత్సాహకాల కన్నా ఆంధ్రప్రదేశ్ కే తలమానీకమైన తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్ పోర్టుల వంటి సానుకూల అంశాలను ఉపయోగించుకుని అద్భుత అవకాశాలుగా మలచుకునే పరిశ్రమలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించి.. రాష్ట్ర యువతీ, యువకులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సలహాదారు కృష్ణ జి.వి. గిరి , సింగపూర్ ప్రతినిధులు కె.ఎస్.ఇయాన్, చెంగ్ హాంగ్ సియాంగ్, టియో చీ హొవె, వెలెరీ టియో, ఈస్తర్ టాన్ తదితరులు పాల్గొన్నారు.

Just In...