Published On: Tue, Apr 17th, 2018

భాజపా అధ్యక్ష పదవికి కంభంపాటి రాజీనామా

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారు. గత నాలుగేళ్లుగా పార్టీ రాష్ట్ర బాధ్యతలు హరిబాబు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని జాతీయ నాయకత్వం కొద్దిరోజులుగా భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుని ఎంపికకు మార్గం సుగమం చేసేందుకు ఆయన రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో మారిన రాజకీయ పరిణామాలు భాజపా నాయకత్వానికి సవాలుగా మారాయి. రాష్ట్ర విభజన సమయంలో హరిబాబును భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించారు. తెదేపాతో మిత్రధర్మం కాపాడుతూ నాలుగేళ్ల పాటు తన బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మృధు స్వభావిగా ఉండే హరిబాబు  తెదేపాతో విభేదాలు వచ్చిన సమయంలోనూ పూర్తి సంయమనంతో వ్యవహరించారు. అవతలి వైపు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా తన సహజ ధోరణిలో వ్యవహరించారే తప్ప… ఎక్కడా దూకుడుగా వెళ్లలేదు. పార్టీలోని కొందరు నేతలు ఈ విషయంలో దూకుడు పెంచాలని సూచించినా తన సహజత్వానికి భిన్నంగా వెళ్లలేనని తేల్చిచెప్పేవారు. కొత్త అధ్యక్షుని ఎంపిక కోసం పార్టీ కసరత్తు చేస్తోన్న తరుణంలో తన పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందే కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగాలనేది హరిబాబు అభిప్రాయం. ఇప్పటికే పలువురి పేర్లను బీజేపీ కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోంది. మాణిక్యాలరావుని పిలిచి మాట్లాడగా ఆయన విముఖత వ్యక్తం చేశారు. దీంతో సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ, పురంధరేశ్వరి, ఆకుల సత్యనారాయణ పేర్లను పరిశీలిస్తున్నారు. సామాజిక సమీకరణలే కొత్త అధ్యక్షుని ఎంపికలో కీలకం కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Just In...