Published On: Tue, May 15th, 2018

భాజపా ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం భాజపా కేంద్ర నాయకత్వం ఎట్ట‌కేల‌కు కన్నా వైపే మొగ్గు చూపింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా సోము వీర్రాజు ఎన్నికయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు ఈ నియామక ఉత్తర్వులను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ జారీ చేశారు. నిన్నటి వరకూ కర్ణాటక ఎన్నికల హడావుడిలో ఉన్న అమిత్‌షా నేడు ఈ నియామకం చేపట్టారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల అనంతరం భాజపాలో చేరిన విషయం విధిత‌మె. ఈ సంద‌ర్భంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అందరి సహకారంతో పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయాన్ని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కేంద్రంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని వెల్ల‌డించారు.

Just In...