Published On: Fri, Nov 2nd, 2018

భారత్ నెట్ ఫేజ్-2 కింద జూన్ నాటికి అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్

* సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో భారత్ నెట్ ఫేజ్-2 కింద వచ్చే జూన్ నాటికి అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్ సౌకర్యాన్ని పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో భారత్ నెట్ ఫేజ్-2 కార్యక్రమంపై ఆయన అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇప్పటికే భారత్ నెట్ ఫేజ్-1 కింద వివిధ గ్రామాలకు ఈసౌకర్యాన్ని కల్పించినందున ఫేజ్-2 కింద మిగతా గ్రామాలన్నిటికీ ఈసౌకర్యాన్ని పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.ప్రజలకు 140రూ.లకే మెరుగైన రీతిలో ఇంటర్నెట్,టెలిఫోన్,టివి చానళ్ల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఎపి ఫైబర్ నెట్ కింద పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందని తెలిపారు.భారత టెలికం కమీషన్ 851కోట్ల రూ.లతో భారత్ నెట్ ఫేజ్-2 అమలుకు ఆమోదం తెలిపినందున ఈసౌకర్యాన్ని అన్ని గ్రామాలకు త్వరితగతిన విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ పునేఠ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎపి స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండి దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 11వేల 254 గ్రామ పంచాయితీలకు ఈఫైబర్ నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చేదుంకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఈప్రాజెక్టు అమలుకు భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్కు లిమిటెడ్ (బిబిఎన్ఎల్),రాష్ట్ర ప్రభుత్వం మరియు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ లమధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని వచ్చే జూన్ నాటికి ఈప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని వివరించారు.ఆర్టిజి సిఇఓ బాబు ఎ మాట్లాడుతూ రాష్ట్రంలో 2012 నుండి ఈ భారత్ నెట్ కార్యక్రమం అమలు జరుగుతోందని పేర్కొన్నారు.ఇప్పటికే 24వేల కి.లో మీటర్ల పొడవున కేబుల్ లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో ఇంధన,ఐటి శాఖల ముఖ్యకార్యదర్శులు అజయ్ జైన్,విజయానంద్, ఢిల్లీ నుండి వీడియో కాన్పరెన్సు ద్వారా బిబిఎన్ఎల్ (భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్కు లిమిటెడ్)సిఎండి సుజయ్ సింగ్, టెలికమ్యునికేషన్ శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ ఓఎప్ఫ్) చెందిన జాయింట్ అడ్మినిస్ట్రేటర్ మనోజ్ పాల్గొనగా బిఎస్ఎన్ఎల్ ఎపి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (బిబిఎన్ఎల్) ఎస్.శాస్త్రి, సిజియం చాప్ర, డిజిఎం శ్రీరామూర్తి, రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఇడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Just In...