Published On: Thu, Apr 12th, 2018

భూధార్‌తో అక్రమాలకు క‌ళ్లెం..

* భూసేవ పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

* కృష్ణాజిల్లాలో రెండు చోట్ల ప్ర‌యోగాత్మ‌కంగా భూసేవ ప‌థ‌కం అమ‌లు 

* జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు మున్సిపాలిటీలు చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతాయ‌న్న సీఎం 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: దేశంలో మొదటిసారిగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్‌లో భూధార్ పైలెట్ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. భూదార్ ప్రాజెక్టుతో జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు మున్సిపాలిటీలు చ‌రిత్ర‌లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలో భూసేవా (భూదార్) పైలెట్ ప్రాజెక్టును ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ భూ సేవ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 0.50 కోట్ల పట్టణ ఆస్తులు, 0.85 కోట్ల గ్రామీణ ఆస్తులకు భూదార్ సంఖ్య కేటాయించడం జరుగుతుందన్నారు. భూ సేవ ద్వారా 20 సెంట్ల భూమికి సంబంధించిన సేవలు భూసమాచారం వంటి సేవలను ఎలక్ట్రానిక్ మూడ్‌లో అందిస్తామ‌న్నారు. భూ సేవ ప్రాజెక్టులో ఈ ప్రగతి ద్వారా సాంకేతిక పరిజ్ఞానం జోడించి ముఖ్యమైన విభాగంగా దీనిని నిలపగలుగుతున్నామని పేర్కొన్నారు. భూమికి సంబంధించిన 6 శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎకతాటిపైకి తీసుకుని రావడం ద్వారా ప్రజలకు భూసంబంధిత సేవలు మరింత చేరువ చేయగలిగామన్నారు. రెవెన్యూ, మున్సిపల్, సర్వే శాఖ, రిజిస్ట్రేషన్స్, పంచాయతీ, ఆటవీ శాఖల భాగస్వామ్యంతో దీనిని చేపట్టడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని రైతుకు భూమే జీవనాధారమని, భూమి వారి ఆస్తి అని, భూమి వల్లే వారికి సామాజిక భద్రత, హోదా లభిస్తుందని తెలిపారు. ప్రజలకు వారి భూములపై భరోసాన్ని కల్పించాలని రాష్ట్రంలో భూదార్ అమలు చేస్తున్నామన్నారు. భూ సేవ పైలెట్ ప్రాజెక్టు రూపకల్పనలో నేషనల్ ఇన్‌ఫ‌ర్‌మెటిక్ సెంటర్ (ఎన్ఐసి) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిందన్నారు. స‌మాజంలో ఉండే 5 శాతం దళారీ వ్యవస్థ వల్ల 95 శాతం మంది వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క పైసా అవినీతి లేకుండా ఆన్‌లైన్ ద్వారా అన్ని సేవలు ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయని వివిధ సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అందించడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. భూధార్ ద్వారా భూములకు 11 అంకెల విశిష్ట సంఖ్యను ఇవ్వడంతో ఆ భూములకు రక్షణ ఏర్పడుతుందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఇంటింటికి ఒక విశిష్ట సంఖ్యను ఇవ్వడం జరుగుతుందన్నారు. భూసంస్కరణలకు నాంది పలకడం కోసం నూతన ప్రక్రియకు నేడు శ్రీకారం చుట్టామన్నారు. మానవ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు సాంకేతికతను వివిధ మాధ్యమాలను అనుసరించడం జరుగుతుందన్నారు. ఆర్థిక అసమానతలు లేని నవసమాజం కోసం పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి వెల్ల‌డించారు. భూసేవతో చరిత్రలో ఒక ముఖ్య ఘట్టానికి నాంది పలికామని ఒకప్పుడు గ్రామ మునసబు దస్తావేజులు రాసేవారని, ఆ రికార్డులు ఆయనకు తప్ప ఎవరికి ఆర్ధం అయ్యేవి కావని ప్రజలందరికి ఆర్థమయ్యే రీతిలో రికార్డులు రాసే వ్యవస్థను ఎన్.టి.రామారావు రాష్ట్రంలో ప్రవేశ పెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పీడనకు నిదర్శనమైన ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాలను ఎన్టీఆర్ రద్దు చేశారన్నారు. భూములు, ఆస్తుల లావాదేవీలలో ఆక్రమాలు జరగకుండా భూదార్ తీసుకువచ్చామన్నారు. భూములు కొనుగోలు విక్రయాల్లో ఆటోమెటిక్‌గా లావాదేవీలు జరుగుతాయని గతంలో లాగా ఆఫీసులకు వెళ్లి ఆసహనానికి గురయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉండదన్నారు. ఒక్క పైసా అవినీతి లేకుండా నీతివంతమైన పాలనకు శ్రీకారం చుట్టాం అన్నారు. టెక్నాలజీ ఉపయోగించుకోకపోతే వెనుకబడతామ‌న్నారు. నాలుగేళ్లలో కేంద్రం సహకరించకపోయినా.. ఎవరికీ కష్టం లేకుండా అన్ని వసతులు కల్పించాం అని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు రూ.8 వేలు ఇచ్చాం, మరో రూ.2వేలు ఇస్తాం అని తెలిపారు. రైతులకు రూ.24వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం అని ముఖ్య‌మంత్రి చంద్రబాబు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా తొలి భూధార్‌ కార్డును కానూరి శిరీష‌, వెన్నుబోయిన నాగేశ్వ‌ర‌రావు, ఏటుకూరి అంజ‌య్యకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అందజేశారు. భూసేవ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ భూధార్‌ ద్వారా సత్యమైన భూ సమాచారం, సమీకృత భూ సేవలు అందించవచ్చన్నారు. అక్టోబర్‌ 2 నాటికి రాష్ట్రం మొత్తం భూధార్‌ పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా కృష్ఱా జిల్లాలో అమలవుతున్న మేము సైతం కార్య‌క్ర‌మానికి సంబంధించి సజ్జ లడ్డు.. నువ్వుల లడ్డూ గురించి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడుకు క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం వివరించారు. భూసే పైలెట్ ప్రాజెక్ట్ కార్య‌క్ర‌మంలో మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి అనిల్‌చంద్ పునీత‌, జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌), స్పెష‌ల్ సీఎస్ మ‌న్మోహ‌న్ సింగ్, కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం, భూ ప‌రిపాల‌న శాఖ క‌మీష‌న‌ర్ జ‌గ‌న్నాధం, దేవాదాయ శాఖ క‌మీష‌న‌ర్ అనూరాధ‌, ఎన్ఐసి అధికారులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.
 

Just In...