Published On: Fri, Jan 11th, 2019

భౌగోళిక సూచిల సాధ‌న‌కు ప‌ర్యాట‌క శాఖ స‌మ‌న్వ‌యం

* ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్‌కుమార్ మీనా

* మ‌న ఆహారం న‌చ్చితే, వారే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాయ‌బారులు

* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 66 రుచుల‌తో ప్ర‌త్యేక పుస్త‌కం

* నోవాటెల్‌లో తెలుగు రుచుల పండుగ ప్రారంభం 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: తెలుగు ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ప్ర‌త్యేక అంశాల‌కు భౌగోళిక సూచిలు పొందేందుకు ప‌ర్యాట‌క శాఖ కృషి చేస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క , భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం హ‌క్కు దారులు మాత్ర‌మే సూచిలు పొందేందుకు అర్హులు అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర విస్రృత ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌ర్యాట‌క శాఖ స‌మ‌న్వ‌య బాధ్య‌త‌ను తీసుకోనుంద‌ని వివ‌రించారు. విజ‌య‌వాడ నోవాటెల్ వేదిక‌గా నిర్వ‌హిస్తున్న ఆంధ్రా ఆహార పండుగ‌ను శుక్ర‌వారం ముఖేష్ కుమార్ మీనా ప్రారంభించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్ధ ఛైర్మ‌న్ అచార్య జ‌య‌రామిరెడ్డి కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఆ నేప‌ధ్యంలో మీనా మాట్లాడుతూ భౌగోళిక సూచిల సాధ‌న ద్వారా రాష్ట్రానికి చెందిన ప్ర‌త్యేక రుచులు, ఆహార ప‌దార్డాల‌పై ప‌రోక్షంగా హ‌క్కును పొంద‌గ‌లుగుతామ‌న్నారు.  ఒక్కో ప్రాంతంలో తయారయ్యే, ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంద‌ని అదే వాటి ప్రత్యేకత కాగా తెలుగునాట వీటికి కొద‌వ లేద‌న్నారు.  ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని, ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు ల‌భిస్తుంద‌ని, ప‌ర్యాట‌క శాఖ ఈ విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించిద‌ని వివ‌రించారు. ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ర్షించేందుకు మంచి ఆహారం ఒక ఆయుధ‌మ‌ని, దానిని మ‌నం స‌మ‌కూర్చ‌గ‌లిగితే ఒక సారి వ‌చ్చిన ప‌ర్యాట‌కులే మ‌న‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌లుగా మార‌తార‌ని మీనా అన్నారు. తెలుగు వారికే ప‌రిమితమైన ఆహారంలో రుచుల‌కు, పోష‌క విలువ‌ల‌కు కొద‌వ లేద‌ని దానిని మ‌రింత‌గా ప్ర‌చారంలోకి తీసుకురావాల‌న్న‌దే ప‌ర్యాట‌క శాఖ ఉద్దేశ్య‌మ‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌యారు చేస్తున్న బాంబు చికెన్ ఇప్పుడు జాతీయ స్దాయిలో ప్రాచుర్యం పొందుతుంద‌ని, రాజ‌స్దాన్‌లో దీని గురించి అడుగుతున్నార‌న్నారు.  రాష్ట్రానికి వ‌స్తున్న దేశీయ ప‌ర్యాట‌కుల సంఖ్య నానాటికీ పెరుగుతుంద‌ని ప్ర‌స్తుతం అది ఏడాదికి 19 కోట్ల‌కు చేరింద‌ని మీనా వివ‌రించారు. ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్ధ ఛైర్మ‌న్ అచార్య జ‌య‌రామి రెడ్డి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయిడు ప‌ర్యాట‌క ప్ర‌గ‌తి విష‌యంలో నిశిత దృష్టి సారించార‌ని, ప‌ర్యాట‌కంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అభివృద్ది చేసుకోవ‌టం ద్వారా ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు కూడా మెరుగు ప‌డ‌తాయ‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 66 ర‌కాల ఆహార రుచుల‌తో నూత‌నంగా ఒక పుస్త‌కాన్ని తీసుకురానున్నామ‌న్నారు.  ఆహార పండుగ కోసం నోవాటెల్ చేసిన ఏర్పాట్లు అంద‌రినీ అల‌రించాయి. తెలుగు సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబించించేలా చేసిన ఆలంక‌ర‌ణ భోజ‌న ప్రియుల‌కు ఆహ్లాదంలో ముంచెత్తింది. గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా మామిడి తోర‌ణాలు, అర‌టి చెట్లు, కొబ్బ‌రాకులు , చెర‌కు గ‌డ‌లు ఏర్పాటు చేయ‌గా, ఆహార పండుగ కోసం సిద్దం చేసిన ప‌దార్దాలు తెలుగు రుచికి అద్దం ప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా నోవాటెల్ జిఎం టివి మ‌ధుపాల్ మాట్లాడుతూ ప‌ది రోజుల ఉత్స‌వంలో తాము ప్ర‌తి రోజు ఒక కొత్త ప‌ట్టిక‌తో సిద్దం అవుతున్నామ‌ని, ఆంధ్రులు ఇష్టంగా అర‌గించే అన్ని రుచులు ఇక్క‌డ సిద్దంగా ఉంటాయ‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఎపిటిఎ ప‌రిపాల‌నా సంచాల‌కులు డాక్ట‌ర్ సాంబ‌శివ‌రాజు, మార్కెటింగ్ సంచాల‌కులు శ్రీ‌నివాస‌రావు, ఉప‌సంచాల‌కులు నిషార్ అహ్మ‌ద్‌, ఎపిటిడిసి జిఎంలు హర‌నాధ్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Just In...