Published On: Thu, Feb 14th, 2019

భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాల క‌ల్ప‌నే ధ్యేయం

* తిరుప‌తి జేఈవో ల‌క్ష్మీకాంతం వెల్ల‌డి

* ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వ‌స‌తి సముదాయం ప‌రిశీల‌న 

సెల్ఐటి న్యూస్‌, తిరుప‌తి: సిరుల‌త‌ల్లి ప‌ద్మావ‌తి అమ్మ‌వారు కొలువైన తిరుచానూరులో భ‌క్తుల సౌక‌ర్యార్థం టిటిడి నూత‌నంగా నిర్మిస్తున్న శ్రీప‌ద్మావ‌తి వ‌స‌తి స‌మూదాయాని తిరుప‌తి జెఈవో బి.ల‌క్ష్మీకాంతం బుధ‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో ల‌క్ష్మీకాంతం మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరులో 5.25 ఎక‌రాల విస్తీర్ణంలో 4.25 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల‌లో వసతి గృహ‌న్ని నిర్మించిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా తాగునీరు, అన్నప్రసాదాలు, గ‌దుల‌లో ఫ‌ర్నిచ‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ వైరింగ్‌, నీటి స‌ర‌ఫ‌రా, ప్ర‌చుర‌ణ‌ల విక్ర‌య కేంద్రం, ఎటిఎమ్‌లు, లగేజి కౌంటర్లు, మరుగుదొడ్లు, లాక‌ర్లు, భ‌ధ్ర‌తా సిబ్బంది, తదితర విషయాలపై సమీక్షించి ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌క్తుల‌కు ఆహ్లాద‌క‌రంగా ఉండేందుకు విరివిగా చెట్ల‌ను నాటాల‌ని డిఎఫ్‌వోను ఆదేశించారు. అదేవిధంగా వ‌స‌తి స‌మూదాయం నుండి తిరుప‌తి, తిరుమ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సులు న‌డిపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం శ్రీ‌వారి ద‌ర్శ‌నం టోకెన్లు పొందేందుకు కౌంట‌ర్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. భ‌క్తులు వ‌స‌తి గృహంలోని గ‌దుల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. తొలుత ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి జేఈవో ల‌క్ష్మీకాంతం శ్రీ పద్మావతి వసతి సముదాయంలో జ‌రుగుతున్న‌ ప‌నుల‌ను ప‌రిశీలించారు. వ‌స‌తి స‌మూదాయంలో తాగునీరు, లాకర్లు, నీటిసరఫరా, ఫర్నిచర్‌, తదితర సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అసంపూర్ణంగా ఉన్న ఇంజినీరింగ్‌ పనులను పూర్తిచేయాలన్నారు. వసతి సమూదాయంలో అవసరమైన సిబ్బందిని నియమించాలని, వ‌స‌తి గృహలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంత‌రం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకుని, ఆల‌యంలో భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాలు, క్యూలైన్లు, అన్న‌ప్ర‌సాదాలు పంపిణీ, భ‌ద్ర‌త‌ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించారు. భ‌క్తుల‌కు మ‌రింత వేగంగా, సుల‌భంగా అమ్మ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో టిటిడి సిఇ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎస్ఇ రాములు, ఆల‌య డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, విజివో అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

Just In...