Published On: Fri, May 3rd, 2019

భ‌ళా… ఆర్టీజీఎస్‌!

* మీ అంచ‌నాలు అమోఘం

* ఫోనీ గ‌మ‌నాన్ని క‌చ్చితంగా అంచ‌నా వేశారు

* మీరిచ్చిన స‌మాచారం మాకెంతో ఉప‌యోగ‌ప‌డింది

* ఒడిశా ప్ర‌భుత్వం కృత‌ఙ‌త‌లు

* ఆర్టీజీఎస్ కృషిని అభినందించిన సీఎస్‌

* ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌కుండా ఫోనీని ఎదుర్కొన్న ఏపీ

* ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌త‌లో త‌న స‌త్తా మ‌రోసారి చాటిన ప్ర‌భుత్వం

* నిరంత‌రం ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసిన ఆర్టీజీఎస్‌

* ఫోనీ తీరం దాటే వ‌ర‌కు కునుకేయ‌ని అధికారులు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌లో, తుపానుల‌ను క‌చ్చితంగా ప‌సిగ‌ట్ట‌డంలో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ మ‌రోమారు త‌న స‌త్తా చాటింది. గ‌తంలో తిత్లీ, పెతాయ్ తుపాన్‌లు ఎక్క‌డ తీరం దాటుతాయో అంద‌రికంటే ముందుగా, అత్యంత క‌చ్చితంగా అంచనా వేసి.. రాష్ట్రంలో ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా చేయ‌డంలో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఫోని తుపాన్ విష‌యంలోనూ ఇదే త‌ర‌హా విజ‌యం సాధించింది. పెను ప్ర‌మాదం నుంచి రాష్ట్రం బ‌య‌ట‌ప‌డేలా చేసింది. బంగాళాఖాతంలో తుపాన్ ఏర్ప‌డుతోంద‌ని ప‌ది రోజుల క్రిత‌మే ఆర్టీజీఎస్ గ‌మ‌నించింది. ఏప్రిల్ 26వ తేదీన బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ అల్ప‌పీడ‌నాన్ని గ‌మ‌నించి.. అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసింది. మ‌రో మూడు రోజుల‌కు అది ఫోనీ తుపాన్‌గా రూపాంత‌రం చెందిన‌ట్టు అంచ‌నా వేశారు. అక్క‌డి నుంచి ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం శాస్త్రవేత్త‌లు, ప‌రిశోధ‌కులు.. రేయింబ‌వ‌ళ్లు తుపాన్ గ‌మ‌నాన్ని ప‌సిగ‌డుతూ వ‌చ్చారు. ఏ దిశ‌లో ప‌య‌నిస్తోంది, ఎంత వేగంతో క‌దులుతోంది, ఎప్పుడు ఏ స‌మ‌యంలో తీరం దాటుతుంద‌న్న అంశాల‌ను అవేర్ బృందం క‌చ్చితంగా అత్యాధునిక శాస్త్ర సాంకేతిక విధానాల‌తో అంచ‌నా వేసింది. ఈ అంచ‌నాల‌కు అనుగుణంగా ఆర్టీజీఎస్ రాష్ట్ర ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని, జిల్లాల్ల‌ని ప్ర‌భుత్వ యంత్రాగాన్ని అప్ర‌మ‌త్తం చేసింది. తుపాన్ గురించి అనుక్ష‌ణం మీడియాలో ప్ర‌చారం క‌ల్పించి ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసింది. తుపాన్ క‌చ్చితంగా ఒడీషా రాష్ట్రంలోని పూరి వ‌ద్ద తీరం దాట‌బోతోంద‌ని, ఫ‌లితంగా శ్రీకాకుళం, విజ‌య‌గ‌న‌రం తీర ప్రాంత మండ‌లాల్లో తీవ్ర ప్రభావం ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. దాంతో జిల్లా యంత్రాంగాల‌ను ఆర్టీజీఎస్ అధికారులు ముంద‌స్తుగా స‌న్న‌ద్ధం చేశారు.
ముంద‌స్తు చ‌ర్య‌లు 
ఫోని తుపాన్ కార‌ణంగా తీర ప్రాంతాల్లో 140 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని ఆర్టీజీఎస్‌ అంచ‌నా వేసింది. 1100 నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జాల‌ర్ల‌కు తుపాన్ హెచ్చ‌రిక‌లు పంపింది. జాల‌ర్లు వేట‌కు వెళ్ల‌కుండా నిరోధించే చ‌ర్య‌లు తీసుకుంది. అప్ప‌టికే స‌ముంద్ర‌లో చేప‌ల వేట‌కు వెళ్లిన వారిని వెన‌క్కి వ‌చ్చేలా చేసింది. తుపాన్ తీరం దాటే స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ జారీ చేసిన హెచ్చ‌రిక‌లు కూడా చాలా వ‌ర‌కు ప‌నిచేశాయి. తీరప్రాంత మండ‌లాల్లో 89వేల మంది వాహ‌న య‌జ‌మానుల‌ను గుర్తించి.. వారంద‌రికీ ఫోన్ చేయ‌డం ద్వారా తుపాన్ స‌మ‌యంలో బ‌య‌ట‌కు రాకుండా నిరోధించ‌గ‌లిగింది. ఆర్ & బీ, పోలీసు విభాగాల సాయంతో వాహ‌నాల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌ను గుర్తించి.. తుపాన్ తీరం దాటే స‌య‌మ‌యంలో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపేయ‌గ‌లిగింది. విద్యుత్‌ శాఖ స‌హ‌కారంతో ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేయించింది. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు ఆర్టీజీఎస్‌లో మ‌కాం వేసేలా చేసి.. ప్రత్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ ఉండేలా చూసింది.
ప్ర‌తి మండ‌లాన్ని అంచాన వేశాం
తుపాన్ గ‌మ‌నానికి సంబంధించి ఆర్టీజీఎస్ ప్ర‌తి మండ‌లాన్ని అంచ‌నా వేసింది. తుపాన్ ప్ర‌భావం ఏఏ మండ‌లానికి ద‌గ్గ‌ర్లో ఉంది, ఎంత దూరంలో ఉంది అన్న అంశాల‌ను ప్ర‌తి క్ష‌ణం ప‌ర్య‌వేక్షించ‌గ‌లిగింది. ఆయా మండ‌లాల్లో ఎంత వేగంలో గాలులు వీస్తున్నాయి, ఎంత వ‌ర్షం ప‌డుతుందో కూడా రియ‌ల్ టైమ్‌లో అంచ‌నా వేయ‌గ‌లిగారు. తుపాన్ తీరం  దాటే స‌మ‌మంలో క‌విటి, మంద‌స‌, ఇచ్చాపురం మండ‌లాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో స‌గ‌టున 67 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైతే.. ఒక్క ఇచ్చాపురంలోనే 20 సెంటీమీట‌ర్ల వ‌ర్షపాతం న‌మోదైంది.
ఒక్క మ‌ర‌ణం న‌మోదు కాలేదు.. 
ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ ముంద‌స్తు స‌న్న‌ద్ద‌త చ‌ర్య‌ల వ‌ల్ల ఫోనీ తుపాన్ న‌ష్ట ప్ర‌భావాన్ని భారీగా త‌గ్గించ‌గ‌లిగింది ఆర్టీజీఎస్‌.  అక్క‌డక్క‌డ స్వ‌ల్పంగా ఆర్థిక న‌ష్టం క‌లిగించే సంఘ‌ట‌న‌లే త‌ప్ప‌.. ఎక్క‌డా ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. ప్రాణ న‌ష్టం లేకుండా తుపాన్లు దాటిపోయిన సంఘ‌ట‌న ఇటీవ‌లి కాలంలో బ‌హుశా ఇదొక్క‌టే కావొచ్చు. మొత్త‌మ్మీద  మూడు ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఆ ఇళ్ల‌లోని బాధితుల‌ను  కూడా హుటాహుటిన పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. విద్యుత్ శాఖ‌కు సంబంధించి.. దాదాపు రెండు వేల విద్యుత్తు స్తంభాలు దెబ్బ‌తిన్నాయి. 117 స‌బ్ స్టేష‌న్ల‌లో, 120 ఫీడ‌ర్ల‌లో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేశారు. దీనివ‌ల్ల 733 గ్రామాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. తుపాన్ తీరం దాటాక విద్యుత్తు పున‌రుద్ద‌ర‌ణ చేశారు. విద్యుత్తు స్తంభాల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌న పున‌రుద్ధ‌రించే ప‌నులు చేస్తున్నారు. శ్రీకాకుళంలోని ఆరు మండ‌లాల్లో 553 హెక్టార్లలో పంట‌లు ధ్వంస‌మ‌య్యాయి. 900 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం త‌డిచిపోయింది. రాగి, వేరుశ‌న‌గ‌, మొక్క‌జొన్న‌, పొద్దుతిరుగుడు పంట‌లకు న‌ష్టం జ‌రిగింది. అర‌టి, కూర‌గాయ‌లు స‌హా 520 హెక్టార్ల‌లో ఉద్యాన‌వ‌న పంట‌లు దెబ్బ‌తిన్నాయి.
225 పున‌రావాస కేంద్రాలు
శ్రీకాకుళం జిల్లాల్లో 225 పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్క‌డ దాదాపు 20 వేల మందికి పున‌రావాసం క‌ల్పించి, రెండు రోజులుగా 1,14,524 మందికి భోజ‌న సదుపాయం క‌ల్పించారు. 41 మంది వైద్యులు, రెండొంద‌ల మంది స‌హాయ‌క సిబ్బందితో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మంచినీటి కొర‌త లేకుండా వాట‌ర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
1100 కాల్ సెంట‌ర్‌లో ప్ర‌త్యేక ఏర్పాట్లు
తుపాన్ బాధితుల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డానికి 1100 కాల్ సెంట‌ర్ ప‌రిష్కార వేదిక వ‌ద్ద‌ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. 19.38 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు ఐవీఆర్ కాల్స్ చేసి తుపాన్ సందేశాలు పంపారు. 11 వేల మందికి ఫోన్ చేసి.. తుపాన్ స‌మాచారం తెలుసుకున్నారు.
ఇంట్రా స‌ర్కిల్ రోమింగ్ 
తుపాన్ సంద‌ర్భంగా 140 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు వీస్తూ విద్యుత్తు అంత‌రాయం క‌లిగినా.. క‌మ్యూనికేష‌న్ వ్య‌వస్థ‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకునే క్ర‌మంలో.. ఇంట్రా స‌ర్కిల్‌ రోమింగ్ విధానాన్ని ఆర్టీజీఎస్ అమ‌ల్లోకి తెచ్చింది. ఏదైనా ఒక గ్రామంలో ఒక సెల్ స‌ర్వీసు ప్రొవైడ‌ర్‌కు చెందిన ట‌వ‌ర్ దెబ్బ‌తిన్నా.. అక్క‌డ‌కు స‌మీపంలోని మ‌రో స‌ర్వీసు ప్రొవైడ‌ర్‌కు చెందిన సెల్ ట‌వ‌ర్ ద్వారా సెల్‌ఫోన్ల‌కు సిగ్న‌ళ్లు వ‌చ్చేలా చేయ‌డ‌మే ఇంట్రా స‌ర్కిల్ రోమింగ్ విధానం. దీనికితోడు ప్ర‌తి సెల్ ట‌వ‌ర్ వ‌ద్ద జ‌న‌రేట‌ర్లు ఏర్పాటు చేయ‌డం ద్వారా క‌మ్యూనికేష‌న్‌కు ఇబ్బంది లేకుండా చేయ‌గ‌లిగారు. ఇలా ఇంట్రా స‌ర్కిల్ రోమింగ్ విధానం ప్ర‌వేశ‌పెట్ట‌డం కానీ, పెద్ద సంఖ్య‌లో సెల్ ట‌వ‌ర్ల వ‌ద్ద జ‌న‌రేట‌ర్లు ఏర్పాటు చేయ‌డం కానీ..  దేశంలో ఇదే మొట్ట‌మొద‌టి సారి. మొట్ట మొద‌టి సారి తుపాన్ ప్ర‌భావిత మండ‌లాల్లో  వైర్‌లెస్ ఎమ‌ర్జెన్సీ యాక్సెస్ (డ‌బ్ల్యూఈఏ)/ క‌మ‌ర్షియ‌ల్ మొబైల్ అలెర్ట్ సిస్ట‌మ్ (సీఏఎంస్‌)/  సెల్ బ్రాడ్‌కాస్టింగ్ స‌దుపాయం క‌ల్పించారు. దీని వ‌ల్ల‌ ఏ మొబైల్ ఫోన్ నుంచి అయినా.. ఫోన్ నెంబ‌రుతో ప‌నిలేకుండా అత్య‌వ‌స‌ర సందేశాలు పంపుకొనే స‌దుపాయం క‌ల్పించిన‌ట్ల‌యింది. ఈ విధానం ద్వారా మొత్తం 9 ల‌క్ష‌ల తుపాన్ హెచ్చ‌రిక‌, సూచ‌న‌ల సందేశాలను ఆర్టీజీఎస్ తుపాను ప్ర‌భావిత మండ‌లాల ప్ర‌జ‌ల‌కు పంపించ‌గ‌లిగింది. శ్రీకాకుళం జిల్లా క‌లెక్ట‌ర్ కూడా ఈ స‌దుపాయాన్ని స‌మర్థంగా వినియోగించుకుని.. ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు.
కునుకు వేయ‌ని ఆర్టీజీఎస్‌
ఫోనీ తుపాన్‌ నేప‌థ్యంలో ఆర్టీజీఎస్ అధికారులు, సిబ్బంది రేయింబ‌వ‌ళ్లూ ప‌నిచేశారు. కంటి మీద కునుకేయ‌కుండా.. అత్యంత స‌మ‌ర్థంగా ప‌నిచేసి.. పెను ముప్పును ప్ర‌భుత్వం స‌మ‌ర్థంగా ఎదుర్కొనేలా చేయ‌గ‌లిగారు.
ఒడిశాకు సాయం
ఫోనీ తుపాన్ తీవ్ర ప్ర‌భావం చూపనుంద‌న్న స‌మాచారం మేర‌కు.. ఒడీషా రాష్ట్రం మొద‌టి సారి ఆర్టీజీఎస్ సాయం కోరింది. తుపాన్ సందేశాల‌ను పంపి, స‌హ‌క‌రించ‌మ‌ని అభ్య‌ర్థించింది. ఒడీషా అధికారులు, అక్క‌డి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందించ‌డంలో ఆర్టీజీఎస్ అధికారులు కీల‌క‌పాత్ర పోషించారు. తుపాన్ ఎక్క‌డ ఏ ప్రాంతంలో తీరం దాటుతుంది, ఏ దిశ‌గా వెళుతుందీ అన్న స‌మాచారం ఆర్టీజీఎస్ అందివ్వ‌డం ఒడీషాకు మేలు చేకూర్చింది. ఈ స‌మాచారం ఆధారంగానే..  ఒడీషా ప్ర‌భుత్వం..  తుపాన్ సహాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయ‌గ‌లిగింది. ఆర్టీజీఎస్ అందించిన సాయానికి ఒడీషా ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా కృత‌ఙ‌త‌లు తెలిపింది. ఆర్టీజీఎస్ అవేర్ విభాగం ఇచ్చిన వాతావ‌ర‌ణ హెచ్చ‌రికలు త‌మ‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయని తెలిపింది. ఇది మన స‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శ‌నం.
రియ‌ల్ టైమ్‌లో మ‌దింపు
తుపాన్ న‌ష్టాన్ని రియ‌ల్ టైమ్‌లో మ‌దింపు వేసి బాధితుల‌కు సాయం అందేలా ఏర్పాట్లు చేసింది ఆర్టీజీఎస్‌. ఇందుకోసం క్రౌడ్ సోర్సింగ్ విధానం అమ‌లు చేస్తోంది. బాధితులు.. త‌మ‌కు వాటిల్లిన న‌ష్టం తాలూకూ ఫోటోలు తీసి పీపుల్‌ఫ‌స్ట్ యాప్‌లో అప్‌లోడు చేస్తే చాలు.. వాటిని క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తీసుకుని త‌క్ష‌ణం మ‌దింపు వేసి వారికి స‌కాలంలో న‌ష్ట ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకుంది. ఇందుకోసం ప్ర‌త్యేకించి ఫోనీ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసింది.
కోడ్ ఉన్నా కోలుకునేలా వ్య‌వ‌స్థ ఏర్పాటు చేశాం
విప‌త్తుల స‌మ‌యంలో ఎన్నిక‌ల కోడ్ స‌హాయ చ‌ర్య‌ల‌కు అడ్డంకిగా మారింది. అయిన‌ప్ప‌టికీ.. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ లాంటి స‌మ‌ర్థ వ్య‌వ‌స్థ ఉండ‌టం వ‌ల్ల‌.. రాష్ట్రాన్ని ర‌క్షించుకోవ‌డంతో పాటు, పొరుగు రాష్ట్ర‌మైన ఒడీషాకు కూడా సాయం అందించ‌గ‌ల‌గ‌డం సాధ్య‌మైంది.
ఆప‌ద‌లో ఆప‌న్న హ‌స్తం
ఫోనీ తుపాన్‌తో ఒడీషా తీవ్రంగా దెబ్బ‌తింది. దాని తీవ్ర‌తను గుర్తించి మ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి ముందుగానే స్పందించారు. ఒడీషా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా ఫోన్ చేసి సాయం అందిస్తామ‌ని చెప్పారు. త‌ద్వారా మ‌న పొరుగున ఉన్న‌వారు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకోవాల‌న్న‌ మాన‌వ‌తా ధృక్ప‌థాన్ని ఏపీ చాటింది. వారికి సాంకేతికంగానూ, ఇత‌ర‌ స‌హాయ చ‌ర్య‌ల్లోనూ ఇతోదిక సాయం చేసింది. ఇలా సాయ‌ప‌డ‌టం ఇది తొలిసారి కాదు. 1997లో ఇలాగే వ‌ర్షాల‌కు ఒడీషా తీవ్రంగా దెబ్బ‌తింటే.. అప్ప‌టి ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్‌సింగ్ గొమాంగోకు ఏపీ ఒక శాటిలైట్ ఫోన్ పంపింది.

Just In...