Published On: Fri, Jan 29th, 2021

మంగళగిరిలో వస్త్ర ప్రాసెసింగ్ యూనిట్

* ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు

మంగ‌ళ‌గిరి(గుంటూరు జిల్లా), సెల్ఐటి న్యూస్‌: గుంటూరు జిల్లా మంగళగిరిలో వస్త్ర ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు తెలిపారు. శుక్రవారం మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామ పరిధిలోని చేనేత జౌళి శాఖ సంచాలకుల కార్యాలయాన్ని ఆప్కో నిర్వహణా సంచాలకులు డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్‌తో కలిసి సందర్శించారు. సంచాలకుల కార్యాలయ ప్రాంగణంలోని ఈ-కామర్స్ విభాగం, గోదాములు, మగ్గాల షెడ్లను పరిశీలించారు. సరుకు నిల్వలకు సంబంధించి వివరాలను అడిగి  తెలుసుకున్నారు. అనంతరం వస్త్ర ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి అదే ప్రాంగణంలో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు మాట్లాడుతూ వస్త్ర ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మంగళగిరిలోని సంచాలకుల వారి కార్యాలయ ప్రాంగణం అనువైనదిగా భావిస్తున్నామన్నారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న షెడ్లను యూనిట్ స్థాపన కోసం ఉపయోగించుకుంటామన్నారు. పూర్తిగా కాటన్ తో తయారైన వస్త్రంతో యువతీ, యువకులకు రెడీమేడ్ షర్టులు, పంజాబీ డ్రెస్సులు, ఇతర దుస్తులను తయారు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేనేతల ఉన్నతి పట్ల ఎం తో శ్రద్ధ తీసుకుంటున్నారని, ప్రభుత్వ పరమైన అనుమతి తీసుకుని మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా వస్త్ర ప్రాసెసింగ్ యూనిట్ ను అతిత్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా చేనేత వస్త్రాలకు మార్కెట్లో డిమాండ్ పెరగడంతోపాటు ఎంతో మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చైర్మన్ మోహనరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ అదనపు సంచాలకులు మైసూర్ నాగేశ్వరరావు, ఆప్కో జీఏం లేళ్ల రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Just In...