Published On: Thu, Mar 14th, 2019

మంగళగిరి నియోజకవర్గాన్ని పద్మశాలియులకే కేటాయించాలి

* మంగళగిరి మినహా లోకేష్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు

* సముచిత స్థానం కల్పించిన రాజకీయ పార్టీలకే మా మద్దతు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: అత్యధికంగా పద్మశాలీలు ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని పద్మశాలియులకే  కేటాయించాలని శ్రీ పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి దివి మురళికృష్ణ డిమాండ్ చేశారు. గురువారం లబ్బీపేట వెంకటేశ్వరపురంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వ‌హించిన విలేక‌రుల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 నియోజకవర్గాల్లో గెలుపోటములు శాసించే స్థితిలో ఉన్నామన్నారు. మంగళగిరి, వెంకటగిరి, చీరాల, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు అసెంబ్లీ సీట్లను పద్మశాలియులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో మంగళగిరి, వెంకటగిరి, పొద్దుటూరు ఎన్నికలలో చీరాలలో మాత్రమే వివిధ పక్షాలు అనేక సందర్భాల్లో పద్మశాలీయులను అభ్యర్థిగా నిలిపారని, ఈసారి దాన్ని కూడా తీసివేయడం అన్యాయం చేయడంతో పాటు అవమానంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 13 శాతం ఉన్నామని దామాషా ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటరీ సీట్లు కేటాయించి పద్మశాలియులకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించాల‌ని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీల‌ను హెచ్చరించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీల సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. లోకేష్ కావాలంటే మిగిలిన 174 స్థానాల్లో పోటీ చేసుకోవచ్చునని, లోకేష్‌కి పద్మశాలీయుల మంగళగిరి అసెంబ్లీ సీటే కావాల్సి వచ్చిందా అని ఆయ‌న ప్రశ్నించారు. తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, తక్షణం మంగళగిరి, ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు, చీరాల, వెంకటగిరి, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలు 20 అసెంబ్లి నియోజకవర్గాలను పద్మశాలియులకు రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. విలేక‌రుల స‌మావేశంలో పద్మశాలీయుల రాష్ట్ర అధ్యక్షుడు గోలి భాస్కర్‌రావు, కోశాధికారి కొల్లి సాంబశివరావు, శ్రీ పద్మశాలియ సేవా సంఘం యువజన సంఘ అధ్యక్షుడు అవ్వారు శ్రీనివాసరావు (బుల్లబ్బాయి), చెన్నా సరళాదేవి, మండ్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Just In...